టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన నకిలీ ఐపీఎస్

Sat,May 18, 2019 01:23 AM

-ప్రేమలో పడ్డ వివాహిత
-ఆమెకు దగ్గరవ్వడం కోసం కుట్ర
-శామీర్‌పేట్‌లో కేసు.. పెండింగ్‌లో వారెంట్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఐపీఎస్‌గా బడాయి ప్రదర్శిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన నకిలీ ఐపీఎస్ అధికారి జీవీకే రెడ్డి హంగూ ఆర్భాటం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టేంతంటి వరకు వెళ్లింది. ఐపీఎస్ అధికారినంటూ తన సొంత ఊరిలో హంగామా చేసి గిద్దలూరు పోలీసులకు చిక్కిన కర్నాటి గురువినోద్‌కుమార్‌రెడ్డి అలియాస్ జీవీకే రెడ్డిని నాల్గోసారి గురువారం సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2016లోనే సివిల్ పరీక్ష రాసి, తాను ఐపీఎస్‌కు ఎంపికయ్యానంటూ తన స్వగ్రామంలో బిల్డప్ ఇచ్చాడు. రైళ్లో ప్రయాణించే సమయంలో రైల్వే సిబ్బందిని, ఆర్పీఎఫ్ సిబ్బందిని బురిడీ కొట్టించాడు. అసలైన ఐపీఎస్ అధికారిగా ఫోజులిస్తూ, వారిని నమ్మించేవాడు. ఇటీవల చెన్నై నుంచి రైల్లో హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో రైల్వే పోలీసులు ఇతడిని నిజమైన ఐపీఎస్ అధికారి అని భావించారు. అతడి దుస్తులు చూసి, అతడి డమ్మీ పిస్టోల్, నకిలీ గుర్తింపుకార్డును చూసి పెద్దసారు అని భావించారు.

దీంతో అతని రైలు బోగిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, సారు ఐపీఎస్ అంటూ చర్చించుకొని అతడికి మర్యాదలు చేశారు. అందులో ప్రయాణించే వారు నిజంగానే ఐపీఎస్ అధికారి అనుకొని మర్యాద ఇచ్చారు. అతడికిచ్చిన మర్యాదలు.. అతని హంగామా చూసిన ఓ వివాహిత అతనిపై మనస్సు పారేసుకుంది. ఇద్దరు మాట్లాడుకొని ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఫేస్‌బుక్‌లో జీవీకేరెడ్డి ఫొటోలు చూడడంతో ఆర్మీ దుస్తులు, ఎయిర్‌ఫోర్స్ ఇలా పలు విభాగాలలో పనిచేసినట్లు ఫోజులిస్తూ దిగిన ఫొటోలను చూసి ఆమె పూర్తిగా అతడ్ని నమ్మింది. ఇక ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆమెకు దగ్గరవ్వాలని జీవీకే రెడ్డి ప్లాన్ చేశాడు. అయితే ఆమె భర్తను ఇబ్బందులకు గురిచేస్తే, ఆ ఇబ్బందులతో తనకు మరింత దగ్గరవుతుందని భావించాడు.

ఇందుకు అతడు ఎక్కడ పనిచేస్తున్నాడని ఆరా తీశాడు, ఆమె భర్త శామీర్‌పేటలోని ఓ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో తాను ఎన్‌ఐఏలో అదనపు ఎస్పీనంటూ శామీర్‌పేట్ ఠాణాకు ఫోన్ చేశాడు, జీనోమ్ వ్యాలీలో ఏఏ కంపెనీలున్నాయంటూ ఆరా తీశాడు. శామీర్‌పేట్ పోలీసులు కూడా అతడు నిజమైన అధికారనే భావనతో కంపెనీల వివరాలను ఈమెయిల్ చేశారు. అందులో నుంచి తన ప్రియురాలి, భర్త పనిచేస్తున్న కంపెనీని ఎంచుకొని, నిర్వాహకుడి ఫోన్ నంబర్ సేకరించాడు. ఆ సంస్థ నిర్వాహకుడికి ఎన్‌ఐఏ అధికారినంటూ ఫోన్ చేసి, అతడిపై కేసులున్నాయని బెదిరించి, ఉద్యోగంలో నుంచి తీసేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా సంస్థ యజమానికి ఫోన్ చేసి ఫలానా వ్యక్తిపై అతని భార్య కేసు పెట్టిందని, అతడి వివరాలు కావాలంటూ మాట్లాడాడు. అయితే సంస్థ యజమాని మీరు అధికారికంగా మాకు మెయిల్ పంపండి లేదంటే స్థానిక పోలీసులను సంప్రదించి, వారి ద్వారా తమ నుంచి వివరాలు తీసుకోవాలని సూచించాడు.

ఇతడు మాట్లాడిన వ్యవహారంపై సంస్థ యజమానికి అనుమానం వచ్చి శామీర్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అంతకుముందు ఎన్‌ఐఏ అధికారినంటూ పోలీస్‌స్టేషన్ నుంచి వివరాలు తీసుకున్న వ్యక్తికి సంబంధించిన ఫోన్ నంబర్ వివరాలను ఆరా తీశారు. ట్రూకాలర్‌లో డీసీపీ రెడ్డిసార్ అని ఉంది. పోలీస్‌స్టేషన్ నుంచి చేసిన కాల్స్‌కు స్పందించకపోవడంతో లోతుగా ఆరా తీశారు. డూప్ అధికారి అని నిర్ధారించుకొని శామీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం వారెంట్ పెండింగ్‌లో ఉంది. తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కడంతో పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేయనున్నారు. నగరంలో పనిచేస్తున్న ఓ ఏసీపీతోను మంచి పరిచయం ఉండడంతో పాటు ఏకంగా ఆయన సీట్లో కూడా కూర్చున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా ఇతని స్నేహితుడి బంధువులకు కరీంనగర్‌లో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేసిన వైద్యులు రూ. 1.2 లక్షల బిల్లు వేశారు. అయితే వారు బిల్లు అంత కట్టుకోలేమని, నీవు ఐపీఎస్ కదా సహాయం చేయాలని కోరారు. దీంతో వైద్యులకు ఫోన్ చేసి తాను డీసీపీనంటూ మాట్లాడి రూ. 40 వేల వరకు బిల్లులో రాయితీ ఇప్పించాడని సమాచారం.

246

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles