బీర్ తాగి.. సినిమా చూసి.. చోరీ చేస్తారు..

Thu,October 17, 2019 08:38 AM

(స్వాధీనం చేసుకున్న ఆభరణాలను పరిశీలిస్తున్న రాచకొండ అదనపు సీపీ సుధీర్‌బాబు)


జైల్లో పరిచయం.. తాళాలు ఉన్న ఇండ్ల రెక్కీ..అర్ధరాత్రి దొంగతనం ఇద్దరు అరెస్ట్
రూ. 16.35 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం
హైదరాబాద్: ముగ్గురు దొంగలకు జైల్లో పరిచయం.. బయటకు వచ్చి ముఠాగా ఏర్పడి తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేశారు. చోరీ చేసే ముందు బీరు తాగి సినిమాకు వెళ్తారు. అర్ధరాత్రి రెక్కీ చేసిన ఇంటిని కొల్లగొట్టుతారు. ఇలా చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాలోని ప్రధాన వ్యక్తిని గతంలో అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.16.35లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

రాచకొండ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. కడప జిల్లా చిన్న చౌక్ ప్రాంతానికి చెందిన బ్రహ్మమోదు రాజయ్య అలియాస్ గణేశ్, తమ్మాడ మోహన కృష్ణ అలియాస్ భార్గవ్, దొమ్మాట రామ్ ప్రసాద్‌లు పాత నేరస్థులు. ఈ ముగ్గురికి జైలులో పరిచయమైంది. చెడు వ్యసనాలకు అలవాటు పడి 2014 నుంచి నేరాలబాట పట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వీరిపై కేసులు నమోదయ్యాయి. రాజయ్యపై దాదాపు 20కి పైగా కేసులు ఉన్నాయి. తాజాగా.. ఈ ముగ్గురు కలిసి మేడిపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, ఆర్‌సీపురం ప్రాంతాల్లోని తాళం ఉన్న ఐదు ఇండ్లను కొల్లగొట్టారు. ఇందులో రామ్ ప్రసాద్‌ను గత నెల అరెస్ట్ చేయగా, రాజయ్య, మోహన కృష్ణలను బుధవారం అల్కాపురి క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఐదు చోరీల మిస్టరీ వీడిపోయింది. వీరి వద్ద నుంచి 42.6 తులాల బంగారం, 37 తులాల వెండి ఆభరణాలు మొత్తం 16.35 లక్షల విలువ చేసే సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో క్రైమ్ డీసీపీ యాదగిరి, అదనపు డీసీపీ సలీమా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తాళం ఉన్న ఇండ్లను రెక్కీచేసి...
ఈ దొంగలు.. తాళం ఉన్న ఇంటిని ముందే గుర్తిస్తారు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులను రెక్కీ చేస్తారు. చోరీకి ముందు రామ్‌ప్రసాద్ గదిలో బీర్ తాగుతారు. ఆ తర్వాత సినిమాకు వెళ్తారు. అర్ధరాత్రి వచ్చి రెక్కీ చేసుకున్న ఇంటిని కొల్లగొట్టుతారు. ఇలా ఈ ముగ్గురు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

1494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles