సినిమా చూపిస్తామని బాలికలను నమ్మించి..

Mon,July 22, 2019 09:57 AM

man raped a 11 years old girl  arrested

సైదాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు బాలికలకు సినిమా చూపిస్తామని మాయమాటలు చెప్పి ఇద్దరు యువకులు బలవంతంగా ఓ పురాతన భవనంలోకి తీసుకెళ్లి బాలిక(11)పై లైంగిక దాడికి పాల్పడగా, మరో బాలిక కేకలు వేసింది. గమనించిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించిన ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. సైదాబాద్ సింగరేణికాలనీ గుడిసెల్లో నివసించే ఇస్లావత్ దస్రు(25) జొమోటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా, కేతావత్ మోతిలాల్(28)పాత సామగ్రిని సేకరించి విక్రయించేవాడు.

ఇతనికి మూడేండ్ల క్రితం వివాహం కాగా, భార్య విడాకులు ఇచ్చింది. అయితే సింగరేణికాలనీ గుడిసెల్లో నివసించే ఓ దంపతుల కుమార్తె తుర్కంజాల్‌లోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. సమీప బంధువైన మరో బాలిక(8)తో కలిసి శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్నారు. సుమారు 7గంటల సమయంలో స్థానికంగా నివసించే ఇస్లావత్ దస్రు, కేతావత్ మోతిలాల్ వారి వద్దకు వచ్చి గంగా థియేటర్‌లో ఫస్ట్‌షో సినిమా చూపిస్తామని, చాక్లెట్లు ఇప్పిస్తామని మాయమాటలతో నమ్మించి బలవంతంగా ద్విచక్ర వాహనంపై సరూర్‌నగర్ గంగా థియేటర్‌కు తీసుకెళ్లారు. థియేటర్‌కు తీసుకెళ్లకుండా సమీపంలోని పురాతన భవనంలోకి తీసుకెళ్లి బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు.

మరో బాలికను తీసుకెళుతుండగా స్థానికులను చూసి బాలికలు కేకలు వేశారు. దీంతో గమనించిన స్థానికులు వారిని ప్రశ్నించగా, ఇస్లావత్ దస్రు, కేతావత్ మోతిలాల్ పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. బాలికలను వైద్య పరీక్షలను నిమిత్తం దవాఖానకు పంపించి, భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇప్పించారు. నిందితులను అరెస్ట్ చేసి, ఆదివారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే కేతావత్ మోతిలాల్ పలువురు మహిళలను ఇదే ప్రదేశానికి రాత్రివేళల్లో తీసుకొచ్చి లైంగిక దాడులకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.

3094
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles