నీటి ఎద్దడిని అధిగమిస్తాం

Wed,May 15, 2019 12:45 AM

సిటీబ్యూరో/మణికొండ, నమస్తే తెలంగాణ : నీటి కొరతను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు చేపడుతున్నది. ప్రస్తుత వేసవిలో కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ సర్కిల్‌లలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఒకవైపు సింగూరు, మంజీరా జలాల సరఫరా నిలిచిపోవడం, మరోవైపు మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి ఇక్కట్లు అధిగమైయ్యాయి. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ దానకిశోర్‌ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగూరు, మంజీరా జలాల సరఫరా అయ్యే ప్రాంతాలకు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాల నీటిని మళ్లించి నీటి ఎద్దడికి పరిష్కారం చూపారు. ఈ క్రమంలోనే తాజాగా గండిపేట కాండ్యూడ్‌ మీద మణికొండ, పుప్పాలగూడ ప్రాం తాల్లో 2 ఎంఎల్‌డి సామర్థ్యం కలిగిన రెండు అత్యాధునిక వర్టికల్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను కొత్తగా ఏర్పాటు చేసి సమీప ప్రాంతాలకు నీటి సరఫరాను మరింత మెరుగుపర్చారు. అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌ బెడ్‌ నుంచి సరఫరా అయ్యే నీటికి స్వస్తి పలకడం ద్వారా రాజేంద్రనగర్‌లోని పలు ప్రాంతాల్లో సమృద్ధి గా నీటి సరఫరా జరగనుంది.

అంతేకాకుండా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలలో నీటి ఎద్దడి నివారణకు 24 గంటల పాటు 30 అదనపు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయనున్నారు.నగరంలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా నూతనంగా అత్యాధునిక వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (వర్టికల్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోని ప్రజల దాహార్తికి శాశ్వత పరిష్కారంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.అనంతరం హఫీజ్‌పేటలోని జలమండలి డివిజన్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎండీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంజీరా, సింగూరు సరఫరా ఆగిపోవడం వల్ల నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుత్భుల్లాపూర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆదనంగా 5 ఎంఎల్‌డి మంచినీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

అలాగే అదనంగా ఈ ప్రాంతాల్లో 30 వాటర్‌ ట్యాంకర్లను ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని ఎండీ వివరించారు. ఈ ఏర్పాట్లతో ఆయా ప్రాంతాల్లో నీటి ఇక్కట్లు తీరుతాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో భూ గర్భ జలాలు అడుగంటి పోవడంతో నీటి సమస్యలు అధిగమైనట్లు తెలిపారు. నీటి ఇక్కట్లు ఉన్న ప్రాంతాలకు హియాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్ల నుంచి నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ కార్యక్రమంలో నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అదనంగా మంచినీటిని సరఫరా చేయాలని ఎండీ ఆదేశించారు. ట్వీట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. నగరంలోని 2వేల కిలోమీటర్ల వెంబడి ఉన్న మ్యాన్‌హోళ్ల మరమ్మత్తు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎండీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ పి. రవి, టెక్నికల్‌ డైరెక్టర్‌ విఎల్‌ ప్రవీణ్‌ కుమార్‌తో పాటు సంబంధిత సీజీఎం, జీఎం, డీజీఎం, మేనేజర్లు పాల్గొన్నారు.

260

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles