ఇంప్రెసివ్‌ థ్రిల్లర్‌:‘రాక్ష‌సుడు’మూవీ రివ్యూ

Fri,August 2, 2019 03:18 PM

తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌, రాజీవ్‌ కనకాల, కాశీవిశ్వనాథ్‌, కేశవ్‌ దీపక్‌, రవిప్రకాష్‌ తదితరులు
కెమెరా: వెంకట్‌ సి దిలీప్‌
సంగీతం: జిబ్రాన్‌
కథ, స్క్రీన్‌ప్లే: రామ్‌కుమార్‌
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
దర్శకత్వం:రమేష్‌ వర్మ


థ్రిల్లర్‌ కథా చిత్రాలకు ఉండే వెసులుబాటు ఏమిటంటే అవి ఏ భాషా ప్రేక్షకులకైనా కనెక్ట్‌ అవుతాయి. కథలో ఓ ఛేదించాల్సిన ఓ సమస్య ఉంటూ దానిని ఉత్కంఠభరితంగా తెరపై చెప్పగలిగితే థ్రిల్లర్‌ సినిమాలు ఎక్కడైనా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటాయి. అలాంటి తమిళ చిత్రమే ‘రాచ్చసన్‌'. దీనికి తెలుగు రీమేక్‌గా ‘రాక్షసుడు’ చిత్రాన్ని రూపొందించారు. కెరీర్‌ ఆరంభం నుంచి కమర్షియల్‌ ఇతివృత్తాలకు ప్రాధాన్యతనిస్తున్న బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ తొలిసారి ఓ పరిశోధాత్మక థ్రిల్లర్‌లో నటిస్తూ తనలోని మరో పార్శాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. గత కొంతకాలంగా పరాజయాలతో సతమతమవుతున్న సాయిశ్రీనివాస్‌ ‘రాక్షసుడు’తో ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకున్నాడు? మాతృక తరహాలో ఈ రీమేక్‌ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించగలిగిందా? ఈ అంశాలన్ని తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..

కథ సంగ్రహణం:
అరుణ్‌కు (బెల్లంకొండ శ్రీనివాస్‌) దర్శకుడు కావాలన్నది లక్ష్యం. స్క్రిప్ట్‌లు పట్టుకొని నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగినా పరిస్థితి ఎక్కడా ఆశాజనకంగా కనిపించదు. అయితే ఓ సైకో థ్రిల్లర్‌ కథ కోసం ప్రపంచవ్యాప్తంగా సైకోపాత్‌లు చేసే నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంటాడు. దర్శకుడు అవ్వాలనే ఆశ నెరవేరే పరిస్థితులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎస్‌.ఐ.గా ఉద్యోగంలో చేరతాడు. అప్పటికే నగరంలో వరుసగా అమ్మాయిలు అదృశ్యమై అత్యంత పాశవికంగా హత్య చేయబడుతుంటారు. ఈ కేసులకు సంబంధించిన కీలకమైన ఆధారాలను సేకరించిన అరుణ్‌ హత్యలకు కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. అయితే పై అధికారుల ఒత్తిడి వల్ల తన ఇన్వెస్టిగేషన్‌ను సజావుగా సాగించలేకపోతాడు. ఈలోగా అరుణ్‌ మేనకోడలును కూడా కిడ్నాప్‌ చేసి హత్య చేస్తారు. ఈ పరిస్థితుల్లో అరుణ్‌ ఏం చేశాడు? వృత్తిపరంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ చివరకు సైకోను ఎలా అంతమొందించాడు? వరుస హత్యలకు కారణమైన సైకో వెనకున్న కథేమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా మిగతా చిత్ర కథ నడుస్తుంది..

కథా విశ్లేషణ...
థ్రిల్లర్‌ చిత్రాలకు కథకంటే చిన్న కాన్సెప్ట్‌ను ఆసక్తికరమైన మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఎలా ఆవిష్కరించామన్నదే ప్రధానంగా ఉంటుంది. ‘రాక్షసుడు’ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌. అనేక చిక్కుముడులు, మలుపులతో కథను ఆసక్తికరంగా నడిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా హత్యలు చేస్త్తూ వాటి ద్వారా రాక్షసానందం పొందుతున్న ఓ భయంకర సైకోను పోలీసాఫీసర్‌ ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ప్రస్తుతం సమాజంలో చోటుచేసుకుంటున్న అమ్మాయిల కిడ్నాప్‌లు, హత్యల ఉదంతాల నేపథ్యంలో ఈ కథను నడిపించడంతో ప్రేక్షకులు తెరపై జరుగుతున్న సంఘటనలతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. ఈ కథలోని చిక్కుముడుల్ని దర్శకుడు రివీల్‌ చేసే విధానంగా ఆకట్టుకుంటుంది. ఆరంభంలోనే హత్యల వెనక ఓ సైకో వున్నాడనే విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది. అయితే అతనెవరనే విషయాన్ని ద్వితీయార్థం వరకు రివీల్‌ చేయకపోవడం, సైకో విషయంలో అనేక అనుమానాలతో కథను నడిపించడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మాతృకలోని స్క్రీన్‌ప్లేను యథాతథంగా ఫాలో అయ్యాడు దర్శకుడు. పరిశోధనలో అరుణ్‌ హత్యలకు సంబంధించిన ఆధారాలు సేకరించడం, సైకో గురించిన వివరాల్ని వెల్లడించడం ఉత్కంఠను పంచుతుంది. ఈ కథలో దర్శకుడు చక్కటి సైకోఅనాలిసిస్‌ చేశాడు. కొందరు వ్యక్తులు సైకోలుగా ఎందుకు మారతారు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? హత్యల ద్వారా వారు ఏ విధంగా మానసికానందం పొందుతారు? అనే విషయాల్ని సైంటిఫిక్‌గా తెలియజెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే ప్రస్తుత తరుణంలో పిల్లల క్షేమం పట్ల తల్లిదండ్రులు ఎంత జాగరుకతతో ఉండాలో అనే సందేశాన్ని కూడా అందించింది. చివరలో హంతుకుడ్ని పట్టుకునే క్రమాన్ని ఆసక్తికరంగా చూపించగలిగినా...ైక్లెమాక్స్‌ ఘట్టాలు కొంచెం సాగతీసిన భావన కలిగిస్తాయి. కథలో కుటుంబ భావోద్వేగాలు, సెంటిమెంట్‌ అంశాలు కూడా ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటాయి. పోలీస్‌ అంటే యాక్షన్‌ ఘట్టాలపై దృష్టిపెట్టకుండా పరిశోధనలో అరుణ్‌ మానసిక సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తమిళ మాతృక విజయవంతం కావడంతో ఆ కథలో ఎలాంటి మార్పులు లేకుండా రీమేక్‌ను తెరకెక్కించారు. చిత్రీకరణ విషయంలో సహజత్వానికి పెద్దపీట వేశారు. రా లొకేషన్లలో తీయడంతో ఈ థ్రిల్లర్‌ మరింత ఇంప్రెసివ్‌గా అనిపించింది.

నటీనటుల పనితీరు..
బెల్లకొండ శ్రీనివాస్‌ ఎస్‌.ఐ. పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌ కనబరిచాడు. సెంటిమెంట్‌ సన్నివేశాల్లో ఆయన అభినయం ఆకట్టుకుంది. ఇక అరుణ్‌ ప్రియురాలిగా అనుపమ పరమేశ్వరన్‌ పాత్ర చిన్నదే అయినా చక్కటి నటనను ప్రదర్శించింది. రాజీవ్‌ కనకాల, కాశీ విశ్వనాథ్‌ తమ పాత్రల పరిధుల మేర నటించారు. విలన్‌గా క్రిస్టోఫర్‌ పాత్రలో శరవణన్‌ మంచి నటన కనబరిచాడు. ఆయన మేకప్‌ భయంగొలిపే విధంగా అనిపిస్తుంది. వెంకట్‌ సి దిలీప్‌ ఛాయాగ్రహణం ఉన్నతంగా ఉంది. జిబ్రాన్‌ సంగీతం కథలోని ఉద్వేగాల్ని, ఉత్కంఠను చక్కగా ఎలివేట్‌ చేసింది. దర్శకుడు రమేష్‌వర్మ ఈ రీమేక్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా మాతృకలోని ఉత్కంఠ ఎక్కడా మిస్‌ కాకుండా చూసుకున్నాడు. కథను ఎక్కడా పట్టుతప్పకుండా ఆసక్తికరంగా నడిపించడంలో కృతకృత్యుడయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సాంకేతికంగా అన్ని విభాగంలో ఈ సినిమా చక్కగా కుదిరింది.

తీర్పు...
థ్రిల్లర్‌ జోనర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు కావాల్సిన హంగులున్న చిత్రమిది. ఎక్కడా బోర్‌ కొట్టకుండా కథలోని ఉత్కంఠను ఫీల్‌ అవుతారు. అయితే తమిళ రీమేక్‌ అని కాకుండా స్ట్రెయిట్‌ తెలుగు చిత్రమనే భావనలో సినిమా చూస్తే ఈ ‘రాక్షసుడు’ మరింత థ్రిల్‌ని అందిస్తాడు.

రేటింగ్‌: 3/5

4423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles