ప్రకటనలతో నిండా ముంచేస్తారు..

Mon,April 15, 2019 01:08 AM

-ఆర్మీ ఉద్యోగులమంటూ నమ్మిస్తారు..
-తక్కువ ధరతో ఆకర్షిస్తారు..
- ధరకంటే.. రెండింతలు ఎక్కువగా చెల్లింపులు
-సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోతున్న సామాన్య ప్రజలు
-ఫేస్‌బుక్‌లోనూ ఈ తరహా ప్రకటనలు..
-అప్రమత్తతతోనే మోసాలకు చెక్
-సైబర్‌క్రైమ్ పోలీస్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఓఎల్‌ఎక్స్.. ఫేస్‌బుక్‌లలో తక్కువ ధరకు వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తామంటూ సైబర్‌చీటర్లు అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో ఆర్మీ అధికారులమంటూ నమ్మిస్తూ ప్రకటనలు ఇవ్వడంతో అమాయక ప్రజలు ఈజీగా నమ్మి మోసపోతున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో కాకుండా ఫేస్‌బుక్‌లోనూ ఇదే తరహాగా ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. అందరూ ఓఎల్‌ఎక్స్‌లో మోసాలు జరుగుతున్నాయంటూ పోలీసులు విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేస్తుండడంతో ప్రజల్లో కొద్ది మార్పు వస్తుంది. ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు చూసిన వెంటనే.. అది నిజమా? కాదా? అనే విషయంపై ఆలోచిస్తున్నారు.

దీంతో సైబర్‌నేరగాళ్లు ఇప్పుడు ఫేస్‌బుక్ నుంచి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో కూడా ఆర్మీ అధికారులమని, తాము తమ వాహనాన్ని విక్రయించాలనుకుంటున్నామంటూ నమ్మిస్తూ.. అంతంగా అవసరమైతే ఓఎల్‌ఎక్స్‌లో కూడా ప్రకటన ఇచ్చామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో బాధితులు కూడా ఓఎల్‌ఎక్స్‌లో ఆ ప్రకటనను చూసి.. రెండు ఒకటిగానే ఉండడంతో ఇక వాహనం ధరల విషయంపై మాట్లాడుతూ బోల్తా పడుతున్నారు. అందులో ఆర్మీ ఉద్యోగుల ఫొటోలు, పేర్లను వాడుతుండడంతో ఈ ప్రకటనలను చూసి ఆర్మీ ఉద్యోగులు కూడా బాధితులవుతున్నారు. ఆర్మీ అధికారుల పేర్లతో ప్రకటనలు ఇస్తూ.. ఆర్మీపై ఉన్న నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో మాట్లాడుకున్న ధరకంటే రెండు, మూడింతలు ఎక్కువగా సైబర్ మోసగాళ్ల బ్యాంకు ఖాతాల్లో బాధితులు డిపాజిట్ చేసేస్తున్నారు.

ఆర్మీ ఉద్యోగులమంటూ మోసం..!
ఫేస్‌బుక్, ఓఎల్‌ఎక్స్‌లో సెల్‌ఫోన్, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తామంటూ చాలా మంది ప్రకటనలు ఇస్తుంటారు. ఇందులో మోసం చేయాలనే లక్ష్యంతో ప్రకటనలు చేసే వారు ముందుగానే నకిలీ పేర్లతో సిమ్‌కార్డులు తీసుకొని, వాటి ద్వారా పలు పేటీఎం ఖాతాలను తెరుస్తారు. అయితే ఆర్మీ ఉద్యోగులైతే నమ్మకంగా ఉంటారని, వాళ్లు మోసాలు చేసే అవకాశాలుండవని దేశ ప్రజలు నమ్ముతారు. ఈ నమ్మకంతోనే సైబర్‌చీటర్లు ఆర్మీలో పనిచేస్తున్నట్లు, నకిలీ ఐడీ కార్డులను సృష్టించి, అమ్మే వస్తువుకు సంబంధించిన యజమాని వివరాలలో వాటిని పొందుపరుస్తున్నారు. దీంతో కొనేవారికి అది పక్కా ఆర్మీకి సంబంధించిన వారిదనే నమ్మం వచ్చేస్తుంది. అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి ఆరా తీస్తే.. తాము ఆర్మీలో పని చేస్తున్నామని, లేదంటే హైదరాబాద్‌లో పని చేస్తున్నామని, కర్ణాటకలో పని చేస్తున్నామని లేదంటే తమ సోదరుడు అందులో పని చేస్తున్నాడని ఏదో విధంగా తాను ఆర్మీకి కుటుంబానికి చెందిన వాడినని కొనే వారిని నమ్మిస్తారు.

ఆర్మీలో పనిచేసే వారు నమ్మకస్తులని, ప్రతి భారతీయుడికి నమ్మకం ఉంటుంది. దీంతో ఈ నమ్మకంతోనే సామాన్య ప్రజలు ఈ చీటర్లు వేసే ప్రకటనలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ప్రకటనలతో ఉన్న వస్తువుల గూర్చి మాట్లాడే సమయంలో తమకు అత్యవసరం ఉండి ఆ వస్తువును విక్రయించాల్సి వస్తుందని, చాలా మంది ఈ ధరకు కొనుగోలు చేసేందుకు ఫోన్ చేస్తున్నారని, మీరు అడ్వాన్స్ ఇస్తే.. మీకు అది విక్రయించినట్లే అవుతుందని నమ్మిస్తారు. మరికొన్ని సార్లు తాము ఈ ఊరి నుంచి మరో ప్రాంతానికి బదిలీ అవుతున్నామని, ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయించాలని అనుకుంటున్నామని, తమకు వీటిని తరలించేందుకు చాలా ఖర్చవుతుందని, అందుకే ఎంతకో కొంతకు విక్రయించేందుకు నిర్ణయించామని నమ్మిస్తుంటారు.

మీకు మేం చెప్పే ధర అంగీకారమైతే అడ్వాన్స్ చెల్లించడంటూ ముందుగా బుట్టలో వేస్తారు. అడ్వాన్స్ చెల్లించగానే ఆ వస్తువును మీకు కొరియర్ చేస్తున్నామంటూ నమ్మబలుకుతారు. కొరియర్ సగం దూరానికి పంపించామని వెంటనే కొనుగోలు ఒప్పందంలో భాగంగా మిగతా డబ్బు ఇవ్వాలంటూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారు. మోసం చేసే వ్యక్తే మరో ఫోన్ నంబర్‌తో, బాధితుడికి కొరియర్ బాయ్‌లా ఫోన్ చేస్తారు. మీ ఇంటి దగ్గర్లోనే ఉన్నామని, వస్తువుకు సంబంధించిన జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లించలేదని, వాటిని చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తారు. ఇలా ముందుగా ఒప్పందం చేసుకున్న ధరకంటే రెండింతలు వసూలు చేస్తారు.
ఈ విషయంపై ముందుగా మాట్లాడిన వాళ్లతో చర్చిస్తే.. అయ్యో అది కొరియర్ చేశాం.. వారితోనే మాట్లాడండి.. ఏమైనా ఎక్కువ తక్కువలుంటే మీ పేటీఎంకు పంపిస్తాం.. ముందుగా వస్తువును డెలివరీ తీసుకోండంటూ నమ్మబలుకుతారు. ఇలా కొనుగోలు చేసే యజమానిని నిండుగా ముంచేస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు
-వస్తువు విక్రయానికి పెట్టిన వ్యక్తి మొదట్లోనే అడ్వాన్స్ డబ్బు అడుగుతున్నాండంటే, ఆ వస్తువు విక్రయించే వ్యక్తి గూర్చి అనుమానించాల్సిందే.
-గుర్తు తెలియని బ్యాంకు ఖాతాలు, పేటీఎంలలో ఎలాంటి పరిస్థితుల్లోనూ డబ్బులు డిపాజిట్ చేయవద్దు.
-వస్తువు విక్రయించే వ్యక్తి నిజంగా వస్తువు విక్రయిస్తాడా? లేదా? అనే విషయంపై ఆరా తీయండి.
-వస్తువు విక్రయిస్తానంటూ చెబుతున్న గుర్తుతెలియని వ్యక్తి మాటలను ఫోన్లు, వాట్సాప్‌లో నమ్మొద్దు.
-వాహనాలను విక్రయించే వ్యక్తులు డూప్లికేట్ నంబర్లు వేసి, విక్రయిస్తామంటూ నమ్మిస్తారు, వాహనాలకు సంబంధించిన ఆర్సీని తనిఖీ చేసుకోవాలి. కేవలం ప్రకటనలు చూసి మోసపోవద్దు. వాహన నంబర్‌ను తనిఖీ చేసుకోవాల్సిన అవసరమున్నది.
-మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఫోన్ చేసినా, అతడు ఫోన్ చేసినా అతడి ఫోన్ నంబర్ స్థానింగా ఉండేదా? ఇతర రాష్ర్టాలకు చెందిందా? అనే విషయాలను గుర్తించాలి, ఇందుకు షాప్‌లస్ ఇన్ఫో అప్లికేషన్ల ద్వారా ఆ నంబర్ ఏ రాష్ర్టానిదో గుర్తించవచ్చు, అలాగే బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయమని చెబుతుంటారు, అలాంటి సందర్భాలలో ఆ బ్యాంకు ఖాతా ఎక్కడిదో ఆరా తీయాలి.
-ఇతర రాష్ర్టాలకు చెందిన వారు తక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తామని ప్రకటనలు ఇస్తే.. వాటికి స్పందించకపోవడం మంచిది.

509

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles