జలసంపద పెంచుదాం

Sat,May 18, 2019 01:33 AM

-నీటి కొరతను దూరం చేద్దాం
-వాన నీటిని ఒడిసి పడుదాం
-నేడు వాటర్ హార్వెస్టింగ్ డే
-జలమండలి, జీహెచ్‌ఎంసీ సంయుక్తాధ్వర్యంలో 11వేల ఇంకుడు గుంతల పునరుద్ధరణ
-మహత్కార్యంలో భాగస్వాములవుదాం కమిషనర్ దానకిశోర్ పిలుపు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :
గ్రేటర్‌లో అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచేందుకుగానూ జీహెచ్‌ఎంసీ, జలమండలి సంయుక్తంగా కలిసి నిర్మించిన సుమారు 11వేల ఇంకుడు గుంతల పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాటర్ హార్వెస్టింగ్ డే సందర్భంగా నేడు (శనివారం) ఒక్కరోజే పెద్ద ఎత్తున చేపట్టే ఇంకుడు గుంతల పునరుద్ధరణలో ప్రజలందరూ పాల్గొని భూ గర్భ జలాలను పెంపొందించడంలో తోడ్పడాలని జలమండలి ఎండీ దానకిశోర్ బహిరంగ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. ఒక సదాశయంతో చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. రాబోయే రోజుల్లో నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని దానకిశోర్ సూచించారు. నూతనంగా ఎవరైనా ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే జలమండలి సాంకేతిక సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

నీరు లేని నగరంగా కేఫ్ టౌన్
నీరు మనిషికే కాదు.. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి ప్రాణాధారం. నీరు లేకపోతే ప్రపంచమే లేదు. భూమి మీదున్న నీటిలో 97శాతం సముద్రం ఉన్నప్పటికీ ఆ నీళ్లు తాగడానికి పనికి రావు. మరో 2 శాతం నీరు మంచు పర్వతాల రూపంలో గడ్డకట్టుకుని ఉంది. ఈ నీరు కూడా తాగడానికి పనికి రాదు. ఇక మిగిలింది కేవలం 1 శాతం మాత్రమే ఉన్న నీరు భూ ప్రపంచంలోని సకల జీవరాశులకు ఆధారం, అయితే పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈ నీరు సరిపోవడం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం 165 దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. సౌత్ ఆఫ్రికాలోని కేఫ్‌టౌన్ నగరం తొలి నీరు లేని నగరంగా చర్రితలో నిలిచిపోయింది. మన దేశంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే వర్షపు నీటిని సంరక్షించుకోవడం మినహా మరొక మార్గం లేదు. ఏటా కురిసే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకింప చేసిప్పుడు నీటి బాధలు ఉండవు.

నిర్వహణలోనూ బాధ్యతను విస్మరించొద్దు
గ్రేటర్‌లో దాదాపు 11 వేల ఇంకుడు గుంతలను జీహెచ్‌ఎంసీ, జలమండలి సంయుక్తంగా కలిసి వివిధ సందర్భాల్లో నిర్మించారు. పలు భవంతుల పరిసరాలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులకు ఇరువైపులా రీచార్జ్ గుంతలు నిర్మించారు. ఇంకా ప్రభుత్వ సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, గృహ యాజమానులు, పలు కాలనీ వాసులు, గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలు ఎన్నో ఉన్నాయి. వర్షపు నీటిని సంరక్షించే ఒక గొప్ప ఆశయంతో నిర్మించిన ఈ ఇంకుడు గుంతల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ సీసాలు, తిని పారేసిన ఆహార పదార్థాలు పడేస్తున్నారు. చెడిపోయిన వస్తువులను ఇందులోకి విసిరి వేస్తున్నారు. దుమ్ము,ధూళిని ఇందులోకి నెట్టి వేస్తున్నారు. చెట్లు, చేమలు, పిచ్చి మొక్కలు ఈ గుంతల్లో పేరుకుపోయితున్నాయని, మట్టి, బురదతో క్రమంగా ఆ ఇంకుడు గుంతలన్నీ రోడ్డు లెవల్‌కు రావడం వలన పారుతుండే వర్షపు నీరు ఇందులోకి వెళ్లకుండా వృథాగా పోతున్నాయి. ఇందువలన ఒక లక్ష సాధనతో నిర్మించిన ఇంకుడు గుంతల ప్రయోజనం నేరవేరడం లేదని అధికారులు చెబుతున్నారు.

రాబోయే వర్షాకాలం దృష్ట్యా.. శ్రమదానం చేయండి
భూమిపై పడే ప్రతి వర్షపు నీటి చుక్కను ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకే విధంగా చేయడం ద్వారా ఈ పరిసర ప్రాంతమంతా నీటి నిలువ ఉంటుంది. భూగర్భ జలాలు పెంపొందుతాయి. తద్వారా అక్కడ నీటి ఎద్దడి ఉండదు. ప్రజలు తమ తమ ప్రాంతాల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను శుభ్రం చేసుకోవాలి. సొంతంగా ఇంట్లో నిర్మించుకున్న ఇంకుడు గుంతలైతే అవి సక్రమంగా ఉన్నాయా? తగినంత కంకర, ఇసుక ఉందా.. ఆయా గృహ యాజమానులు పరిశీలించుకుని నిర్వహణ చేపట్టాలి. ఇంకుడు గుంతలను ప్రక్షాళన చేసుకోవడం ద్వారా బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉండదు. ప్రతి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపించినట్లు అయితే పుడమి తల్లి పులకరిస్తుంది. కాలనీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను ఆయా కాలనీ వాసులు పరిశీలించాలి. చెత్తాచెదారంలో ఉన్న ఇంకుడు గుంతలని శ్రమదానంతో తీసివేసి రాబోయే వర్షపు నీటి కోసం ఇంకుడు గుంతలు పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాల్సిన అసవరం ఉందని అధికారులు చెబుతున్నారు.

374

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles