ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

Thu,June 27, 2019 06:17 AM
Senior Director And Actor Vijaya Nirmala Passed Away

హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల(73) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమిళనాడులో 1946 ఫిబ్రవరి 20వ తేదీన విజయనిర్మల జన్మించారు. విజయ నిర్మల నటుడు సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి. విజయనిర్మలకు నరేష్ ఒక్కడే సంతానం. ఏడేళ్ల వయస్సులో బాలనటిగా తమిళచిత్రం మత్స్యరేఖతో అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయస్సులో పాండురంగమహత్యం చిత్రంలో తెలుగులో విజయనిర్మల పరిచయం అయ్యారు.

సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్‌స్టార్ కృష్ణతో విజయనిర్మల నటించారు. కృష్ణతో కలిసి 47 చిత్రాల్లో ఆమె నటించారు. విజయనిర్మల దర్శకత్వం వహించిన అత్యధిక చిత్రాల్లో హీరోగా కృష్ణ నటించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల గిన్నిస్ రికార్డులో సాధించారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, మలయాళంలో రెండువందలకు పైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కు పైగా చిత్రాలను నిర్మించారు.

విజయనిర్మల దర్శకత్వం వహించిన తొలిచిత్రం మీనా(1971), రంగులరాట్నం చిత్రంలో విజయనిర్మల హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. పూలరంగడు, సాక్షి, అసాధ్యుడ, బంగారుగాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతారామరాజు, తాతా మనుమడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్ని చిత్రాల్లో నటించారు. మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీరంగమ్మ, మూడుపువ్వులు-ఆరుకాయలు, కిలాడి కృష్ణుడు, భోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము - శిక్ష చిత్రాలకు దర్శకత్వం వహించారు. రఘుపతి వెంకయ్య అవార్డును విజయనిర్మల అందుకున్నారు.

ఏడేళ్ల వయస్సులో సోదరిరావు బాలసరస్వతి వద్ద ఆమె భరతనాట్యం నేర్చుకున్నారు. పి. పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. కృష్ణుడి వేషంలో బాలనటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కృష్ణుడి వేషంలో ఉన్న విజయనిర్మలకు ఎన్టీఆర్ దిష్టి తీశారు. రంగులరాట్నం చిత్రంలో కథానాయకగా విజయనిర్మల పరిచయం అయ్యారు. రంగుల రాట్నం చిత్రానికి ఆమె నంది పురస్కారం అందుకున్నారు. విజయనిర్మల తండ్రి స్వస్థలం చెన్నై, తల్లి స్వస్థలం నరసారావుపేట, కృష్ణ - విజయనిర్మల వివాహబంధానికి సాక్షి చిత్రమే కారణం. తిరుపతిలో కృష్ణను విజయనిర్మల వివాహం చేసుకుంది. కృష్ణతో వివాహం అయ్యాక నటించిన చిత్రం అమ్మకోసం. ‘పెళ్లి కానుక’ సీరియల్‌తో విజయనిర్మల బుల్లితెరపైనా మెప్పించడం గమనార్హం.

9245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles