తల్లిని వేధిస్తున్నాడని.. అన్నను చంపేశాడు..

Thu,October 10, 2019 06:54 AM

మరణించిన సంతోష్ యాదవ్(ఫైల్ ఫోటో)
మారేడ్‌పల్లి : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి నిత్యం తల్లిని వేధిస్తున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు అన్నను బ్లేడ్‌తో గాయపర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం...రెజిమెంటల్‌బజార్‌కు చెందిన యాదమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు పర్ల సంతోష్‌యాదవ్ (32) గ్యాస్ కట్టర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం బొల్లారంకు చెందిన మాధురితో వివాహం జరిగింది. ఇతని తమ్ముడు సాయికుమార్ యాదవ్ పూల డెకరేషన్ పని చేస్తుంటాడు. వీరందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కాగా, మద్యానికి బానిసైన సంతోష్‌యాదవ్.. కొద్ది రోజులుగా తల్లి, భార్యతో గొడవ పడుతున్నాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో భార్య మాధురి పుట్టింటికి వెళ్లిపోయింది. మంగళవారం దసరా పండగ కావడంతో ఉదయం నుంచి సంతోష్‌యాదవ్ మద్యం సేవిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా.. రాత్రి 12 గంటల సమయంలో తల్లి జ్వరంతో మూడో అంతస్థులో పడుకుంది. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న సంతోష్‌యాదవ్ తల్లితో గొడవకు దిగి, ఆమెను కొట్టాడు. దీంతో తల్లి యాదమ్మ భయంతో కేకలు వేయగా.. సాయియాదవ్ పైకి వెళ్లాడు. అతను కూడా మద్యం సేవించి ఉండడంతో.. తల్లిని ఎందుకు కొట్టావు అని అన్నను నిలదీశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.


అనంతరం సంతోష్‌యాదవ్ పూల డెకరేషన్‌కు ఉపయోగించే బ్లేడ్‌తో తమ్ముడిపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే సాయి అన్న చేతిలో ఉన్న బ్లేడ్‌ను తీసుకొని దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సంతోష్‌యాదవ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య మాధురి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యా ప్తు చేస్తున్నారు. నిందితుడు సాయియాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

1528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles