గుండె జబ్బుతో చేరి..మెదడు వాపుతో మృతి

Wed,August 14, 2019 06:55 AM

13 year old boy dies after surgery

బేగంపేట: గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ బాలుడిని ఆరోగ్యశ్రీ కింద సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో చేర్పించగా శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు మెదడువాపుతో చనిపోయాడని చెప్పారు. శస్త్ర చికిత్స బాగానే జరిగిందని చెప్పి తెల్లవారే సరికి చనిపోయాడని చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దవాఖాన వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడని దవాఖాన ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం జలాల్‌పూర్‌కు చెందిన అయిలం వ్యవసాయ కూలీ. అతని పెద్ద కుమారుడైన రవి(13) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెలలో రవి అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉండే వైద్యులకు చూపించారు. అక్కడ బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఈ నెల 5న సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానకు తీసుకు వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడి గుండెలో రంధ్రాలు ఉన్నాయని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. అనంతరం ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేసేందుకు చేర్చుకున్నారు.

ఈ నెల 10న బాలుడికి శస్త్ర చికిత్స జరిగిన తర్వాత శస్త్ర చికిత్స విజయవంతమైందని వైద్యులు తెలిపారు. 11వ తేదీన బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత రవి మెదడువాపు వ్యాధితో చనిపోయాడని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. మంగళవారం బంధువులతో కలిసి దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడంటూ రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రవికి పూర్తి స్థాయిలో వైద్యం చేశాం

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రవికి శస్త్ర చికిత్సకు ముందు, తర్వాత వైద్యులు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వైద్య సేవలు అందించారు. అక్కడ నిర్లక్ష్యానికి ఎలాంటి తావులేదు. పూర్తి వైద్యం అందించినప్పటికీ బాబు మరణించడం మాకు బాధకరంగానే ఉంది. శస్త్ర చికిత్స తర్వాత ఎంఆర్‌ఐ స్కాన్ కూడా చేశాం. మెదడు పనితీరు సక్రమంగా లేదని తెలిసిన వెంటనే అదే రోజు కుటుంబ సభ్యులకు చెప్పాం. గుండె ఆగిపోవడంతోనే రవి చనిపోయాడు.
- భాస్కర్‌రావు, కిమ్స్ దవాఖాన ఎండీ

1561
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles