ఉప‌రాష్ట్ర‌ప‌తి ఇంట్లో సైరా స్పెష‌ల్ షో.. వీక్షించిన చిరు, వెంక‌య్య‌

Thu,October 17, 2019 08:27 AM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి రీసెంట్‌గా విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ నర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. అయితే త‌న సినిమాని విస్తృతంగా ప్ర‌మోట్ చేసుకుంటున్న చిరు రీసెంట్‌గా ఏపీ సీఎం జ‌గ‌న్‌ని క‌లిసి సైరా సినిమా చూడాల‌ని కోరారు. ఇక బుధ‌వారం ఢిల్లీ వెళ్లిన చిరు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడిని క‌లిసి ఆయ‌న ఇంట్లో సైరా స్పెష‌ల్ షో ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఆయ‌న‌తో క‌లిసి సినిమాని చూసారు చిరు .


బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ.. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటస్ఫూర్తితో.. రూపొందించిన 'సైరా' చిత్రం బాగుంది. నటులు శ్రీ చిరంజీవి, శ్రీ అమితాబ్ బచ్చన్, దర్శకుడు శ్రీ సురేందర్ రెడ్డికి అభినందనలు. నిర్మాత శ్రీ రామ్ చరణ్ తేజ్ కు ప్రత్యేక అభినందనలు. ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం 'సైరా'. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణా దాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు అని వెంక‌య్య నాయుడు త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. సురేందర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
1354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles