సమ్మోహనం సినిమా రివ్యూ

Fri,June 15, 2018 04:36 PM
Sammohanam movie review

తెలుగు చిత్రసీమలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిది ప్రత్యేకమైన పంథా. తెలుగుదనానికి మనవైన భావోద్వేగాలు, అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ సినిమాల్ని తెరకెక్కిస్తుంటారాయన. తొలి సినిమా నుంచి విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాల్ని చేస్తున్న ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం సమ్మోహనం. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరీ జంటగా నటించారు.

విజయ్(సుధీర్‌బాబు) ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేస్తాడు. చిల్డ్రన్స్ బుక్స్ ఇల్లస్ట్రేటర్‌గా పేరుతెచ్చుకోవాలనేది అతడి కల. సినిమాల్ని ద్వేషిస్తుంటాడు. ఆ ప్రపంచం, తారలు చెప్పే మాటలు అబద్ధం అని భావిస్తుంటాడు. విజయ్ తండ్రి తన ఇంటిని ఓ సినిమా చిత్రీకరణ కోసం ఇస్తాడు. ఆ సినిమాలో హీరోయిన్ సమీరా రాథోడ్( అదితిరావ్‌హైదరీ) ముంబాయి నుంచి రావడంతో తెలుగు సంభాషణలు సరిగా చెప్పలేక ఇబ్బందులు పడుతుంటుంది. దాంతో విజయ్ ఆమెకు డైలాగ్‌లు చెప్పడంలో శిక్షణ ఇస్తాడు. కొద్ది పరిచయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వ్యక్తిగత సమస్యల కారణంగా విజయ్ ప్రేమను సమీరా తిరస్కరిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? సినిమాలపై విజయ్‌కి ఉన్న అపోహలు సమీరా పరిచయంతో ఎలా తొలగిపోయాయి? సమీరా వ్యక్తిగతసమస్యల్ని విజయ్ ఎలా పరిష్కరించాడు?వారిద్దరు ఏలా ఏకమయ్యారన్నదే ఈ చిత్ర కథ.
కుటుంబ బంధాలు, ప్రేమకథకు సినిమా నేపథ్యాన్ని, తారల తెరవెనుక జీవితాల్ని సమ్మిళితం చేసి కథను అల్లుకున్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. వెండితెరపై అందం, అభినయంతో ప్రేక్షకుల్ని ఆనందపరిచే తారల జీవితాల్లో మరో పార్శాన్ని ఈసినిమాలో చూపించారు. తమకు నచ్చినట్లుగా జీవించే క్రమంలో వారు ఎదుర్కొనే సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరించారు. అలాగే సినిమా రంగం, తారల జీవితాల పట్ల సగటు ప్రేక్షకుడిలో తలెత్తే అనేక అపోహల్ని ఈ సినిమాలో చర్చించారు. అవన్నీ అవాస్తవాలేనని, సినిమాల్ని ప్రాణంగా ప్రేమించి కష్టపడేవారున్నారని ఇండస్ట్రీలో ఉంటారని చూపించిన విధానం మెప్పిస్తుంది. క్యాస్టింగ్‌కౌచ్, హీరోల ప్రవర్తన కారణంగా కథానాయికలు ఎదుర్కొనే ఇబ్బందులు, సహాయ నటుల కోసం పరాయి భాషల వారిపై ఆధారపడుతున్న తీరు.. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ వాస్తవిక పరిస్థితిని వినోదాత్మక కోణంలో చూపించారు.

సినిమా వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూనే అంతర్లీనంగా ప్రేమకథను నడిపించిన తీరు బాగుంది. సినిమాలంటే గిట్టని ఓ యువకుడికి, ఓ అగ్ర కథానాయికకు మధ్య ప్రేమయాణాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరీ మధ్య వచ్చే ప్రతి సన్నివేశం అలరిస్తుంది. ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌లు లేకుండా కథలోనే నుంచి వినోదాన్ని పండించిన తీరు బాగుంది. ప్రథమార్థంలో ఉన్న వేగం ద్వితీయార్థంలో కొంత మందగించింది. కొన్ని సన్నివేశాలను సుధీర్ఘంగా తెరకెక్కించడంతో సాగతీసిన అనుభూతి కలుగుతుంది. ద్వితీయార్థంలో వచ్చే మలుపుల్లో ఆసక్తి లోపించింది. ఆ లోపాల్ని కనిపించకుండా చేసి దర్శకుడు ప్రతిభను చాటుకున్నారు.

నటుడిగా సుధీర్‌బాబును కొత్త కోణంలో ఈ సినిమా ఆవిష్కరించింది. వినోదం, భావోద్వేగాల్ని పండించడంలో పరిణితి కనబరిచాడు. అదితీరావ్ హైదరీ ఇదే తొలి తెలుగు సినిమా అయినా తన అభినయంతో ఆకట్టుకుంటుంది. అందంగా కనిపిస్తూనే చక్కటి హావభావాల్ని ప్రదర్శించింది. తన పాత్రకు తానే సంభాషణలు చెప్పుకొని ప్రతిభను నిరూపించుకుంటుంది. సీనియర్ నరేష్, పవిత్రాలోకేష్‌లకు ఈ సినిమాలో మంచి పాత్రలు దక్కాయి. నటుడిగా తనను తాను తెరపై చూసుకోవాలని కలలు కనే వ్యక్తిగా నరేష్ చేసే ప్రయత్నాలు నవ్విస్తూనే మనసుల్ని కదిలిస్తాయి. రాహుల్‌రామకృష్ణ, అభయ్‌లు కనిపించేది తక్కువే అయినా చక్కటి హాస్యాన్ని పండించారు.

చిన్న సినిమా అయినా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. పి.జి. విందా ఛాయాగ్రహణం సినిమా కొత్త శోభను తీసుకొచ్చింది. వివేక్‌సాగర్ బాణీలు,నేపథ్య సంగీతం, శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
మూసధోరణికి భిన్నంగా సున్నితమైన కథాంశాన్ని వినోదభరితంగా వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి విజయవంతమయ్యారు. నవతరం అభిరుచులకు తగ్గట్లుగా ఈసినిమాను తీర్చిదిద్దారు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ తెలుగు ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచే చిత్రమిది.
రేటింగ్: 3/5

4572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles