‘తెనాలి రామకృష్ణ’ రివ్యూ..

Fri,November 15, 2019 03:10 PM

గత కొన్నేళ్లుగా పరాజయాల్ని ఎదుర్కొన్న సందీప్‌కిషన్‌ ఇటీవలే ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంతో తిరిగి విజయాల బాట పట్టారు. వినోదాత్మక చిత్రాలకు తెలుగులో కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు నాగేశ్వరరెడ్డి. వీరిద్దరి కలయికలో తొలిసారి రూపొందిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఎబీఎల్‌'. పూర్తిస్థాయి కామెడీ కథాంశంతో సందీప్‌కిషన్‌ కొంత విరామం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో దర్శకుడు నాగేశ్వరరెడ్డి
సందీప్‌కిషన్‌కు విజయాన్ని అందించాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..


తెనాలి రామకృష్ణ(సందీప్‌కిషన్‌) కర్నూలులో లాయర్‌. తండ్రి దుర్గారావు(రఘుబాబు) అతడిని ఓ పెద్ద లాయర్‌గా చూడాలని కలలుకంటాడు. కానీ రామకృష్ణ మాత్రం కేసులేవీ తన వద్దకు రాకపోవడంతో పెండింగ్‌ సమస్యల్ని రాజీ కుదురుస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. పెద్ద కేసును పరిష్కరించి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు రామకృష్ణ. కర్నూలులో ఓ జర్నలిస్ట్‌ను హత్య చేసిందనే ఆరోపణతో వ్యాపారవేత్త వరలక్ష్మిని(వరలక్ష్మి శరత్‌కుమార్‌) పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. రాజకీయ ప్రయాణానికి అడ్డుగా నిలుస్తుందనే నెపంతో ప్రత్యర్థి సింహాద్రినాయుడు (అయ్యప్ప శర్మ) ఆమెను ఈ నేరంలో ఇరికించే ప్రయత్నం చేశారని తెలుసుకున్న రామకృష్ణ ఆమెను నిర్ధోషిగా నిరూపిస్తాడు. అసలు ఆ హత్య ఎవరూ చేశారు?కర్నూల్‌ ప్రజలంతా దైవంగా కొలిచే వరలక్ష్మి నిజస్వరూపం ఏమిటి?న్యాయాన్ని గెలిపించడానికి రామకృష్ణ ఎలాంటి పోరాటం సాగించాడు?లక్ష్యసాధనలో ప్రియురాలు రుక్మిణి(హన్సిక) అతడికి ఎలా అండగా నిలిచింది అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.


కోర్టు డ్రామా నేపథ్యంలో వినోదాత్మక చిత్రాలు తెలుగులో అరుదుగానే వచ్చాయి. చెట్టుకిందప్లీడరు, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ లాంటి ఒకటి అరా చిత్రాలు తప్పితే ఈ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాల్ని తెరకెక్కించే ప్రయత్నాల్ని దర్శకులు పెద్దగా చేయలేదనే చెప్పాలి. అదే దర్శకుడు నాగేశ్వరరెడ్డితో పాటు సందీప్‌కిషన్‌ ఈ సినిమాను చేసేలా ఎగ్జెట్‌ చేసింది.

ప్రథమార్థం మొత్తం కేసుల రాక సందీప్‌కిషన్‌ పడే ఇబ్బందులతో సరదాగా సాగిపోతుంది. కేసు ఓడిపోతే ఫీజు వాపస్‌, వాలెట్స్‌తో చెల్లిస్తే డిస్కౌంట్‌ అంటూ అతడు చెప్పే సంభాషణలు నవ్విస్తాయి. తనకు తానో గొప్ప లాయర్‌గా ఊహించుకుంటూ హన్సిక చేసే హడావిడితో పాటు సందీప్‌కిషన్‌తో ఆమె ప్రేమాయణాన్ని కామెడీగానే తీర్చిదిద్దారు దర్శకుడు.లాజిక్‌లతో సంబంధం లేకుండా ప్రతిసీన్‌తో నవ్వించడానికే తపన పడ్డారు. ప్రత్యర్థుల పన్నాగాన్ని తిప్పికొడుతూ వరలక్ష్మిని నిర్ధోషిగా నిరూపించడానికి సందీప్‌కిషన్‌ చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థాన్ని మొదలుపెట్టారు.

వరలక్ష్మి నిజస్వరూపాన్ని తెలుసుకునే సన్నివేశంలోని మలుపు బాగుంది. తనకంటే ఎన్నో రేట్లు శక్తివంతుడైన శత్రువును తన భుజబలంతో కాకుండా బుద్ధిబలాన్ని నమ్ముకొని చట్టానికి పట్టించాలనే పథకాన్ని సీరియస్‌గా నడిపించాలనుకోకుండా దాని నుంచి కావాల్సినంత కామెడీని రాబట్టుకునే ప్రయత్నం చేశారు నాగేశ్వరరెడ్డి. హీరో, విలన్‌ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులన్నింటిని కామెడీ ట్రాక్‌లతో అల్లుకున్నారు. వెన్నెలకిషోర్‌, సప్తగిరి, ప్రదీప్‌, అన్నపూర్ణమ్మ, చమ్మక్‌చంద్ర కలయికలో వచ్చే ఈ సీన్స్‌ చాలా వరకు సినిమాను గట్టెక్కించాయి.

కథానేపథ్యం కొత్తదే అయినా దానిని తెరపై ఆవిష్కరించే విధానంలో దర్శకుడు నాగేశ్వరరెడ్డి రొటీన్‌ మార్గాన్ని అనుసరించారు. కేవలం నవ్వించాలనే ప్రయత్నం వలన కథాగమనంలో ఆసక్తి లోపించింది. కేసు గెలవడానికి ఆధారాల కోసం రామకృష్ణ చేసే అన్వేషణలో ఎక్కడ ఉత్కంఠ కనిపించదు. వేలాది కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు, రాజకీయబలం ఉన్న విలన్‌లు స్పైకెమెరాలను కనిపెట్టలేకచట్టానికి దొరికిపోవడం లాంటి సన్నివేశాల్లో లాజిక్‌ లోపించింది. కథలోని మలుపులు ఊహలకు అందేలా సింపుల్‌గా రాసుకున్నారు. రామకృష్ణ, రుక్మిణిలా ప్రేమాయణం టైమ్‌పాస్‌ వ్యవహారంగానే కనిపిస్తుంది తప్పితే కథలో అంతర్భాగంగా కనిపించదు. ద్వితీయార్థంలో హీరోయిన్‌ను పూర్తిగా పక్కనపెట్టారు.

లాయర్‌గా సందీప్‌కిషన్‌ హుషారైన నటనను కనబరిచాడు. ప్రాస సంభాషణలతో నవ్వించాడు. ఇదివరకటితో పోలిస్తే పరిణితితో కూడిన నటనను కనబరిచాడు. గ్లామర్‌ కోసమే హన్సికకు ఈ సినిమాలో స్థానాన్ని కల్పించారు. వారిద్దరి కెమిస్ట్రీ వర్కవుట్‌ కాలేదు. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో తన హావభావాలు, భావవ్యక్తీకరణతో వరలక్ష్మి ఆకట్టుకున్నది. తెలుగు ఉచ్ఛరణ విషయంలో జాగ్రత్త వహిస్తే బాగుండేది. ఆమె సొంతంగా డబ్బింగ్‌ చెప్పడంతో కొన్ని పదాల్ని సరిగా పలకలేకపోయింది. వెన్నెలకిషోర్‌, ప్రభాస్‌శ్రీను, రఘుబాబు, అన్నపూర్ణమ్మ, సప్తగిరి, పోసానికృష్ణమురళి, సత్యకృష్ణన్‌ ఇలా కామెడీ పరంగా ప్రతి ఒక్కరూ సినిమాకు బలంగా నిలిచారు.

తన శైలిలోనే కామెడీ చిత్రంగా తెనాలి రామకృష్ణను మలచడంలో దర్శకుడు నాగేశ్వరరెడ్డి కొంతవరకు విజయవంతమయ్యారు. సాయికార్తిక్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటల్లో టైటిల్‌సాంగ్‌ ఒకటి పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణవిలువలు మోస్తారుస్థాయిలోనే ఉన్నాయి.
సక్సెస్‌ఫుల్‌ సినిమాగా నిలబెట్టగల బలమైన కథ, కథనాలు సినిమాలో లోపించడంతో తెనాలి రామకృష్ణ యావరేజ్‌ స్థాయిలోనే నిలిచింది. సినిమాలోని మాస్‌ హంగులు, వినోదం కొంతవరకు బీ, సీ ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశం ఉంది.

రేటింగ్‌:2.5

2724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles