డ్రంక్ అండ్ డ్రైవ్ లేఖలపై ప్రశంసలు

Mon,April 22, 2019 12:32 AM

-పోలీసులకు కార్పొరేట్ సంస్థల మద్దతు
-నాలుగు నెలల్లో 207 ఉత్తరాలు
-వారిలో 110 మంది ఐటీ ఉద్యోగులు
-ఉద్యోగ నియామక మార్గదర్శకాల్లో క్రమశిక్షణ ఉల్లంఘనే
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కార్పొరేట్ సంస్థల మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. ట్రాఫిక్ అధికారులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఈ సంస్థల యాజమాన్యాలు, నిర్వాహకులు, ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు. పోలీసు అధికారులు చట్టపరంగా కచ్చితంగా ఉండడంతో కార్పొరేట్ సంస్థలో పని చేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని సంతోషిస్తున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్న ఉద్యోగి గురించి లేఖ ద్వారా తెలియజేస్తుండడంతో అతని వ్యక్తిగత ఉల్లంఘనలు కూడా తెలుస్తున్నాయి. దీంతో సంస్థలు కూడా అప్రమత్తమై మరో సారి ఉద్యోగి తప్పు చేయకుండా వారిని వారిస్తున్నారు.

ఇప్పటికే చాలా సంస్థలు ట్రాఫిక్ పోలీసులు రాస్తున్న లేఖలతో అప్రమత్తమై తమ ఉద్యోగులు క్రమశిక్షణ తప్పకుండా చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ అధికారులు రాస్తున్న ఈ లేఖల వ్యవహారాన్ని చాలా మంది హర్షిస్తుండగా, మరికొంత మంది ఇది తప్పు అంటున్నారు. ఇంకొందరైతే వీటిపై కోర్టుకు కూడా వెళ్లారని సమాచారం. ఎవరు ఏం చేసుకున్నా సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. 2018లో 14,782 డ్రంకన్ డ్రైవ్ కేసులను నమోదు చేయగా, 4,203 మందికి జైలు శిక్ష పడింది. ఈ ఏడాది 4 నెలల్లో దాదాపు 6,098 వేలకు పైగా డీడీ కేసులు నమోదు కాగా, పట్టుబడ్డ వారిలో 207 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఐటీ ఉద్యోగులు 110 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేఖలు రాశారు.

ప్రపంచంలో పేరొందిన సంస్థ కితాబు..
సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఓ కార్పొరేట్ సంస్థ ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులకు లేఖ రాసింది. మీరు చేస్తున్న పని మంచిది..అంటూ ఆ సంస్థ యాజమాన్యం ప్రశంసించింది. ముఖ్యంగా డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఉద్యోగి చేసిన తప్పును తెలియజేస్తూ రాస్తున్న లేఖలతో తాము అప్రమత్తమవుతున్నామని అందులో వివరించారు. మరోసారి మా ఉద్యోగి నుంచి తప్పు జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఆ లేఖలో స్పష్టం చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇదే విధంగా డ్రంకన్ డ్రైవ్‌ల తనిఖీలను పెంచి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆశిస్తున్నట్లు లేఖ రాస్తున్నారు. ఇలా చాలా కార్పొరేట్ సంస్థలు ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులకు తిరిగి లేఖలు రాస్తున్నారు. దీంతో సైబరాబాద్ పోలీసులకు బోలడంతా మద్దతు లభిస్తుందని స్పష్టమవుతుంది.వారి ప్రాణాల కోసమే.. అమలు చేస్తున్నాం

డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పోలీసులకు ఏదో లాభం జరుగుతుందని భావిస్తున్నారు...కానీ మద్యం మత్తులో వాహనం నడిపించే వారితోపాటు రోడ్లపై ఇతర వాహనదారుల ప్రాణాలను రక్షించడం కోసమే డ్రంకన్ డ్రైవ్‌ను విస్తృతంగా నిర్వహిస్తున్నాం. ఆ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారి వివరాలను వారు పని చేసే సంస్థలు, యాజమాన్యాలు, ఉన్నతాధికారులకు కచ్చితంగా పంపిస్తున్నాం. ఉద్యోగ నియామకాల్లో మద్యం సేవించి వాహనం నడుపడం క్రమశిక్షణ ఉల్లంఘనే. సుప్రీం కోర్టు ఆదేశానుసారంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై చాలా సీరియస్‌గా ఉన్నాం. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాదకరమైన డ్రంకన్ డ్రైవ్‌ను సహించం.
- ఎస్‌ఎం విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ

377

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles