తనవాడేనని నమ్మితే నట్టేట ముంచాడు..

Wed,May 15, 2019 12:45 AM

బంజారాహిల్స్‌, మే 14 (నమస్తే తెలంగాణ) : మెరుగైన వైద్యం కోసం నగరానికి వచ్చిన ఓ విదేశీయురాలికి భాష రాకపోవడంతో అనువాదకుడిగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయలను దండుకున్న యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యెమెన్‌ దేశానికి చెందిన అడెన్‌ నగరానికి చెందిన అబ్దుల్‌ నాసిర్‌ ఒటెయాన్‌ నయన్‌ (68)కు గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్‌ సోకింది. చికిత్స కోసం ఆరునెలల క్రితం భర్తను ఇండియాకు తీసుకువచ్చిన భార్య అజార్‌ మహ్మద్‌ అలీ ముంబయిలో కొంతకాలం చికిత్స చేయించింది. అయితే అక్కడ దవాఖాన ఫీజు ఎక్కువగా ఉండడంతో ఫేస్‌బుక్‌లో తమ పరిస్థితిని వివరిస్తూ పోస్ట్‌ పెట్టింది. తక్కువ ఖర్చులో చికిత్స పొందే అవకాశం ఉందా అని యెమెన్‌ భాషలో పెట్టిన ఈ పోస్టును హైదరాబాద్‌లోని తార్నాకలో నివాసముంటూ పీజీ చేస్తున్న యెమెన్‌ దేశానికి చెందిన క్యాయిద్‌ మువాద్‌ గలాల్‌ అబ్డో (25) చూశాడు. హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో క్యాన్సర్‌ చికిత్స అందుబాటులో ఉందని చెప్పడంతో ఇక్కడకు వచ్చిన అబ్దుల్‌ నాసిర్‌ను బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 1లోని విరంచిలో చేర్పించారు. పారామౌంట్‌ కాలనీలో గది అద్దెకు తీసుకున్న భార్య అజార్‌ మహ్మద్‌ అలీకి యెమెన్‌ భాష తప్ప ఇతర భాషలు రాకపోవడంతో తనకు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టిన క్వాయిద్‌ మువాద్‌ను ట్రాన్స్‌లేటర్‌గా నియమించుకుంది.

దవాఖానకు వెళ్లినప్పుడు డాక్టర్లతో సంభాషించడంతో పాటు ఇతర వ్యవహారాలు చూడాలని కోరింది. ఇదిలా ఉండగా పిత్తాశయం క్యాన్సర్‌ ఎక్కువ కావడంతో దాన్ని తొలగించి కృత్తిమ గాల్‌బ్లాడర్‌ను పెట్టాల్సి ఉంటుందని విరంచి వైద్యులు తెలిపారు. దీనికోసం రూ.3.5లక్షలు ఖర్చవుతుందని వివరించారు. ఈ విషయాన్ని రోగి భార్య అజార్‌కు చెప్పాల్సిన ట్రాన్స్‌లేటర్‌ మువాద్‌ సుమారు రూ. 10 లక్షలు ఖర్చవుతుందని అనువదించాడు. దీంతో పాటు గాల్‌బ్లాడర్‌ను మార్చాల్సిన అవసరం లేదని, చికిత్స ద్వారా గాల్‌బ్లాడర్‌ను సరిచేయవచ్చం టూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన అజర్‌ మహ్మద్‌ పలుమార్లు డబ్బులు ఇచ్చింది. సుమారు 12లక్షల దాకా తనవద్ద వసూలు చేశాడని, దవాఖానలో చెల్లించిన బిల్లులో కూడా భారీగా కమిషన్లు దండుకున్నాడంటూ ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యెమెన్‌ దేశ దౌత్య కార్యాలయానికి కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్న మువాద్‌ది కూడా యెమెన్‌ దేశమే అని చదువుకునేందుకు వచ్చి పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నాడని, ఈ క్రమంలో భాషరాని వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితుడు మువాద్‌పై ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై యెమెన్‌ దేశ ఎంబసీకీ కూడా సమాచారమందిచినట్లు పోలీసులు తెలిపారు.

324

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles