'సీత' కష్టాలు... Cinema review

Fri,May 24, 2019 03:40 PM
seetha movie review

దర్శకుడు తేజ దర్శకత్వంలో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తిపోయి చాలా రోజులవుతోంది. లక్ష్మీకల్యాణం సినిమా తరువాత నుంచి ఆయన చేసిన చిత్రాలేవీ ఆశించిన ఫలితాల్పి అందించకపోగా ఒక విధంగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. అందుకే ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. అయితే రానాతో రూపొందించిన నేను రాజు నేను మంత్రి సినిమా తరువాత తేజ సినిమా అంటే మళ్లీ క్రేజ్ మొదలైంది. తాజాగా తేజ రూపొందించిన చిత్రం సీత. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించడం, పైగా ఆమె ఇందులో నెగెటివ్ చాయలున్న పాత్రలో నటించడం, సినిమా టైటిల్‌పై వివాదం చెలరేగడం, ట్రైలర్ ఆసక్తికరంగా వుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. కమర్షియల్ యాక్షన్ చిత్రాల్లో నటించే బెల్లంకొండ శ్రీనివాస్‌ని ఇన్నోసెంట్‌గా చూపిస్తూ చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారం పేక్షకుల ముందుకొచ్చింది. అయితే అంతా ఊహించినట్టుగానే వుందా?. తేజ గత చిత్రాన్ని నమ్ముకుని థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడిని మెప్పించిందా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ
భాగ్యరాజ్ తన మేనల్లుడిని తన భార్య వేధిస్తోందని అతన్ని ఎలాగైనా తన నుంచి కాపాడాలని చిన్నతనంలోనే భూటాన్‌లో వున్న బౌద్ధ బిక్షువుల వద్దకు తీసుకెళ్లి ఇక నుంచి అతని సంరక్షణ మీరే చూసుకోవాలని వారికి రఘురామ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)ను అప్పగిస్తాడు. 20 ఏళ్లు నా అనే వాళ్లకు దూరంగా కల్మషం లేని మనుషుల మధ్య పెరిగిన రఘురామ్‌ని జీవితం అంటేనే డబ్బు మయం డబ్బుంటే అన్నీ మన దగ్గరికే వచ్చేస్తాయనే మనస్థతత్వమున్న సీత (కాజల్ అగర్వాల్) జనారణ్యంలోకి తీసుకొస్తుంది. జీవితంలోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలనుకునే రఘురామ్‌కి, జీవితం అంటేనే డబ్బు మయం ఆ డబ్బు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే సీతకి మధ్య వున్న అనుబంధం ఏమిటి?. తన స్వార్థం కోసం సీత రఘురామ్‌ను ఎందుకు అడ్డం పెట్టకోవాలనుకుంది. వీరిద్దరి మధ్యకు ఎమ్మెల్యే బస్వరాజ్( సోనూసూద్) ఎందుకొచ్చాడు?. అసలు బసవరాజుకు, సీతకు మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? దానివల్ల సీత చుట్టూ ఎలాంటి సంఘనటలు చోటు చేసుకున్నాయి?. వాటన్నింటి నుంచి సీతను రఘురామ్ ఎలా కాపాడాడు? చివరికి సీత మనసును ఎలా మార్చాడు అన్నది తెరపైన చూడాల్సిందే.

నటీనటుల నటన
డబ్బే సర్వస్వం అనుకునే మోడ్రన్ అమ్మాయిలకి ప్రతిబింబంగా కాజల్ పాత్రని దర్శకుడు తేజ మలిచారు. అయితే ఆ పాత్రకు తగ్గట్టుగా కథ, కథనాన్ని పక్కాగా రాసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడని స్పష్టంగా అర్థమవుతోంది. డబ్బే సర్వస్వం దాని కోసం ఎవరి జీవితాన్నైనా రిస్క్‌లో పెట్టి జారుకునే సీత పాత్రలో కాజల్ అగర్వాల్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాకు ప్రధాన బలం ఎవరైనా వున్నారంటే అది కాజల్ అగర్వాల్ మాత్రమే. అంత బాగా తన పాత్రని పండించింది. సోనూసూద్‌తో కలిసి నటించిన సన్నివేశాల్లోనూ, కోర్టు సీన్ సన్నివేశాల్లోనూ కాజల్ నటన ఆకట్టుకుంటుంది. అయితే సీత పేరుతో బలమైన పాత్రని రాసుకున్న దర్శకుడు తేజ అంతే బలంగా కథానాయకుడి పాత్రని తెరపై ఆవిష్కరించలేకపోయాడని చెప్పాలి. భారీ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో అమాయకుడైన రఘురామ్ పాత్రలో నటించారు. స్వాతిముత్యం, దేవుడు చిత్రాల్లో కమల్‌హాసన్, బాలకృష్ణలు పోషించిన పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని తేజ ఈ పాత్రని రాసుకున్నట్టున్నారు. దానికి బౌద్ధ బిక్షువుల నేపథ్యాన్ని జోడించారు. అయితే ఆసక్తికరంగా వుండాల్సిన కథానాయకుడి పాత్ర రీళ్లు మారుతున్నా కొద్దీ సగటు ప్రేక్షకుడికి చిరాకు పుట్టించేలా వుంది. కాజల్ పక్కన నటించిన మన్నారా చోప్రా వేసుకున్న టాప్ బటన్ ఊడిపోతే పెట్టే సన్నివేశాలు, ఛాయ్ కావాలి అంటూ హీరో శ్రీనివాస్ చేసే అరుపులు ప్రేక్షకులకు అసహనాన్ని కలిగిస్తాయి. బస్వరాజ్ పాత్రని మలిచిన తీరు కూడా సిల్లీగా అనిపిస్తుంది. తన పాత్ర పేలవంగా వున్నా దాన్ని రక్తికట్టించడానికి సోనూసూద్ ప్రయత్నించాడు. రక్తచరిత్రలో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించిన అభిమన్యుసింగ్‌ని ఇందులో బఫూన్‌ని చేసి ఆడించారు. అందరితో పోలిస్తే తనికెళ్లభరణి పాత్ర కొంచెం బెటర్. సోనూసూద్ పక్కనే వుంటూ సెటైర్లతో ఆడుకునే తీరు కొంత కామెడీని పండిస్తుంది. సోనూసూద్‌కి అసిస్టెంట్‌గా కనిపించిన బిత్తిరి సత్తి నవ్వించలేకపోయాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం
శీర్షారే ఛాయాగ్రహణం బాగుంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది రచయిత లక్ష్మీ భూపాల మాటలే. ఈ చిత్రానికి కూడా ఆయనే మాటలు అందించారు. కొంత వరకు తన మాటలతో సినిమాని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. నా పేరు సీత నేను గీసిందే గీత వంటి డైలాగ్‌లతో పాటు తనికెళ్ల భరణి, సోనూసూద్ మధ్య వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో నవ్వించాయి. కానీ బలమైన కథ, కథనాలు కొరవడటంతో లక్ష్మీ భూపాల్ కూడా చేతులెత్తేయాల్సివచ్చింది. తేజ సినిమాలతో తన సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనూప్ రూబెన్స్ తన కిచ్చిన పనిని సమర్థవంతంగా చేశాడు. బుల్ రెడ్డి, రోలా రోలా...కోయిలమ్మ.. వంటి పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెండు గంటల్లో తేల్చాల్సిన కథని సాగదీస్తూ వెళ్లారు. ఆ విషయంలో ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుకి స్వేఛ్చని దర్శకుడు ఇవ్వనట్లుగా కనిపిస్తుంది.

దర్శకుడి పనితీరు
నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో మళ్లీ ట్రాక్‌లో కొచ్చారు దర్శకుడు తేజ. ఈ సినిమా తరువాత ఆయన నుంచి మరో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో తొలిసారి నెగెటవ్ షేడ్స్ వున్న పాత్ర చేస్తోంది అనేసరికి సినిమా ఎలా వుంటుందో అనే అంచనాలు పెరిగాయి. అయితే సీత పాత్రను ప్రభావవంతంగా తీర్చిదిద్దిన దర్శకుడు తేజ దాన్ని మరింత అందంగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. పాత్రని రాసుకున్న తేజ దానికి తగ్గ కథని, కథనాన్ని గాలికి వదిలి వేయడం ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్‌గా మారింది. మారుతున్న ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టగా కాకుండా తనకు నచ్చిన విధంగా చిత్రాన్ని తెరకెక్కించనట్లు సినిమా మొదలైన అరగంటకే తెలిసిపోతుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అన్నట్టుగా నాకు నచ్చింది తీశాను. నచ్చితే చూడండి లేకపోతే వదిలేయండి అని దర్శకుడు తేజ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుంది. చివరగా ఒకమాట సినిమా ఎలా వుందంటే తెరపై డబ్బు కోసం కష్టాలు పడుతున్న సీతకి థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రేక్షకుకి పెద్ద తేడా ఏమీ కనిపించదు. కష్టాలు సీతకే కాదు సినిమాను చూసే ప్రేక్షకులకు కూడా తప్పవు అన్నట్టుగా వుందీ సినిమా.
రేటింగ్:2/5


4018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles