ఆయువుపోస్తూ.. భరోసానిస్తూ..

Fri,March 15, 2019 12:11 AM

-కిడ్నీ రోగులకు కొత్త జీవితాలిస్తున్న ఉస్మానియా
-ఇప్పటివరకు 660 మందికి మూత్ర పిండాల మార్పిడి శస్త్రచికిత్సలు
-ప్రతి నెలా 3000 మందికి డయాలసిస్
-నవజాత శిశువులు, చిన్నపిల్లలకూ నిర్వహణ
-ప్రతి నెలా రూ.15వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ
-రోజూ 100 మందికి ఓపీ సేవలు
సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : ఉస్మానియా దవాఖాన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కొత్త జీవితాలిస్తున్నది. బాధితులకు ఆయువుపోస్తూ.. భరోసానిస్తున్నది. ఇప్పటివరకు 660 మందికి ఇక్కడి వైద్యులు మూత్ర పిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి.. ఎందరో ప్రాణాలను నిలిపారు. ఈ సర్కారు వైద్యశాలలో ప్రతినెలా 3000 మందికి డయాలసిస్ చేయడమేకాదు.. రూ. 15వేల విలువైన మందులను ఉచితంగా అందిస్తున్నారు.

1980లో మొదటిసారిగా..
1980లో మొట్టమొదటి సారిగా ఉస్మానియా దవాఖానలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డా.నాగేందర్ వివరించారు. నాటి నుంచి నేటి వరకు 660 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 40 శాతం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 60 శాతం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ఉస్మానియాలో చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉస్మానియాలో సైతం డయాలసిస్ కేంద్రాన్ని అత్యాధునిక పరికరాలతో ఆధునీకరించింది. ప్రతి రోజూ 70 మందికి ఇక్కడ డయాలసిస్ చేస్తున్నారు. ప్రతి నెలా సుమారు 3000 మందికి పైగా డయాలసిస్ జరుపుతున్నట్లు ఉస్మానియా నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ మనీష సాహె తెలిపారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 620 లైవ్ ట్రాన్స్‌ప్లాంట్స్(బతికి ఉన్న వారి నుంచి సేకరించిన కిడ్నీల మార్పిడి) చేయగా 40 క్యాడవర్ ట్రాన్స్‌ప్లాంట్స్(బ్రెయిన్‌డెత్‌కు గురైన వారి నుంచి సేకరించిన కిడ్నీల మార్పిడి)ను నిర్వహించారు. 660 మందిలో 12 మంది చిన్నపిల్లలకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఒక ప్యాంక్రియా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్(మధుమేహం బాధిత రోగులకు) జరిపారు.

నెల రోజుల్లో ..
గత నెల ఫిబ్రవరి 15 నుంచి 14లోపు ఏడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. జనవరిలో రెండు ఆపరేషన్లు జరిపారు. ఉస్మానియా నెఫ్రాలజీ విభాగంలో ప్రతి రోజూ 100 మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారు. 60 పడకల సామర్థ్యమున్న ఈ విభాగంలో నిరంతరం సామర్థ్యానికి మించి పూర్తిస్థాయిలో ఐపీ రోగులు సేవలు పొందుతున్నారు. 60 ఐపీ పడకలతో పాటు 25 డయాలసిస్ పడకలు ఉన్నాయి. షిఫ్టుల వారీగా రోజూ 70 మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక సేవలు
మూత్రపిండ వ్యాధులతో పాటు అప్పుడే పుట్టిన నవజాత శిశువులు, చిన్నారులు, అధిక, అల్ప రక్తపోటు, మధుమేహం, గర్భిణులు, డెంగీ, మలేరియా, విషం సేవించిన రోగులు, జెనిటికల్ సమస్యలున్న రోగులకు ఉస్మానియా నెఫ్రాలజీ విభాగంలో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు.

చిన్నారులకూ డయాలసిస్..
అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి వృద్ధుల వరకు ఉస్మానియాలో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఐదుగురు నవజాత శిశువులు, 10 నుంచి 15 మంది చిన్నారులకు ఇక్కడ డయాలసిస్ నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 60 మంది పెద్దలకు డయాలసిస్ చేస్తున్నారు.

ఏడు జిల్లాల్లో కేంద్రాలు..
ఉస్మానియా దవాఖాన పర్యవేక్షణలో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అందులో బోధన్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, హుజూరాబాద్, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లాల్లో రోగులకు డయాలసిస్ జరుపుతున్నారు. దీనివల్ల ఆయా ప్రాంత ప్రజలు నగరానికి రావాల్సిన ప్రయాస తప్పింది.

అవగాహన ముఖ్యం
కిడ్నీ వ్యాధులపై అవగాహన కలిగి ఉండడం, సమస్యలను ప్రారంభ దశలో గుర్తించడం, అసలు సమస్య తలెత్తకుండా అప్రమత్తతో నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమం. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగాలి. రోజులో ప్రతి రెండు గంటలకు ఒక్కసారి 100-250 మి.లీ నీరు తాగడం ఉత్తమం. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలున్న వారు వాటిని కచ్చితంగా అదుపులో ఉంచుకునేలా జాగ్రత్తపడాలి. మద్యపానం, ధూమపానం కూడా కిడ్నీలను దెబ్బతీస్తాయి. రోజుకు 5-6గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అధిక బరువు(ఊబకాయం) వల్ల మూత్రపిండాలపై భారం పడుతుంది. దీనిని నివారించేందుకు కొవ్వుపదార్థాలు, జంక్‌ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఉస్మానియాలో క్యాడవర్ కంటే లైవ్ ట్రాన్స్‌ప్లాంట్స్‌సే ఎక్కువగా అవుతాయి. క్యాడవర్ ట్రాన్స్‌ప్లాంట్స్ పెరుగాలంటే ఒక పర్మనెంట్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్ ఉండాలి. ప్రస్తుతం నిమ్స్ నుంచి ఈ కో-ఆర్డినేటర్ వస్తున్నారు.
డాక్టర్ మనీషా సాహె(నెఫ్రాలజీ విభాగం అధిపతి, ఉస్మానియా దవాఖాన)

కిడ్నీలు కాపాడుకుందాం..
గ్లెనిగల్స్ గ్లోబల్ దవాఖాన ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లో అవగాహన వాక్ నిర్వహించారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్, సీఈవో రాహుల్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఉపాధ్యక్షులు మహేందర్ ప్రారంభించారు.
-ఖైరతాబాద్

మూత్రపిండాల వ్యాధి ఒక్కసారి వస్తే తగ్గే అవకాశం ఉండదని జీవన్‌దాన్ తెలంగాణ ఇన్‌చార్జి డాక్టర్ జి. స్వర్ణలత అన్నారు. కేర్ దవాఖాన, జీవన్‌దాన్, చేయూత ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో గురువారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వద్ద వాకథాన్‌ను డాక్టర్ స్వర్ణలతతో పాటు కేర్ ఫెసిలిటీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి డాక్టర్ రియాజ్ ఖాన్, యూరాలజిస్ట్ డాక్టర్ వంశీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజిస్టులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సంతోష్, డాక్టర్ ప్రసాద్ రాజు, యూరాలజిస్టులు డాక్టర్ బీవీ రామరాజు, డాక్టర్ రేవతి, కిడ్నీ వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.
-ఖైరతాబాద్

వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకొని గాంధీ దవాఖాన నెఫ్రాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. అంతకుముందు ఈ ర్యాలీని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఓ. శ్రావణ్‌కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో నెఫ్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ మంజూష, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
-గాంధీ దవాఖాన

12 కోట్ల మంది వ్యాధిగ్రస్తులు
ఖైరతాబాద్ : నిమ్స్‌లోని డయాలసిస్ యూనిట్‌లో రోగులకు నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి గంగాధర్ కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించారు. ముందస్తు జాగ్రత్తగా ఎలా నివారించుకోవచ్చన్న అంశాలను వివరించారు. రాష్ట్రంలో పది వేల మంది డయాలసిస్ రోగులకు ఉచిత బస్‌పాస్‌లు అందించనున్నామని తెలిపారు. త్వరలోనే నిమ్స్‌లో డయాలసిస్ చికిత్స పొందుతున్న వారికి బస్‌పాస్‌లు ఇస్తామన్నారు. నిమ్స్ మూత్రపిండాల వైద్యనిపుణలు డాక్టర్ శ్రీభూషణ్‌రాజు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 85వేల కోట్ల మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతుండగా, భారత దేశంలోనే 12 కోట్ల మంది వ్యాధిబారిన పడ్డారన్నారు. డయాలసిస్ చేయించుకున్న వారికి మూత్రపిండాల మార్పిడి తప్పనిసరి అని, అందులో 55 శాతం మంది ఆరేండ్ల్ల వ్యవధిలోనే చనిపోతున్నారన్నారు. నిమ్స్ దవాఖానకు నిత్యం 160 మంది వ్యాధిగ్రస్తులు వస్తే అందులో 30 మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. నెలకు 900 మంది ఈ వ్యాధిగ్రస్తులు నిమ్స్‌కు చికిత్స కోసం వస్తున్నారన్నారు.

13 ఏండ్లుగా బాధపడుతున్నా
ఆరెండ్ల కిందట కిడ్నీలు రెండు పనిచేయడకపోవడంతో డయాలసిస్ చేయాలన్నారు. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఇంటర్ పరీక్షలు రాయలేకపోయాను. నాన్న శ్రీనివాస్ కూలీ పనులు చేస్తారు. నా చికిత్స కోసం అప్పులు చేసి లక్షలు ఖర్చు చేశారు. డయాలసిస్ కోసం రావాలంటే చార్జీల భారం ఎక్కువగా ఉంది. ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. -ఎం. ప్రణయ్ (19), వరంగల్

520

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles