ఔటర్ చుట్టూ.. విశాల రోడ్లు

Mon,April 22, 2019 12:31 AM

-గ్రిడ్ రోడ్లు, సర్వీస్‌రోడ్ల అభివృద్ధిపై నజర్
-హెచ్‌ఎండీఏ -లీ అసోసియేట్స్ సంయుక్తాధ్వరం
-త్వరలో ప్రభుత్వానికి నివేదిక
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారీ అపార్ట్‌మెంట్లు, ఆకాశ హర్మ్యాలు, విల్లాలు తదితర భవన సముదాయాలతో రద్దీ ప్రాంతాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో ఔటర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తుగా విశాలమైన రోడ్ల రూపకల్పనకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. గ్రోత్ కారిడార్ ప్రాంతంలో గ్రిడ్ రోడ్లతో పాటు సర్వీస్ రోడ్ల వెడల్పు, రద్దీ ప్రాంతాల్లో విశాలమైన రోడ్ల నిర్మాణాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హెచ్‌ఎండీఏ అధికారులు రెండు రోజుల కిందట లీ అసోసియేట్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఔటర్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, కొత్త రహదారుల ఏర్పాటు, ఔటర్‌లో ఎంట్రీ పాయింట్ల సంఖ్య పెంపు తదితర అంశాలపై లీ అసోసియేట్స్ అధ్యయనం చేసి హెచ్‌ఎండీఏకు నివేదిక అందించనున్నారు. ముఖ్యంగా ప్రతిపాదనలతో సిద్ధ్దంగా ఉన్న గ్రిడ్ రోడ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తొలివిడుతలో అవసరమైన చోట నిర్మాణ పనులు చేపట్టే దిశగా హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తున్నది.
గ్రిడ్ రోడ్ అంటే ?
ఔటర్ రింగు రోడుకు ఇరువైపులా ఒక కిలోమీటర్ వరకు అంటే 158 కి.మీల ఔటర్ రింగు రోడ్ పొడవులో మొత్తం 316 చ.కి.మీల విస్తీర్ణంలో గ్రోత్ కారిడార్‌గా నిర్ణయించారు. ఈ కారిడార్‌లో ఓఆర్‌ఆర్ వెళ్లేందుకు సర్వీస్‌రోడ్డు ఉంటుంది. ఆ సర్వీసు రోడ్డుకు సమాంతరంగా 150మీ.లకు ఒకటి చొప్పున రెండు రోడ్లు కి.మీ వెడల్పులో ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్వీసు రోడ్డుకు కొత్తగా ఏర్పాటు చేసే రెండు సమాంతర రోడ్లను కలుపుతూ కొత్తగా మొత్తం 372 రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొత్తం పొడవు 715కి.మీటర్లో 18, 24, 30, 36, 45, 60 మీటర్లతో గ్రిడ్ రోడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లు (స్పెషల్ ఎకనామిక్ జోన్)గా పరిగణిస్తుండడం.. ఈ గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో భవిష్యత్ అంతా ఇక్కడే అభివృద్ధి కేంద్రీకృతం కానుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా ప్రణాళికాబద్ధ్దమైన అభివృద్ధి ఔటర్ వెంట జరుగనున్నది.

284

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles