వాట్సాప్‌లో రియల్ దందా

Mon,April 15, 2019 01:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : హైదరాబాద్ శివారులో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం సైబర్ చీటర్లకు వరంగా మారింది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లను టార్గెట్‌గా చేసుకుంటున్న నేరగాళ్లు వారిని బురిడీ కొట్టిస్తూ లక్షలు కాజేస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు సైబర్ మోసగాళ్లు కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు గాలం వేసి మూడు కేసుల్లో రూ.33 లక్షలను లూటీ చేశారు. మొత్తం వ్యవహారాన్ని వాట్సాప్‌లోనే నడిపి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పడ్డారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లను బురిడీ కొట్టిస్తున్న ఈ మోసగాళ్లు ముందుగా స్థల యజమానులను బుట్టలో పడేస్తున్నారు. దీని కోసం వారు వేస్తున్న నక్కజిత్తు ఎత్తుగడలు అసలు యజమానులను ఇబ్బందుల్లో పడేస్తుంది. మార్కెట్ ధరకు చాలా తక్కువంటూ ఎర వేస్తున్న చీటర్లు తెలివిగా మొదట డైమన్షన్ పేపర్‌లతో మస్కా కొట్టి ఆ తర్వాత జిరాక్స్ పత్రాలను పంపించి అడ్వాన్స్ కింద లక్షలు కొట్టేస్తున్నారు. ఈ జిరాక్స్ పత్రాలతో బోల్తా పడుతున్న ఏజెంట్లు గజానికి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు మిగులుతుందనే ఆశలో ఒరిజినల్ పత్రాలను చూడకుండానే అడ్వాన్స్ కింద లక్షలు సైబర్ చీటర్ల ఖాతాల్లో వేసేస్తున్నారు. మోసం విషయం తెలుసుకుని బాధితులు లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తూ పోగొట్టుకున్న డబ్బును ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మొదట డైమన్షన్.. ఆ తర్వాత డైవర్షన్..
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ఫిర్యాదులను పరిశీలిస్తే... రియల్ ఎస్టేట్ ఏజెంట్లను టార్గెట్‌గా చేస్తున్న సైబర్ చీటర్ల మోసం ైస్టెల్ ఆసక్తికరంగా ఉంది. సైబర్ చీటర్లు ముందుగా ఓఎల్‌ఎక్స్, ఇతర పేరొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వెబ్‌సైట్లు, వివిధ పత్రికా ప్రకటనలను గమనిస్తున్నారు. అందులో హైదరాబాద్ శివారులో ప్లాట్లను విక్రయిస్తున్న వారి వివరాలను సేకరించి వారి నంబర్లకు ఫోన్ చేస్తారు. సార్ మీ ప్లాట్ ప్రకటన చూశాం. మేము కొనడానికి రెడీగా ఉన్నామని వివరిస్తారు. వారి మాటలను బట్టి ప్లాట్ యజమాని నిజంగానే ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ప్లాట్ కొంటాడేమోనని నమ్మి అతనికి ధర చెప్పేస్తాడు. సార్ మీరు చెప్పిన ఆ ధరకు మేము సిద్ధంగా ఉన్నాం.. మొదట మీరు ప్లాట్‌కు సంబంధించిన దిక్కులు తెలిపే డైమన్షన్ పేపరు పంపించండి చాలు మేము స్థలాన్ని పరిశీలించుకుని మీకు అడ్వాన్స్ చెల్లిస్తామని నమ్మిస్తారు.

దీని కోసం వాట్సాప్ నంబర్‌ను ఇస్తారు. దానికి డైమన్షన్ పేపరు రాగానే సైబర్ చీటర్ మొదట ఆ స్థలం ఉన్న ప్రాంతానికి వెళ్తారు. అక్కడ పరిస్థితులను చూసుకుని ఆ ప్రాంతంలో ఉన్న రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై ఉన్న ఏజెంట్‌ల ఫోన్ నంబర్లు తీసుకొస్తారు. ఆ తర్వాత తాను ప్లాటు అమ్ముతున్నానని నేను బెంగళూరులో ఉంటానని, త్వరలో అమెరికా వెళ్లిపోతాను.. అవసరం ఉండి ప్లాటును అమ్ముతున్నానని చెబుతారు. మా ప్లాటు ఉన్న ఏరియాలో రియల్‌ఎస్టేట్ ఏజెంట్‌గా మీకు మంచి పేరు ఉందని తెలిసింది.. అందుకే మీకు ఫోన్ చేశాను నా ప్లాట్‌కు సంబంధించిన డైమన్షన్ పేపరును పంపిస్తాను మీరు డిసైడ్ అయ్యి ధర చెప్పండి మ్యాటర్‌ను క్లోజ్ చేస్తామని చెబుతారు. ఇలా ఏజెంట్‌కు పంపగానే అతను చూసి సార్ ప్లాట్ ఫర్వాలేదు ధర ఏం చెబుతున్నారని అడిగి రూ.25వేల గజం ఉంది సార్ అని చెబుతారు.

వెంటనే సైబర్ మాయగాడు నాకు రూ.25వేలు ఏమి వద్దు రూ.15నుంచి రూ.20 వేలు గజానికి వస్తే చాలు అని ఖుషీ చేస్తాడు. దీంతో ఏజెంట్ మురిసిపోయి రూ.15వేల గజం అయితే నేను తీసుకుంటా అనగానే సరే నేను బెంగళూరులో ఉన్నా మొదటగా లక్ష అడ్వాన్స్‌గా ఇస్తే మిగతా పేపర్లు పంపిస్తా అని ఇక్కడ సైబర్ చీటర్ అంతకు ముందే అసలు యజమాని నుంచి సేకరించిన బ్యాంకు ఖాతా నంబరు ఇస్తాడు. దానికి లక్ష రూపాయలు ఏజెంట్ పంపించగానే.. చీటర్ అసలు యజమానికి ఫోన్ చేసి మీకు లక్ష రూపాయలు పంపాను నేను మీ ప్లాట్ కొంటాను మిగతా పేపర్లు పంపిస్తే వాటిని పరిశీలించుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని మాయ చేస్తాడు. లక్షల రూపాయలు పంపాడు కదా అని అసలు యజమాని ప్లాటుకు చెందిన మొత్తం పత్రాలను వాట్సాప్‌లో పంపిస్తాడు. ఈ పత్రాలను ఏజెంట్‌కు పంపించి ఈ పేపర్లు చూసుకోండి ముందుగా రూ.10లక్షలు పంపండి..

మిగతా నగదు రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వండని ఇక్కడ సైబర్ చీటర్ మరో బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఇస్తాడు. అతని మాయలో పడ్డ ఏజెంట్ గజానికి రూ.10వేలు మిగులుతుంది కాబట్టి ఏమి ఆలోచించకుండా లక్షల్లో నగదును రెండోసారి పంపిన బ్యాంక్ ఖాతాలోకి వేస్తారు. అలా భారీ నగదు పడగానే సైబర్ చీటర్ మొబైల్ స్విచ్చాఫ్ చేసేస్తారు. ఎన్నిసార్లు ఆ నంబరకు ఫోన్ చేసినా ఏజెంట్ బేజారు అయిపోయి మోసపోయానని గ్రహించుకుని లబోదిబోమంటాడు. ఇలా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు 15, 12, 6 లక్షల చొప్పును ముగ్గురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మొత్తం రూ.33 లక్షలను పోగొట్టుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో బ్యాంక్ ఖాతాల లావాదేవీలను పరిశీలించినప్పుడు రెండు కేసుల్లో ఖాతాలు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినవిగా, మరొకటి నగరానికి చెందినదిగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అసలు యజమానులను కూడా ప్రశ్నించాల్సి వచ్చింది. అప్పుడు అసలు యజమానులు, ఏజెంట్లు వారు మోసపోయిన తీరును పరిశీలించుకుని అవాక్కయ్యారు.

యజమానితో నేరుగా మాట్లాడుకోండి
కేసులను పరిశీలించినప్పుడు చాలా బాధితులు అత్యాశకు పోయి బోల్తాపడ్డారు. ఫోన్‌లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి మాటలు నమ్మి స్థల యజమానులు మొదట డైమన్షన్ పేపర్లు, ఆ తర్వాత మొత్తం పేపర్లను వాట్సాప్‌లో పంపారు. మరో వైపు ఏజెంట్లు కూడా గజానికి రూ.10వేలు మిగులుతున్నాయని, ఏమి ఆలోచించకుండా జిరాక్స్ పత్రాలకే లక్షల రూపాయలను అతను చెప్పిన ఖాతాలో వేయడం మంచిదికాదు. ఈ విధంగా స్థలాల కోనుగోలు సమయంలో యజమానితోపాటు కోనుగోలు చేసే వారు స్థలం మీదనే కలుసుకోవాలి. వాట్సాప్‌లలో కాకుండా నేరుగా మాట్లాడుకుని ఆ తర్వాత పత్రాలను ఇచ్చుకుంటే ఫర్వాలేదు. గుర్తు తెలియని వ్యక్తులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పత్రాలను పంపకండి. ఏజెంట్ల ద్వారా మీకు పత్రాలు అందినా ముందుగా యజమానులను కలువండి. వారి ఒరిజినల్ పత్రాలను పరిశీలించుకోండి. యజమానితో కలిసి స్థలానికి సంబంధించిన దిక్కులు ఇతర అంశాలను తెలుసుకోండి. గజానికి వేలాది రూపాయలు వస్తున్నాయని లక్షలు గుర్తు తెలియని ఖాతాల్లో వేయకండి. తస్మాత్ జాగ్రత్తా.
- హరినాథ్, ఏసీపీ రాచకొండ సైబర్ క్రైం విభాగం

ఒకేరోజు రెండున్నర లక్షల మంది ప్రయాణం
సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : పండుగ సీజన్ల వేళ ప్రత్యేక బస్సులు వేసి ఆదాయ వనరులు రాబట్టుకొనే టీఎస్‌ఆర్టీసీకీ ఈ నెలలో బంపర్ ఆఫర్ తగిలింది. మొదటివిడత లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు వేయడానికి నగరం నుంచి దాదాపు 10 నుంచి 12 లక్షల మంది ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లారు. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ నగరం నుంచి 4573 బస్సులను ఆపరేట్ చేసింది. ఈ నెల 8 నుంచి 11వరకు ప్రతిరోజు సగటున లక్ష మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ప్రతీరోజు నగరం నుంచి 3 వేల బస్సులతోపాటు సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తుంటారు.

3 వేల బస్సులకు అదనంగా 1573 బస్సులను ఎన్నికలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్‌తోపాటు నగర శివారు కాలనీల నుంచి బస్సులను నడిపించారు.అంతేగాకుండా అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా కూడా టికెట్లు బుక్‌చేసి అక్కడినుంచే బస్సులను వివిధ ప్రాంతాలకు తిప్పారు.అంతేగాకుండా అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. వీటితోపాటు కరీంనగర్, వరంగల్ , నల్గొండ, నిజామాబాద్ , ఆదిలాబాద్ సెక్టార్‌లకు రెగ్యులర్ బస్సులను ఎక్కువగా తిప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు స్పెషల్ ఆపరేషన్స్ కోసం ఎంతో సహకరించారు. ఒక్క 10వ తేదీనే 1117 అదనపు బస్సులు నడిపించారు.

నగర రైల్వేస్టేషన్ల ద్వారా 5.59 లక్షల మంది ప్రయాణం
ఎన్నికల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రికార్డుస్థాయి ప్రయాణికులను రిజిస్టర్ చేసింది. ఈ నెల10న ఒక్కరోజే 1,24,000 మంది ప్రయాణికులు ప్రయాణించి రికార్డును నమోదుచేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఒక్కరోజే 96,000 మంది అన్‌రిజర్వ్‌డ్‌గా 28 వేలమంది రిజర్వ్‌డ్ ప్రయాణికులు ప్రయాణించారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు అదనపు బోగీలను ఏర్పాటుచేసింది. నగరంలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ , లింగంపల్లి స్టేషన్ల ద్వారా అత్యధిక ప్రయాణికులు ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరారు.

మొత్తం 8,9,10 తేదీలలో కలిస్తే 2,41,046 అన్‌రిజర్వుడ్ ప్రయాణికులు, 97,512 రిజర్వ్‌డ్ ప్రయాణికులు కలిసి 3,38,558 మంది ప్రయాణికులు సికింద్రాబాద్ ఒక్క స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు చేరుకున్నారు. హైదరాబాద్(నాంపల్లి) స్టేషన్ నుంచి 52,785 అన్‌రిజర్వ్‌డ్, 17,446 మంది రిజర్వ్‌డ్ కలిపి 70,231 మంది, లింగంపల్లి స్టేషన్ నుంచి 79,596 అన్‌రిజర్వ్‌డ్, రిజర్వ్‌డ్ 5,786 రిజర్వుడ్ కలిపి 85,382 మంది ప్రయాణికులు, కాచిగూడ స్టేషన్ నుంచి 59,560 అన్‌రిజర్వుడ్,4817 రిజర్వ్‌డ్ కలిపి 64,377 మంది ప్రయాణికులు ప్రయాణించారు. అన్ని స్టేషన్లు కలిపి 4,32,987 అన్‌రిజర్వ్‌డ్, రిజర్వ్‌డ్ 1,25,561 మంది కలిపి మొత్తం 5,58,548 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.

572

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles