సీక్వెల్స్‌పై దృష్టి పెట్టిన నాగార్జున‌..!

Fri,March 22, 2019 08:40 AM
Nagarjuna concentrates on sequels

కింగ్ నాగార్జున చివ‌రిగా దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం విడుద‌లై చాలా రోజులే అవుతున్న‌ప్ప‌టికి ఇంత‌వ‌ర‌కు నెక్స్ ప్రాజెక్ట్ ఏంట‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు ఈ టాలీవుడ్ మ‌న్మ‌థుడు. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం నాగార్జున సీక్వెల్స్‌పైనే పూర్తి దృష్టి పెడుతున్నాడ‌ని తెలుస్తుంది. 2016లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై అశేష ప్రేక్షాక‌ద‌ర‌ణ‌ పొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రంలో బంగార్రాజు అనే పాత్ర‌లో నాగ్ త‌న న‌ట‌నతో ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. క‌ళ్యాణ్ కృష్ణ సీక్వెల్ స్క్రిప్ట్‌కి ఫినిషింగ్ ట‌చెస్ ఇస్తుండ‌గా, జూన్ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. సీక్వెల్‌కు బంగార్రాజు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

మ‌రోవైపు నాగ్ కెరీర్‌కి ట‌ర్నింగ్ పాయింట్ అయిన మ‌న్మ‌ధుడు చిత్రం సీక్వెల్‌కి సంబంధించి కూడా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించ‌నున్నాడు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఇక రాజుగారి గ‌ది ఫ్రాంచైజీలో భాగంగా వ‌చ్చిన రాజు గారి గది 2లో ఇంట్రస్టింగ్ రోల్ పోషించిన‌ నాగ్, ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రాజుగారి గది 3లో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుల‌కి సంబంధించి అతి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అయిన భారీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3కి నాగ్ హోస్ట్‌గా ఉంటార‌ని స‌మాచారం. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

1518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles