శోభాయమానం..

Mon,April 15, 2019 01:10 AM

-ఘనంగా శ్రీరామ శోభాయాత్ర
-కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

సిటీబ్యూరో, ఆబిడ్స్, బేగంబజార్, తెలుగు యూనివర్శిటీ నమస్తే తెలంగాణ: శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో నిర్వహించిన శ్రీరామ విశాల్ శోభా యాత్రకు అశేష జనవాహిని తరలి వచ్చింది. గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ఆధ్వర్యంలో రాణి అవంతి బాయి భవన్ ఆకాష్‌పురి హనుమాన్ దేవాలయం నుంచి, భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్స్ నుంచి, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆనంద్‌సింగ్ ఆధ్వర్యంలో అప్పర్ ధూల్‌పేట్ నుంచి పల్లకి సేవ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహించారు. సీతారాంబాగ్‌లో కాశీ వారణాసి శంకరాచార్యులు జితేంద్రనంద్ సరస్వతి మహారాజ్ పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షులు భగవంతరావు, ప్రధాన కార్యదర్శి గోవింద్‌రాఠి, బేగంబజార్ కార్పొరేటర్ జి శంకర్ యాదవ్ పూజలు నిర్వహించిన అనంతరం యాత్ర ప్రారంభమైంది. అప్పర్ ధూల్‌పేట్ నుంచి ఆనంద్‌సింగ్ ఆధ్వర్యంలో స్వామి వారి పల్లకి సేవ ప్రారంభమైంది.

ఆకాష్‌పురి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన యాత్ర మగ్రా, జాలి హనుమాన్, పురానాపూల్ గాంధీ విగ్రహం, జుమ్మెరాత్‌బజార్, బేగంబజార్ ఛత్రి, బర్తన్‌బజార్, సిద్దంబర్ బజార్, గౌలిగూడ చమాన్, పుత్లిబౌలిల మీదుగా కొనసాగింది. అదే విధంగా సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన యాత్ర బోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, జాలి హనుమాన్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్, సిద్దంబర్‌బజార్‌ల మీదుగా సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకున్నది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమైన విశాల్ శోభా యాత్ర అడుగడుగునా భక్తుల నీరాజనాలందుకుంటూ రాత్రి వరకు కొనసాగింది.

శ్రీరామ నవమి శోభాయాత్రను పురస్కరించుకుని సీతారాంబాగ్‌లోని ద్రౌపది గార్డెన్‌లో శోభాయాత్రను ప్రారంభించిన అనంతరం బేగంబజార్ ఛత్రి చౌరస్తాలో కాశీ వారణాసి శంకరాచార్యులు జితేంద్రనంద్ సరస్వతి మహారాజ్ ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. గత 70 సంవత్సరాలుగా దేశంలో హిందువులను పట్టించుకున్న నాథుడు లేరన్నారు. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ భగవంత్‌రావు మాట్లాడుతూ దేశంలో రామరాజ్య స్థాపనతోనే హిందువులకు రక్షణ ఏర్పడుతుందన్నారు. భారతదేశంలో నివసిస్తూ దేశ ద్రోహానికి పాల్పడే వారిని క్షమించకూడదని గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ పేర్కొన్నారు.

స్వాగత వేదికలు, ప్రసాదాల పంపిణీ...
శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన విశాల్ శోభా యాత్రకు తరలి వచ్చిన వారికి పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, నాయకులు ప్రత్యేక స్వాగత వేదికలను ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. అంతే కాకుండా అనేక ప్రాంతాలలో మంచినీరు, ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేసి పంపిణీ చేశారు.

పటిష్ట బందోబస్తు..

శ్రీరామ శోభాయాత్రకు హైదరాబాద్ పోలీసులు అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు నిర్వహించిన ప్రధాన ర్యాలీలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలు ర్యాలీలు కలిశాయి. మధ్యాహ్నం ప్రారంభమైన ర్యాలీ రాత్రి వరకు కొనసాగింది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో ర్యాలీ సాగుతున్న తీరును కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు.

పతి క్షణం అప్రమత్తం..

ప్రధాన ర్యాలీ సాగిన సుమారు 8 కిలోమీటర్లకుపైగా ప్రతి అరకిలోమీటర్‌కు ఓ ఉన్నతాధికారిని నియమించారు. నగర కమిషనరేట్‌లోని అన్ని విభాగాల అధికారులతో కలిసి బందోబస్తును పర్యవేక్షిస్తూ, క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే ఆయా విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలోని సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ, సమస్యను వెంట వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ర్యాలీ నీఘా నీడలోకి వచ్చే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ర్యాలీలో మౌంటెడ్ కెమెరా వాహనాలను వినియోగించారు. ప్రజలు, నిర్వాహకులు, ప్రభుత్వంలోని వివిధ శాఖల సహకారంతో నగరంలో శ్రీరామ నవమి శోభయాత్ర ప్రశాంతంగా ముగిసిందని, తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పోలీస్ విభాగంతో పాటు ఆర్‌అండ్ బీ, జీహెచ్‌ఎంసీ, మెట్రో, విద్యుత్ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నామన్నారు.

674

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles