నేటి నుంచి పహాడీషరీఫ్ ఉర్సు

Mon,April 22, 2019 12:30 AM

పహాడీషరీఫ్ : చారిత్రాత్మక పహాడీషరీఫ్ దర్గా ఉర్సు నేటి నుంచే ప్రారంభమతుంది. చార్మినార్‌కు 11 కిలో మీటర్ల దూరంలో, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దర్గా 753 ఏండ్ల చరిత్ర కలిగి కులమతాలకు అతీతంగా ఆదర్శంగా నిలుస్తున్నది. భక్తులు పహాడీషరీఫ్‌కు రాగానే కొండపైన ఉన్న దర్గాకు వెళ్లడానికి 360 మెట్లు ఎక్కి పోవాలి. దర్గాలోని బాబా షర్ఫుద్దీన్ సమాధికి పూలు, ఛాదరే-గులాఫే సమర్పించి పూజలు నిర్వహిస్తుంటారు.
పహాడీషరీఫ్ దర్గా చరిత్ర..
ఇస్లాం మత ప్రచారం కోసం 753 ఏండ్ల కిందట ఇరాక్ బాగ్దాద్ నుంచి సయ్యద్ బాబా షర్ఫుద్ధీన్ బారతదేశానికి వచ్చి బాలాపూర్ గ్రామంలో విశ్రాంతి తీసుకొని అక్కడ స్థిరపడ్డాడు. అనంతరం పహాడీషరీఫ్ కొండపైకి వెళ్లి మానవులంతా సమానమని అందరికి దేవుడు ఒక్కడేనని బాబా మంచి విషయాలు బోధిస్తుండేవాడట. రోగాల బారిన పడినవారు, సమస్యల వలయంలో చిక్కుకున్న వారు, బాణామతి బాధితులు షర్ఫుద్దీన్ దర్శించుకుంటే సమస్యలు తొలిగిపోయేవని ప్రతీతి.
ర్యాంపు ఏర్పాటు కోసం రూ. 9 కోట్లు
వృద్ధులు, చిన్నారులు కొండపైకి వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం దర్గా పైకి ర్యాంపు ఏర్పాటు చేయడానికి రూ. 9 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.
నేటి నుంచి ఉత్సవాలు..
22 నుండి 28వ తేదీ వరకు దర్గా 753వ ఉత్సవాలు జరుగనున్నాయి. 22న తెల్లవారు జామున 12 గంటలకు బాలాపూర్ ఖసీదయేబుర్దాషరీఫ్ దర్గా నుంచి ఫాతియా ఇప్పించి సందెల్ ఊరేగింపుతో ర్యాలీగా పహాడీషరీఫ్ దర్గాకు వచ్చి కొండపై బాబా షర్ఫుద్దీన్‌కు సమర్పిస్తారు. 23వ తేదీన నిజాం ట్రస్టు ద్వారా పాతబస్తీ నుంచి గంధం ఊరేగింపు నిర్వహిస్తారు. 24వ తేదీన సాయంత్రం దీపాలంకరణ, 25, 26న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, 27న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ నుంచి ఆనవాయితీగా సాయంత్రం సర్కారీ గంధం తీయడం, 28న పహాడీషరీఫ్‌లో సందెల్ ఊరేగింపు నిర్వహిస్తామని సయ్యద్ ఫరీదుద్దీన్, మొయినోద్దీన్ అలీముద్దీన్, జహంగీర్ పాషా, కమిటీ సభ్యులు తెలిపారు.

272

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles