సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా నిలోఫర్

Mon,April 22, 2019 12:37 AM

-సర్వెంట్ మృతితో స్పందించిన ప్రిన్సెస్
-మహిళల కోసం నిలోఫర్ హెల్త్ స్కూల్ ఏర్పాటు
-పలు నర్సింగ్ కోర్సులతో పాటు ఇన్ సర్వీస్ వైద్యులకూ శిక్షణ
-రాష్ట్రంలోని ఆరోగ్య పథకాలకు ఊపిరిపోస్తున్న రీజనల్ ట్రైనింగ్ సెంటర్
తన సేవకురాలి మృతి మహారాణి మనసును కలచివేసింది. ప్రసవ సమయంలో పనిమనిషి మరణించడంతో..ఇలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదనే లక్ష్యంతో ప్రిన్సెస్ నిలోఫర్ మహిళల కోసం నిలోఫర్ దవాఖానను ఏర్పాటు చేశారు. అందులో సుశిక్షితులైన మహిళా సిబ్బంది ఉండాలనే సంకల్పంతో దానికి అనుబంధంగా నిలోఫర్ హెల్త్ స్కూల్‌కు పురుడు పోశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎందరికో ప్రాణదానం చేస్తున్న నిలోఫర్, పలు ఆరోగ్య పథకాలూ సమర్థంగా అమలు కావడంలో సహకారం అందిస్తున్నది.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నిజాం కాలంలోనే నాటి ప్రభుత్వం ప్రజా వైద్యం కోసం ఉస్మానియా, ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలు పురుడుపోసుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా తనకుగాని తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైన జరుగరానిదేదైన జరిగితే వారి పేరుమీదనో లేదా వారి జ్ఞాపకార్థ హాస్పిటల్స్ లేదా విద్యాసంస్థలు లేక ఇతర నిర్మాణాలు చేపట్టడం చూశాం. కానీ తన ఇంట్లో సర్వెంట్‌గా పనిచేసే పనిమనిషి మృతిచెండంతో తీవ్రంగా కలతచెందిన రాణి నిలోఫర్ అలాంటి మరణాలు ఇకపై జరుగకూడదనే ఉద్దేశంతో ఏకంగా నిలోఫర్ దవాఖాననే ప్రారంభించింది. అయితే అప్పట్లో వైద్యవృత్తిలో మహిళలు తక్కువగా ఉండటంతో ప్రసవాలు పురుషులతో చేయించుకునేందుకు కొన్ని వర్గాల వారు ముందుకు వచ్చేవారు కాదు.

దీంతో మరణాల పరంపర కొనసాగడంతో తీవ్రంగా స్పందించిన ప్రిన్సెస్ నిలోఫర్ ప్రసవాలు చేయడానికి మహిళల కోసం ప్రత్యేకంగా 1956లో నిలోఫర్ హెల్త్ స్కూల్‌కు పురుడుపోశారు. 1963నుంచి ఈ హెల్త్‌స్కూల్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభమైంది. నిలోఫర్ రాణికి సహాయకురాలిగా పనిచేసే రఫియా అనే మహిళ ప్రసవించిన సమయంలో మరణించడంతో సురక్షిత ప్రసవాలు జరగాలనే లక్ష్యంతో అప్పట్లో కనీసం 7వ తరగతి చదివిన మహిళలు ప్రసవాలు చేసేవిధంగా వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం నిలోఫర్ హెల్త్ స్కూల్‌లో ప్రారంభించారు. 40మంది విద్యార్థినులతో ప్రారంభమైన ఈ హెల్క్ స్కూల్ నేడు ప్రతియేటా 240 మందికి శిక్షణ ఇస్తున్నది. అంతే కాకుండా ప్రస్తుతం ప్రభుత్వ వైద్యులు, నర్సులుగా పనిచేస్తున్న సిబ్బందికి కూడా అక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో సేవలు అందిస్తున్నారు.

ఎల్‌హెచ్‌తో ప్రారంభం..

1963లో 7వ తరగతి ఉత్తీర్ణులైన 40 మంది విద్యార్థినులతో హెల్త్ విజిటర్స్ కోర్సు పురుడుపోసుకున్నది. ఇలా మూడేండ్లపాటు కొనసాగించిన ఈ కోర్సుకు 10వ తరగతి ఉత్తీర్ణతను కనీస విద్యార్హతగా నిర్ణయించారు. అనంతరం 1974లో హెల్త్ విజిటర్స్ (ఎల్‌హెచ్) కోర్సును ఎల్‌హెచ్‌వీ (లేడీ హెల్త్ విజిటర్స్)గా అప్‌గ్రేడ్ చేసి శిక్షణ కాలాన్ని 18 నెలలకు పెంచారు. 1995లో ఆగ్జరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ(ఏఎన్‌ఎం), ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులను ప్రవేశపెట్టారు. ఒక్కో విభాగంలో 40 సీట్ల చొప్పున ఏఎన్‌ఎం, ఎల్‌హెచ్‌వీ కోర్సుల్లో కలిపి మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన 160 మంది విద్యార్థినులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈ కోర్సులతో పాటు ప్రభుత్వ సర్వీసులో ఉన్న నర్సులు పదోన్నతి పొందేందుకు ఆరు నెలల కాలపరిమితితో కూడిన కోర్సును ప్రవేశపెట్టారు. ఏఎన్‌ఎం కోర్సు పూర్తిచేసిన మహిళా ఇన్ సర్వీస్ అభ్యర్థులకు నిలోఫర్ హెల్త్ స్కూల్‌లో ఆరునెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలకు నర్సింగ్, హెల్త్ సూపర్‌వైజర్స్‌గా పదోన్నతి పొందే అవకాశాలుంటాయని నిలోఫర్ హెల్త్ స్కూల్ అండ్ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. ఈ కోర్సుతో పాటు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే ఇన్‌సర్వీస్ వైద్యులకు సైతం వైద్యరంగంలో కొత్తగా వచ్చే ఆధునిక పద్ధతులపై ఇక్కడ శిక్షణ ఇస్తున్నట్లు ఆమె వివరించారు. విద్యార్థినులకు నర్సింగ్ విభాగంలో శిక్షణ ఇవ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులకు ఇక్కడ నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అక్కడ శిక్షణ పొందే విద్యార్థినులు, వైద్య సిబ్బందికి బస చేసేందుకు హాస్టల్ సౌకర్యం కూడా ఉన్నది. ప్రైవేట్ నర్సింగ్ స్కూల్‌లలో ఏఎన్‌ఎం కోర్సు చేయాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒకే ఒక్క ప్రభుత్వ హెల్త్‌స్కూల్ ఉన్నది.

ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో

నర్సింగ్ విద్యార్థినులతో పాటు ఇన్‌సర్వీస్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సోషియల్ సైన్స్ ఇన్‌స్ట్రక్టర్, పబ్లిక్ హెల్త్ నర్స్ ఇన్‌స్ట్రక్టర్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్, హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లోని ఇన్‌సర్వీస్ వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు.

విశాలమైన హాస్టల్ సౌకర్యం..

నిలోఫర్ హెల్త్ స్కూల్‌లో రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వివిధ నర్సింగ్ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు విద్యార్థినులు వస్తుంటారు. సాధారణంగా ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థినులంతా దూరప్రాంతాలకు చెందినవారే కావడంతో వారికి పూర్తి సురక్షితమైన వసతి సౌకర్యం కల్పించేందుకు 200 పడకల సామర్థ్యంగల హాస్టల్ భవనం అందుబాటులో ఉన్నది. విద్యార్థినులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో పుష్టికరమైన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన కుక్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా..

నిలోఫర్ హెల్త్ స్కూల్ ద్వారా ఏఎన్‌ఎం, ఎల్‌హెచ్‌వీ తదితర కోర్సుల్లో మహిళా నర్సింగ్ విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. నిష్ణాతులైన సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉన్నారు. నర్సింగ్ విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇన్‌సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ వైద్యులందరికీ ఇక్కడ ఎప్పటికప్పుడు వైద్యరంగం, ప్రసూతి వైద్యచికిత్సలో మెళకువలు బోధిస్తూ శిక్షణ ఇస్తున్నాం. కేసీఆర్ కిట్స్, మిషన్ ఇంద్రధనుసు, పల్స్‌పోలియో తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే ఆరోగ్య పథకాలకు సంబంధించిన ప్రతి అంశంపైన శిక్షణ ఇస్తున్నాం. మాతా శిశు మరణాలను తగ్గించడంలో నిలోఫర్ హెల్త్‌స్కూల్ అండ్ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తున్నది.
- డాక్టర్ ఉషారాణి, ప్రిన్సిపాల్, నిలోఫర్ హెల్త్‌స్కూల్ అండ్ రీజినల్ ట్రైనింగ్ సెంటర్

సౌకర్యాలు బాగున్నాయి

ప్రైవేట్‌లో చదివే స్థోమత లేక నిరాశపడ్డాను. కానీ హైదరాబాద్‌లో నిలోఫర్ హెల్త్ స్కూల్ ద్వారా నర్సింగ్ కోర్సు చేయవచ్చని తెలుసుకుని ఇక్కడ చేరాను. సౌకర్యాలు బాగున్నాయి. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. నర్సింగ్ కోర్సు చేసి తన వంతుగా ప్రజలకు సేవచేయడంతో పాటు తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలువాలన్నది నా ఆశయం.
-సౌజన్య, నిజామాబాద్

సీఎం కేసీఆర్ దయతోనే..

మాది మహబూబ్‌నగర్. జిల్లా వ్యవసాయ కుటుంబం. ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులకు వెళ్లలేదు. నిలోఫర్ హెల్త్ స్కూల్‌లో చేరాను. ఇక్కడ మంచి శిక్షణ ఇస్తున్నారు. ఇంట్లో కూడా సన్న బియ్యం తినలేదు. కానీ సీఎం కేసీఆర్ దయవల్ల మా హాస్టల్‌లో సన్న బియం అన్నం తింటున్నాం. చాలా హ్యాపీగా ఉన్నది. చదువాలనే పట్టుదల పెరిగింది.
-శిరీష, రంగారెడ్డిజిల్లా

462

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles