తుంటినొప్పికి హిప్ ప్రిజర్వేషన్‌తో చెక్

Mon,April 15, 2019 01:06 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తుంటినొప్పిని హిప్ ప్రిజర్వేషన్ చికిత్సతో నివారించవచ్చని ప్రముఖ హిప్ ప్రిజర్వేషన్ వైద్యనిపుణులు, చికాగో ప్రతినిధి డాక్టర్ గౌరినేని ప్రసాద్ తెలిపారు. తుంటినొప్పి పరిరక్షణ, అవగాహనకు సంబంధించి సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ ఇంజురీస్ అండ్ ఆర్థోస్కోపి(సిసా) ఆధ్వర్యంలో బంజారాహిల్స్, తాజ్‌డెక్కన్‌లో నిర్వహించిన సమావేశంలో సిసా వైద్యప్రతినిధి డా.రఘువీరారెడ్డితో కలిసి ఆయన తుంటి సమస్యలు, వాటి నివారణ చర్యలను వివరించారు. సాధారణంగా తుంటి నొప్పి చిన్నపిల్లల్లో మొదలవుతుందని, దానిని సకాలంలో గుర్తించకపోవడంతో యుక్తవయస్సు వచ్చిన తరువాత అది దీర్ఘకాలిక తుంటినొప్పిగా మారి ఇతర సమస్యలకు దారితీస్తుందన్నారు.సమస్య ముదిరితే తుంటిమార్పిడి శస్త్రచికిత్స తప్పదన్నారు. సకాలంలో గుర్తిస్తే వ్యాధికి ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చన్నారు. తుంటినొప్పి అనేది పూర్తిగా నివారించగలిగిన సమస్య అని తెలిపారు. అయితే తుంటినొప్పిని వెంటనే గుర్తించడం కొంత కష్టతరమని సాధారణంగా ఈ నొప్పి మామూలు నొప్పిగా ఉండడంతో కొన్ని సందర్భాల్లో వైద్యులు కూడా వ్యాధిని అంచనా వేయలేరని పేర్కొన్నారు.

ముఖ్యంగా 5నుంచి 10ఏండ్లలోపు పిల్లల్లో తుంటి సమస్యలు ఏర్పడే అవకాశముందని దీనికి కారణం పిల్లలు ఎలా పడితే అలా గెంతడం, ఒకే రకమైన ఆటలు ఎక్కువగా ఆడడం, మారిన జీవన విధానంతో పాటు పిల్లల్లో గ్రోత్ ప్లేట్స్ స్లిప్పవడంతో తుంటినొప్పి సమస్య వచ్చే అవకాశమున్నట్లు వారు వివరించారు. తుంటి జాయింట్ అనేది బాల్, సాకెట్ రూపంలో ఉంటుందని,ఇది మనిషి కూర్చోవడంలో, నిలబడాలన్నా, పరుగెత్తడానికి, మోకాళ్లపై కూర్చోవడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు.ఇంతటి ప్రాధాన్యమైన తుంటిని పరిరక్షించే క్రమంలో తుంటి సమస్యలను ఆరంభదశలో గుర్తించి హిప్ ప్రిజర్వేషన్ చికిత్స చేయాలని ఆయన సూచించారు. హిప్ ప్రిజర్వేషన్ అంటే సమస్యను గుర్తించి ఏ కారణంతో నొప్పి వచ్చిందో తెలుసుకొని సదరు భాగంలో ఉన్న ఎముకను సరిచేసి తుంటిని సంరక్షించాలని తెలిపారు. తుంటి సమస్యలపై నగరంలో ఏర్పాటు చేసిన 12వ సిసా అడ్వాన్స్‌డ్ హిప్ ప్రిజర్వేషన్ కోర్సు ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 350మంది సర్జన్లకు మెలుకువలను బోధించినట్లు తెలిపారు. పాతబస్తీకి చెందిన 14ఏండ్ల బాలుడితో పాటు మరో వైద్యుడు తుంటి సమస్యతో బాధపడుతూ సిసాను ఆశ్రయించగా చికిత్స చేశామని తెలిపారు.

257

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles