మీలో ఎవరు కోటీశ్వరుడు రివ్యూ

Sat,December 17, 2016 06:12 PM

హాస్యనటుడు పృథ్వీ కథానాయకుడిగా నటించిన చిత్రం....కామెడీ సినిమాలు తీయడంలో అనుభవమున్న సత్తిబాబు దర్శకుడు...పోస్టర్ నిండుగా పోసాని, రఘుబాబు లాంటి హాస్యనటులు కనిపించడంతో మీలో ఎవరూ కోటీశ్వరుడు సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది. కె. కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, శృతిసోధి కీలక పాత్రలను పోషించారు. స్ఫూఫ్‌లు, పంచ్ డైలాగ్‌లతో ఓ కొత్త తరహాలో వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే దర్శకనిర్మాతలు చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలించింది? పృథ్వీని హీరోగా నిలబెట్టిందా?లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే....


ప్రశాంత్(నవీన్‌చంద్ర) తెలివైన విద్యార్థి. చదువు తప్ప మరో ధ్యాస ఉండదు. అలాంటి యువకుడి జీవితంలోకి ప్రేమ పేరుతో ప్రియా(శృతిసోధి) ప్రవేశిస్తుంది. మొదట ప్రియాను దూరం పెట్టిన ప్రశాంత్ ఆ తర్వాత ఆమె మంచితనాన్ని చూసి ఇష్టపడతాడు. అయితే వారి ప్రేమకు ప్రియా తండ్రి ఏబీఆర్(మురళీకృష్ణ) అడ్డుచెబుతాడు. జీవితంలో ఓడిపోయినపుడే ఆనందం, ప్రేమ బంధాల గొప్పతనం తెలుస్తాయని, ఒక్కసారి ఓడిపోయి చూడమని ఏబీఆర్‌తో ప్రశాంత్ ఛాలెంజ్ చేస్తాడు. అతడి మాట ప్రకారం నష్టాలొచ్చే వ్యాపారం చేయాలనే ఆలోచనతో సినిమా తీయాలని నిర్ణయించుకుంటాడు ఏబీఆర్. అందుకోసం భారీ సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు, ఫ్లాప్‌ల దర్శకుడు రోల్డ్‌గోల్డ్ రమేష్ సహాయాన్ని కోరుతాడు. వారందరూ కలసి ఎలాంటి సినిమా చేశారు? ఈ ప్రయాణంలో వేరియేషన్ స్టార్ వీరబాబు, సమంతా ఎలా భాగమయ్యారు? సినిమా వల్ల ఏబీఆర్‌కు నష్టాలొచ్చాయా?లేదా? అనేది చిత్ర ఇతివృత్తం. ఓ సినిమా వల్ల ప్రేమ, ఆప్యాయతల విలువ తెలుసుకున్న ఓ వ్యక్తి కథ ఇది. పేరడీలు, చిత్రసీమలోని వాస్తవిక పరిస్థితులపై వినోదాన్ని జోడించి చూపించే ప్రయత్నం చేశారు.

ఇన్నాళ్లు కమెడీయన్‌గా అలరించిన పృథ్వీ మీలో ఎవరూ కోటీశ్వరుడు సినిమాతో హీరోగా అవతారమెత్తారు. పూర్తి నిడివి గల పాత్రలో కనిపించారు. అతడి పాత్రను పేరడీ సన్నివేశాలు, స్టార్ హీరోల పంచ్‌డైలాగ్‌లతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. అయితే ఈ సన్నివేశాల్లో వినోదం పాళ్లు తక్కువ కావడంతో పృథ్వీ పాత్ర ఆసక్తిని కలిగించలేదు. అతడు గతంలో నటించిన పలు సినిమాల్ని గుర్తుకు తెస్తుందే తప్ప ఎక్కడ కొత్తదనమనేది కనిపించదు. పృథ్వీ ఇమేజ్‌ను ఉపయోగిస్తూ ప్రేక్షకుల్ని నవ్వించాలని దర్శకనిర్మాతలు చేసిన ప్రయత్నాలన్నీ కథలో బలం లేకపోవడంతో వృథా ప్రయాసగానే మిగిలాయి. జూనియర్ ఇంటర్ చదివే మహేష్‌బాబుగా, వేరియేషన్ స్టార్ వీరబాబుగా రెండు పాత్రల్లో చక్కటి వైవిధ్యాన్ని కనబరిచారు పృథ్వీ. అక్కడక్కడ తన సంభాణలతో నవ్వించారు. పృథ్వీకి జోడీగా నటించిన సలోని పాత్ర సాదాసీదాగా ఉంది. ఆమె నటనలో వినోదం కనిపించదు. ఈ సినిమాలో అసలు హీరోహీరోయిన్లుగా నటించిన నవీన్‌చంద్ర, శృతిసోధి పాత్రలు ముఫ్పై నిమిషాలకు మించి కనిపించవు. వారు అతిథి పాత్రలు గానే మిగిలిపోయారు. వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాల్లో ద్వంద్వార్థాలు ఎక్కువయ్యాయి. పోసాని కృష్ణమురళి, రఘుబాబు వినోదం కొన్ని చోట్ల ఊరట నిస్తుంది. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పోసాని సంభాషణలు నవ్విస్తాయి. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యతలేదు.

దర్శకుడు సత్తిబాబు సినిమాల్లో వినోదానికి లోటు ఉండదు. ఒట్టేసి చెబుతున్నా, నేను, ఓ చినదానా, బెట్టింగ్ బంగార్రాజు చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన కొంత విరామం తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమాకు నాయకానాయికలు, మంచి నిర్మాత, పేరున్న హాస్యనటులు అన్నీ పక్కాగా కుదిరాయి. ఒక్క కథ తప్ప. స్ఫూఫ్‌లతో సినిమాను లాగించే ప్రయత్నం చేశారు తప్ప కథ, కథనాల గురించి ఆలోచించలేదు. చిన్న పాయింట్‌కు వినోదాన్ని జోడించి సినిమాను ముందుకు నడిపించారు. ఈ ప్రయత్నంలో అసలు కథను మర్చిపోయి ఉపకథపై దృష్టిపెట్టడం మైనస్‌గా మారింది. పోనీ అదైనా బాగుందా అంటే దాంట్లో కామెడీ పండించాల్సిన చోట సాగతీత ధోరణి ఎక్కువవడంతో తొలి సన్నివేశం నుంచి ముగింపు కార్డు వరకూ ఆద్యంతం నీరసంగా సాగుతుంది. పృథ్వీతో పాటు పోసాని, ప్రభాస్ శ్రీను, రఘుబాబుతో పాటు పలువురు కమెడీయన్‌లో ఉన్నా వారి పాత్రలను సరిగా ఉపయోగించుకోలేదు. కథలో వినోదం పడించడానికి అవకాశం ఉండి దర్శకుడు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. గతంలో వచ్చిన సుడిగాడు తరహాలో పలు హిట్ సినిమాల్లోని పేరడీ సన్నివేశాలతో సినిమా నడిపించే ప్రయత్నంలో విఫలమయ్యారు. దాంతో సినిమా ఇష్టానుసారం సాగుతున్న అనుభూతి కలుగుతుంది. కేవలం పృథ్వీ ఇమేజ్‌ను ఉపయోగించి సినిమాను నడిపించాలనే తాపత్రయం తప్ప మరో ఆలోచనేది దర్శనిర్మాతల్లో కనిపించలేదు. పాటలు, నేపథ్య సంగీతం నిరాశపరిచాయి. అరకు నేపథ్యంలో చిత్రీకరించిన పాటను కెమెరామెన్ అందంగా చిత్రీకరించారు. కె.కె.రాధామోహన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. టైటిల్‌కు సినిమాకు ఏ మాత్రం సంబంధం ఉండదు.
మీలో ఎవరు కోటీశ్వరుడు పేరడీ సన్నివేశాలతో సాగే వినోదాత్మక చిత్రం. కథ, కథనాల్లో నవ్యత కరువవ్వడంతో సాధారణ చిత్రంగా నిలిచింది. కొంత మేర మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు.
రేటింగ్: 2.5/5

2452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles