ప్రేమించిన అమ్మాయి కోసం.. పోలీస్ వేషం

Mon,April 22, 2019 12:31 AM

-నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
నకిలీ పోలీస్ ఐడికార్డు, మెడికల్ సర్టిఫికెట్, సెల్‌ఫోన్, గ్రీన్ పెన్ను స్వాధీనం
మారేడ్‌పల్లి : ఒక వైపు పోలీసు కావాలనే కోరిక.. మరోవైపు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికే ఇచ్చి పెండ్లి చేస్తామని చెప్పడంతో నకిలీ పోలీస్ వేషం వేశాడు ఓ యువకుడు. దీంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘాపెట్టి నిందితుడిని అదుపులోకి తీసుకొని మారేడ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎంవీ రవిచంద్రం(29) వెస్ట్‌మారేడ్‌పల్లి సామ్రాట్‌కాలనీలోని రేఖ రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నాడు. రవిచంద్ర బీటెక్ ఫెయిల్ అయ్యాడు. పోలీస్ కావాలనే కోరిక ఒక వైపు ఉండగా, మరోవైపు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తికే ఇచ్చి పెండ్లి చేస్తామని చెప్పారు. దీంతో నిందితుడు రవిచంద్ర పోలీస్ అవతారమెత్తి.. స్థానిక ప్రజలతో పోలీస్ డిపార్టుమెంట్‌లో ఇంటలీజెన్స్ విభాగంలో ఏసీపీగా పని చేస్తున్నాను అంటూ అందరికీ చెప్పుకున్నాడు.

తాను పోలీస్ ఇంటలీజెన్స్ విభాగంలో ఏసీపీగా పని చేస్తున్నానంటూ.. నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దీంతో రవిచంద్రను అందరూ నమ్మారు. 2015 ఆగస్టులో కారు డ్రైవర్‌తో కలిసి వ్యక్తిగత కక్ష్యలతో రాహుల్‌కాంత్ అనే వ్యక్తిని చితకబాదిన కేసులో నిందితుడు రవిచంద్ర జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చినా నిందితుడి ఆలోచనల్లో ఎలాంటి మార్పు రాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మారేడ్‌పల్లిలోని నివాసంలో రవిచంద్రను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని మారేడ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి నకిలీ పోలీస్ ఐడీ కార్డు, గాంధీ దవాఖానలో జారీ చేసిన నకిలీ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, గ్రీన్ ఇంకు పెన్ను, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు పర్యవేక్షణలో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు జి.మల్లికార్జున్, దుర్గారావు, భాస్కర్‌రెడ్డి, ముజాఫర్ అలీ నిందితుడిని పట్టుకున్నారు.

390

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles