ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని గీతాభవన్ హోటల్ ఎదుట శుక్రవారం డ్రైవర్ అజాగ్రత్తతో నిండు ప్రాణం బలైపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని రాజా రామ్‌నగర్‌కు చెందిన వివాహిత పద్మ (45) రోడ్డు పక్కన వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఎస్ఎల్ఎన్ ట్రాన్స్‌ఫోర్ట్ ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మొదట ఈ ప్రైవేట్ బస్సు స్విఫ్ట్ డిజైర్ కారును ఢీకొట్టగా.. ఆ కారు కొద్దిగా ధ్వంసమైంది. ఆ వెంటనే స్కూటీ, రోడ్డుపై వెళ్తున్న మహిళ పద్మను ఢీకొట్టింది. స్కూటీ బస్సు ముందర టైర్ కిందపడి నుజ్జునుజ్జు అయ్యింది. రోడ్డుపై వెళ్తున్న మహిళ పద్మ బస్సు వెనుక టైర్ల కింద పడగా.. మృతదేహం రెండు ముక్కలయ్యింది.
ఈ రోడ్డు ప్రమాదంతో ఆర్మూర్ ప్రధాన రోడ్డుపై సుమారు పది నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో రాఘవేందర్, ఎస్సైలు విజయ్‌నారాయణ్, యాదగిరిగౌడ్ హుటాహుటిన అక్కడికి వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని ఆర్మూరు ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఎస్ఎల్ఎన్ ట్రాన్స్‌పోర్టు బస్సు ముప్కాల్ మండలం నాగంపేట్ నుంచి నిజామాబాద్‌లోని శుభకార్యానికి వెళ్తుండగా, మార్గమధ్యలో ఆర్మూర్ బస్టాండ్ వద్ద ఆ బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలోనే బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది.