మమ్ముట్టిలోని మరో కోణం ఇదే..!

Sun,November 18, 2018 06:34 PM

అలనాటి క్లాసిక్ స్వాతికిరణం నుంచి నేటి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ యాత్ర వరకు మమ్ముట్టిది ఒక విభిన్నమైన నటన. వైవిధ్యమైన జీవితం. ఆయన మనకు గొప్ప నటుడే.. కానీ మలయాళీలకు మెగాస్టార్ కూడా. వెండితెర మీద సూపర్‌స్టార్‌గా ఉన్న ఆయన మరో కోణంలో ఎలా ఉంటాడో తెలుసా?

మలయాళం ఒక్కటే కాదు. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లిష్, కన్నడం వంటి ఏడు భాషల్లో 360లకు పైగా చిత్రాల్లో నటించాడు మమ్ముట్టి. ఆయన అసలు పేరు మహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పనిపరంబిల్, మమ్ముట్టి అనేది సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెట్టుకున్న పేరు. కేరళలోని అలప్పుజా జిల్లా చందిరూర్ గ్రామంలో జన్మించాడు. సామాన్య మధ్య తరగతికి చెందిన వ్యవసాయాధారిత ముస్లిం కుటుంబం వాళ్లది. తల్లి ఫాతీమా, తండ్రి ఇస్మాయిల్. భార్య సుల్ఫద్ కుట్టీ. ఇద్దరు పిల్లలు కూతురు సురుమి, కొడుకు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి జీవితంలో వివాహం కలిసొచ్చిందని నమ్ముతాడు. సుల్ఫద్ భార్య అయ్యాక ఆయన జీవితంలో కొత్త వెలుగులు నిండాయని ఆయన అభిప్రాయం. ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాతే సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావడమే కాకుండా, చాలా సినిమాలూ హిట్టయ్యాయి.

వ్యాపారవేత్త..రచయిత


టెలివిజన్ చానెళ్లను ప్రారంభించి వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు మమ్ముట్టి. మలయాళం కమ్యూనికేషన్స్ పేరుతో కైరాలి టీవీ, పీపుల్ టీవీ, వుయ్ టీవీ చానెళ్లను నడుపుతున్నాడు. తన ఆప్త మిత్రుడు ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌తో కలిసి ఓ సినిమా ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించి కొన్ని చిత్రాలను కూడా నిర్మించాడు. పలు టీవీ సీరియల్స్‌ను కూడా నిర్మించాడు. సొంతంగా టెక్నోటైన్మెంట్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీని నెలకొల్పాడు. మెగాబైట్స్ అనే మరో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి దాని ద్వారా కూడా ఎంతోమందికి ఉపాధి అవకాశాలను ఇస్తున్నాడు. మూలికలకు పుట్టినిల్లు కేరళ. తమ రాష్ట్రంలో దొరికే మూలికలతో ఎన్నో రోగాలు నయం అవుతాయని తెలుసుకొని హెర్బల్ వస్తువుల తయారీ సంస్థను మొదలుపెట్టాడు. ప్రజలకు అందుబాటులో ఉండేలా పతంజలి హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారాలను నడుపుతున్నాడు.
సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తన అనుభవాలను పంచుకుంటూనే మార్పు కోసం ప్రయత్నిస్తుంటాడు మమ్ముట్టి. తన రచనల ద్వారా మార్పు తీసుకురావాలని అనుకున్నాడు. అందులో భాగంగానే దృష్టి కోణం అనే పుస్తకాన్ని కూడా రాశాడు. మలయాళ మనోరమ దినపత్రికలో దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై తన విశ్లేషణలు రాస్తుంటాడు. సినిమా చిత్రీకరణ సమయంలో ఏమాత్రం ఖాళీ ఉన్నా పుస్తకాలు చదువుతూ ఉంటాడు.

మార్పు తన నుంచే..


కేరళ బేవరేజస్ కార్పొరేషన్ తలపెట్టిన యాంటీ డ్రగ్ క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా ఉంటూ యువతలో ఉన్న చెడు అలవాట్లను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాడు. వీధి బాలలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించేందుకు తన సొంత డబ్బుతో విద్యనందించే సౌకర్యాలు కల్పించాడు. చిన్నప్పటి నుంచే ఎదుటి వారికి సాయం చేసే గుణం ఉన్నది. దాంతో ఎవరు ఆపదలో ఉన్నా స్పందిస్తాడు. దేశం, సమాజం మారాలంటే మార్పు మన నుంచే మొదలవ్వాలని నమ్ముతాడు. వరదల కారణంగా దెబ్బతిన్న కేరళ బాధితులకు తనవంతు ఆపన్న హస్తం అందించాడు. పెయిన్ అండ్ పల్లేటివ్ కేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థకు ప్రతినెలా ఫండ్స్ అందజేస్తాడు. కేరళలో ఉన్న క్యాన్సర్ రోగులకు విడతల వారిగా పలు విధాలుగా వితరణ అందిస్తున్నాడు. ప్రజల మనసులో మంచి నటుడుగానే కాకుండా అందరి బాధలు తీరుస్తూ జనంలో ఒకడిగా ఉంటున్నాడు.

క్రీడాకారుడు..న్యాయవాది


కేరళలోని ఎర్నాకులంలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత రెండేండ్ల పాటు న్యాయవాదిగా పనిచేశాడు మమ్ముట్టి. చిన్ననాటి నుంచే చదువుతో పాటు ఆటలు కూడా ఆడేవాడు. ముఖ్యంగా వాలీబాల్‌లో రాణించి చాంపియన్‌గా అవ్వాలనుకున్నాడు. దానికోసం మైదానానికి వెళ్లి రోజూ ప్రాక్టీస్ చేసేవాడు. ఆటలు ఆడడం వల్ల మరింత ఉత్తేజాన్ని పొందవచ్చని తమ ఉపాధ్యాయుడు చెప్పాడని అప్పటి నుంచి మరింత సమయాన్ని క్రీడల కోసం కేటాయించాడు. నేటి యువతకు కూడా అదే విషయాన్ని చెబుతూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. వాలీబాల్ ఆటగాళ్లలో మరింతగా ఉత్సాహాన్నినింపేందుకు కేరళ వాలీబాల్ లీగ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో వ్యాయామం తప్పకుండా చేస్తాడు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ముఖ్యంగా జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడు. కానీ చికెన్ ఫ్రైతో పాటు మటన్ బిర్యానీ చాలా ఇష్టంగా ఆరగిస్తుంటాడు.

4161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles