ముందస్తుగా.. మరమ్మతులు

Thu,March 14, 2019 11:57 PM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వర్షాకాలంలో రోడ్లు పాడుకాకుండా ముందస్తు ప్రణాళికతో జీహెచ్‌ఎంసీ కార్యాచరణను అమలుచేస్తున్నది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన రహదారులపై దృష్టి కేంద్రీకరించిన అధికారులు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 550లేన్ కిలోమీటర్లమేర పనులను పూర్తిచేశారు.
పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్(పీపీఎం)పేరుతో జీహెచ్‌ఎంసీ అధికారులు గత ఏడాది చివర్లో రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఏటా వర్షాకాలంలో రోడ్లు పాడవుతుండడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ముంబై తరహాలో ఈసారి ముందస్తుగా ప్రధాన రోడ్లను ఎంపికచేసుకొని వాటి పునరుద్ధరణ చేపట్టారు. దీనికింద ఈ ఏడాది జనవరిలో రూ.721.86కోట్లతో 120ప్యాకేజీలను ప్రభుత్వం మంజూరుచేసింది. జీహెచ్‌ఎంసీ, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 833 లేన్ కిలోమీటర్లమేర పనులు చేపట్టగా, అందులో 550లేన్ కిలోమీటర్లమేర పనులు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పూర్తయిన రోడ్లలో చాలావరకు ప్రధాన మార్గాలున్నట్లు వారు పేర్కొన్నారు. అలాగే, కాంట్రాక్టర్లకు రూ.78కోట్ల బిల్లులు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయని, ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తిచేస్తామని వారు భరోసా ఇస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో ప్రధాన రోడ్లకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మ్యాన్‌హోల్స్, క్యాచ్‌పిట్‌లపై దృష్టి
రోడ్లతోపాటే మ్యాన్‌ల్స్, క్యాచ్‌పిట్‌లపై దృష్టిపెట్టిన అధికారులు వాటిని రోడ్డుకు సమానంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఎగుడు-దిగుడు లేకుండా ఉండేలా చేపట్టిన మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ. 8.31కోట్లతో 7730 మ్యాన్‌హోల్స్, క్యాచ్‌పిట్‌ల మరమ్మతులు చేపట్టగా, అందులో ఇప్పటివరకు 190కిపైగా మ్యాన్‌హోళ్ల మరమ్మతులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులన్నీ పూర్తిచేయాలనే లక్ష్యంతో రోజువారీ లక్ష్యాలు నిర్ధారించుకొని పనులు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. జోన్లవారీగా చూస్తే, ఎల్బీనగర్‌లో 1635, చార్మినార్‌లో 2074, ఖైరతాబాద్‌లో 1774, శేరిలింగంపల్లిలో 770, కూకట్‌పల్లిలో 583, సికింద్రాబాద్‌లో 1428 మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లను రోడ్లకు సమానంగా ఉండేలా పనులు చేపట్టారు.

396

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles