డియర్ కామ్రేడ్ రివ్యూ

Fri,July 26, 2019 02:23 PM

అర్జున్‌రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా విజయాలతో యువతరం ఆరాధ్య కథానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు విజయ్‌దేవరకొండ. తెరపై అతడి ఛరిష్మాతో వ్యక్తిగత జీవితంలోని విభిన్నమైన దృక్పథం అతడికి అంతులేని అభిమానగణాన్ని తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్‌ల తర్వాత విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. గీతగోవిందం సినిమాలో తమ కెమిస్ట్రీతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా కావడంతో ప్రారంభం నుంచే ఈ చిత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ జోడీ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? కొత్త దర్శకుడైన భరత్ కమ్మను నమ్మి విజయ్‌దేవరకొండ చేసిన ఈ సినిమా అతడికి సక్సెస్‌ను అందించిందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..


చైతన్య అలియాస్ బాబీ(విజయ్ దేవరకొండ) కాకినాడలో ఓ స్టూడెంట్ లీడర్. దేనికి భయపడని తత్వం తనది. ఆవేశం ఎక్కువే. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా తాను అనుకున్నది చేసి తీరుతాడు. అతడి జీవితంలోకి అనుకోకుండా అపర్ణాదేవి అలియాస్ లిల్లీ (రష్మిక మందన్న) ప్రవేశిస్తుంది. బాబీ పక్కింట్లో దిగుతుంది. లిల్లీ అమయాకత్వం, అల్లరి మనస్తత్వం చూసి బాబీ ఆమెను ప్రేమిస్తాడు. తొలుత బాబీ ప్రేమను తిరస్కరించిన లిల్లీ కూడా అతడిని ఇష్టపడతుంది. బాబీ కోపం, ఆవేశం కారణంగా కొద్దిరోజుల్లోనే లిల్లీ అతడికి దూరమవుతుంది. లిల్లీ జ్ఞాపకాల నుంచి దూరమయ్యేందుకు ప్రపంచం గురించి తెలుసుకొనే ప్రయత్నంలో దేశాటనలో ఉన్న బాబీకి మూడేళ్ల తర్వాత క్రికెట్‌కు దూరమై మానసిక సమస్యలతో బాధపడుతూ ఓ హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న లిల్లీ కనిపిస్తుంది. తిరిగి ఆమెను బాబీ మామూలు మనిషిని చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? లిల్లీ క్రికెట్‌కు ఎందుకు దూరమైంది?లిల్లీ కోసం బాబీ ఎలాంటి పోరాటం చేశాడు?బాబీ ప్రేమను లిల్లీ ఎలా గుర్తించింది? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

మనం ప్రేమించే వాటి కోసం దేనికి, ఎవరికి భయపడకుండా పోరాటం చేయాలి. ఈ పోరాటంలో మన వెంట కడవరకు ఉండేవాడే నిజమైన కామ్రేడ్ అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకొని దర్శకుడు భరత్‌కమ్మ ఈ కథను రాసుకున్నారు. సమాజంలో చాలా మంది అమ్మాయిలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని వెల్లడించడానికి భయపడుతున్నారు. పరువు గురించి ఆలోచించో, భయంవల్లనో కుటుంబ సభ్యులు కొన్ని సార్లు వారిని వెనక్కిలాగుతున్నారు. అలా చేయడం తప్పు. వారికి న్యాయం చేయడానికిఎవరో ఒకరు ముందుకు రావాలనే సందేశానికి ఓ జంట ప్రేమకథను, వారి భావోద్వేగాల్ని జోడిస్తూ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. కష్టసుఖాల్లో ప్రియురాలికి ఓ కామ్రేడ్ ఎలా అండగా నిలిచాడు..ఐదేళ్ల ప్రయాణంలో ఆ జంట జీవితంలోని మధురానుభూతులు, అవరోధాల్ని కవితాత్మకంగా హృదయానికి హత్తుకునేలా సినిమాలో ఆవిష్కరించారు.

కాలేజ్ ఎపిసోడ్, బాబీ, లిల్లీ ప్రేమాయణంతో ప్రథమార్థం ఆహ్లాదభరితంగా సాగిపోతుంది. ఆవేశం, ధిక్కార స్వభావంతో విజయ్ తన స్నేహితులతో కలిసి చేసే పనులన్నీ నిజమైన కాలేజ్ వాతావరణాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తాయి. లిల్లీ పాత్ర పరిచయంతోనే కథను లవ్‌ట్రాక్‌లోకి మళ్లించారు దర్శకుడు. బాబీని లిల్లీ ఆటపట్టించడం, క్రికెటర్‌గా లిల్లీ ప్రతిభను చాటే సన్నివేశాలన్నీ సహజంగా నిజజీవితాలకు దగ్గరగా తీర్చిదిద్దారు. బాబీని విడిచి లిల్లీ దూరంగా పోవడంతో ప్రథమార్థాన్ని ముగించిన దర్శకుడు ద్వితీయార్థంలో తిరిగి వారు ఎలా కలుసుకున్నారు?లిల్లీ కలల సాధనలో బాబీ ఆమెకు ఎలా తోడుగా నిలిచాడు? ఆమె సమస్యలపై ఎలాంటి పోరాటం సాగించాడో చూపిస్తూ ఎమోషనల్‌గా నడిపించారు. పతాక ఘట్టాల్ని సందేశాన్ని జోడిస్తూ తీర్చిదిద్దారు. అవకాశాల్ని ఎరగా చూపిస్తూ మహిళలపై కొందరు ఎలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు? ప్రతిభ ఉండి కూడా తమ కలల్ని సాధించలేక చాలా మంది క్రీడాకారులు ఎలాంటి సంఘర్షణకు లోనవుతున్నారో భావోద్వేగభరితంగా చూపించారు.

దర్శకుడు భరత్ కమ్మ కథనాన్ని చాలా నెమ్మదిగానడిపించారు. దాంతో సినిమా ఆద్యంతం సాగదీసినట్లుంటుంది. కథకు ఆయువుపట్టుగా నిలిచిన కీలకమైన పాయింట్‌లో కొత్తదనం లేదు. ఈ రొటీన్ పాయింట్‌ను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు చాలా తడబడిపోయారు. ద్వితీయార్థం చాలా సన్నివేశాల్లో ఫ్లో కనిపించదు. నాయకానాయిక విడిపోయి మళ్లీ కలుసుకునే సన్నివేశాల్లో ఎమోషన్, సంఘర్షణ సరిగా పండలేదు. ప్రేమకు, కలలకు మధ్య నలిగిపోయే యువతిగా రష్మిక మందన్న పాత్రను భావోద్వేభరితంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు కన్ఫ్యూజన్‌కు లోనయ్యారు. విజయ్ ఎందుకోసం పోరాటం చేస్తున్నాడో అర్థం కాదు. ప్రతి సన్నివేశాన్ని పోయెటిక్, అందంగా మలచాలనే దర్శకుడి తాపత్రయం చాలా చోట్ల డామినేట్ చేస్తూ కథను పక్కదారి పట్టించింది. కథలో లోపాలున్న విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాను. తనదైన శైలి నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీతో ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి కృషిచేశారు.

విప్లవకారుల కుటుంబంలో జన్మించిన బాబీ అనే విద్యార్థి నాయకుడిగా ఈ సినిమాకు వన్‌మెన్‌షోగా నిలిచారు విజయ్ దేవరకొండ. ఆవేశపూరితుడిగా, ప్రేమ కోసం తపించే వ్యక్తిగా, ప్రియురాలి కోసం పోరాడే కామ్రేడ్‌గా భిన్న పార్శాలున్న పాత్రలో ఒదిగిపోయారు. లిల్లీ అనే మహిళా క్రికెటర్‌గా రష్మిక మందన్న భావోద్వేగభరిత పాత్రలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించి మెప్పించింది.విజయ్ స్నేహితులుగా కనిపించిన వారంతా సహజ నటనను కనబరిచారు.
జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమా మరో హీరోగా నిలిచాడు. సంగీతం, నేపథ్య సంగీతంతో కథలో ప్రతి ఒక్కరిని లీనం అయ్యేలా చేశారు. మెలోడీ ప్రధానంగా ఆయన స్వరపరచిన కడలల్లే, నీ నీలి కన్నుల్లోనాతో పాటు ప్రతి పాట మెప్పిస్తుంది. దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా దృశ్యకావ్యంలా తీర్చిదిద్దేందుకు ఛాయాగ్రాహకుడు సుజీత్‌సారంగ్ కృషిచేశారు. పాటలన్నీ అందంగా తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజయ్ దేవరకొండ అభిమానుల్ని ఈ సినిమా సంతృప్తిపరుస్తుంది. యువతలో అతడికి ఉన్న క్రేజ్, పాపులారిటీతో సినిమాకు చక్కటి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. నాలుగు రోజులు వరుసగా సెలవులు రావడం కలిసివచ్చింది. విజయ్‌దేవరకొండ ఇమేజ్ కమర్షియల్‌గా ఈ సినిమాను ఏ మేరకు గట్టెక్కిస్తుందో చూడాలి.
రేటింగ్:2.75/5

8901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles