మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. రేనాటి వీరుడు సైరా నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా, మూవీ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. యుద్ద సన్నివేశాలు, వీరోచిత ఘట్టాలు, భారీ డైలాగులు ప్రేక్షకుల మనసులని దోచుకున్నాయి. రీసెంట్గా ఈ చిత్రం 34 సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ పీరియాడికల్ మూవీని నేటి( నవంబర్ 21) నుంచి ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సైరా తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళం వెర్షన్లను ఆన్లైన్లో వీక్షించవచ్చు . హిందీ వెర్షన్ త్వరలోనే ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది.
చిత్రంలో చిరు, అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతారలతో పాటు విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, నిహారిక తమ పాత్రలకి చక్కగా న్యాయం చేశారు. దేశభక్తిని ఇనుమడించే ఈ సినిమాని కమర్షియల్ అంశాలతో చాలా చక్కగా తెరకెక్కించారు సురేందర్‌రెడ్డి . కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేసిన సైరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లనే రాబట్టింది.