అన్న‌య్య‌ గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోదామ‌నుకున్నా: ప‌వ‌న్‌

Thu,August 22, 2019 09:27 AM

రాజ‌కీయాల‌లోకి వెళ్ళిన త‌ర్వాత సినిమాల‌కి, సినిమా అభిమానుల‌కి పూర్తి దూరంగా ఉన్న ప‌వ‌న్ నిన్న శిల్ప క‌ళావేదిక‌లో జ‌రిగిన చిరు 64వ బర్త్‌డే వేడుక‌లకి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్‌ని చూసిన అభిమానుల‌కి ఆనందం హ‌ద్దులు దాటింది. కొంద‌రు స్టేజ్ పైకి వ‌చ్చి ఆయ‌న కాళ్ల‌పై ప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ త‌న అన్న త‌న‌కి స్పూర్తి ప్ర‌దాత అని, ఆయ‌న లేక‌పోతే తాను లేన‌ని చెప్పుకొచ్చాడు. ఓ మ‌హ‌నీయుడు జీవిత చ‌రిత్ర‌ని త‌న అన్న‌య్య చేయ‌డం చాలా ఆనంద‌గా ఉంద‌ని కూడా ప‌వ‌న్ పేర్కొన్నాడు.


అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘సైరా’ లో నటించినవారిలో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు అన్న‌య్య‌గారు కాగా, మ‌రొక‌రు అమితాబ్ బ‌చ్చ‌న్‌. ఈ సినిమా వ‌లన అమితాబ్ గారిని క‌లిసే అవ‌కాశం నాకు ద‌క్కింది అని ప‌వ‌న్ అన్నారు . మా అన్న‌య్య నాకు స్పూర్తి ప్ర‌ధాత అని ఎందుకు చెప్పానంటే ఇంట‌ర్మీడియెట్ ఫెయిల్ అయిన త‌ర్వాత నాలో నిరాశ‌, నిస్పృహ పెరిగాయి. అప్పుడు అన్న‌య్య వ‌ద్ద ఉన్న లైసెన్స్‌డ్ గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోదామ‌నుకున్నా. కాని ఆ రోజు అన్న‌య్య చెప్పిన మాట‌లు నాలో చాలా ధైర్యాన్ని పెంచాయి.

ఆ మధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. వారికి అన్న‌య్య లాంటి వారు ధైర్యం చెప్పి ఉంటే ఇలా జ‌రిగేది కాదేమో అని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరైనా ఏదైనా అంటే కోపంతో ఊగిపోయేవాణ్ణి. నా కోపాన్ని చూసిన అన్నయ్య వీడు ఉద్యమకారుడు అయిపోతాడేమో అనుకుని, ‘కులం, మతం అనేవాటిని దాటి మానవత్వం అనేది ఒకటుంటుంది. దాన్ని నీ ఉద్యమంలో, ఆలోచనలో మరచిపోకు’ అన్నారు. హద్దులు దాటకుండా నన్ను ఆపేసిన మాట అది.

22 ఏళ్ళ వ‌యస్సు ఉన్న‌ప్పుడు తిరుపతిలో నిర్మాత తిరుపతి ప్రసాద్‌గారు యోగాశ్రమం పెడితే నేను వెళ్లిపోయి ఐదారు నెలలు మా అన్నయ్యకి కనిపించకుండా ధ్యానం, యోగాసనాలు చేసుకుంటూ ఉన్నా. ఇక ఇదే బెట‌ర్ అనుకొని అలానే ఉండిపోతాను అని అన్న‌య్య‌కి చెప్పాను. కాని ఆయ‌న ఆ స‌మ‌యంలో .. భగవంతుడివై వెళ్లిపోతే ఎలా? సమాజానికి ఎందుకు ఉపయోగపడలేవ్‌.. ఇంట్లో బాధ్యతలు అనేవి ఉంటే ఇలా మాట్లాడవు’ అని అన్నారు. ఆ మాట‌లు నన్ను చాలా క‌దిలించాయి. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ని చూసిన త‌ర్వాతే ఈ రోజు నేను మీ ముందు ఇలా నిలుచున్నాను. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ‘సైరా’కి నేను గొంతు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.

మా అన్నయ్య సైరా లాంటి సినిమా చేస్తే చూడాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నాను. కానీ, ఇలాంటి గొప్ప సినిమా తీసే శక్తి, సమర్థత నాకు లేకపోయాయి. కానీ, నా తమ్ముడులాంటి రామ్‌చరణ్ ఆ ప‌ని చేశాడు. చరిత్ర మరచిపోయిన నరసింహారెడ్డి జీవిత కథని ఎంతోమంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా, చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఈ మాట వింటున్నా.. ఎవరికీ ధైర్యం సరిపోలేదు.. ఒక్క రామ్‌చరణ్‌కి తప్ప. ఇలాంటి సినిమా తీస్తే ఆ పాత్ర చిరంజీవిగారే చేయాలి, ఇలాంటి సినిమాని రామ్‌చరణే తీయాలి. సింహంలాటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చరిత్ర, భారతదేశ చరిత్ర ఆయన్ని మరచిపోయిందేమో కానీ, తెలుగునేల, మన కర్నూలు, రేనాడు, మన కొణిదెల మాత్రం మరచిపోలేదు. అలాంటి గొప్ప నేలలో పుట్టిన వీరుడి చరిత్రను సగర్వంగా తీశారు. మనందరికీ ఈ కథ చాలా స్ఫూర్తిదాయకం. కొణిదెల ప్రొడక్షన్‌ నుంచి ఇలాంటి సినిమా రావడం మాకు నిజంగా గర్వకారణం. కొణిదెల నామధేయాన్ని సార్థకత చేసుకున్నారు.

అన్నా నువ్వు ఈ సినిమాతో రికార్డులు బద్దలుగొట్టగలవు, అన్నా నువ్వు చరిత్ర తిరగరాయగలవు. అన్నా మేము మీకు బానిసలం, దాసోహం.. అందుకే నేను అరిచానన్నా. చరిత్ర మరచిపోయిన వీరుణ్ణి వెలికి తీసిన అన్నయ్య చిరంజీవిగారికి, కథా రచయితలకు, సురేందర్‌రెడ్డి, రామ్‌చరణ్‌గార్లకు, నా తల్లితర్వాత తల్లిలాంటి మా వదినగారికి(సురేఖ), నటీనటులందరికీ, ప్రత్యేకంగా అమితాబ్‌ బచ్చన్‌గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని ప‌వ‌న్ త‌న స్పీచ్ ముగించారు.

3719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles