వేటు వేస్తేనే.. దారికొస్తున్నారు!!

Sun,May 19, 2019 02:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కర్ర లేనిదే బర్రె వినదని సామెత.. జిల్లా రెవెన్యూ సిబ్బంది సైతం కొరడా ఝులిపించిన తర్వాతే దారికొచ్చారు. కిమ్మనకుండా సక్రమంగా పని చేసుకుంటున్నారు. జిల్లా రెవెన్యూలో పలు అక్రమాలు వెలుగు చూడటం, బాధ్యులపై వేటు వేయడం తెలిసిందే. ఇలా పక్షం రోజుల వ్యవధిలోనే నలుగురు రెవెన్యూ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఇలా వరుస సస్పెన్షన్లతో రెవెన్యూ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. అక్రమాలకు పాల్పడి దొరికిపోతే, అసలుకే మోసం వస్తుందని, కాసులకు కక్కుర్తిపడితే ఉద్యోగం ఊడుతుందని గ్రహించి అక్రమార్కులంతా జాగ్రత్తగా మసలుకుంటున్నారు. ఇటీవల మారేడ్‌పల్లి, అంబర్‌పేట, షేక్‌పేట మండలాల్లో వెలుగు చూసిన అక్రమాలు, ఉద్యోగుల సస్పెన్షన్లు రెవెన్యూ శాఖలో హడలెత్తించాయి. ఆధారాలతో సహా ఫిర్యాదులు రావడాన్ని సీరియస్‌గా పరిగణించిన అధికారులు, తహసీల్దార్ల నుంచి నివేదికలు తెప్పించుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సస్పెండ్ చేసేశారు. ఈ మండలాల్లో వీఆర్‌వోలు, ఆర్‌ఐల వ్యవహారం రెవెన్యూ శాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది. కల్యాణలక్ష్మి పథకం చెక్కులివ్వడానికి రూ.5వేలు లంచంగా డిమాండ్ చేయడం, సాక్షాత్తు బాధితులు రికార్డు చేసి ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, అధికారుల విచారణలో వాస్తవమని తేలడంతో రెవెన్యూ శాఖపై మచ్చపడింది. మీడియా దృష్టిపెట్టి వరుసగా పలు అక్రమాలను వెలుగులోకి తేవడంతో తాము దొరికిపోతామేమోనని సిబ్బంది జంకుతున్నారు.

-ఖైరతాబాద్ మండలంలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు సంబంధించి మొత్తం 123 చెక్కులకు గాను 11 పంపిణీ చేయగా, 112 చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసిన తర్వాత నాలుగురోజుల వ్యవధిలోనే లబ్ధిదారుల అకౌంట్లల్లో చెక్కులు జమ చేశారు.
-మారేడ్‌పల్లి మండలంలో 68 చెక్కులు ఇవ్వాల్సి ఉండగా, పక్షం రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.
-బండ్లగూడ మండలంలో కేవలం రెండు చెక్కులు మాత్రమే పెండింగ్‌లో ఉండగా, వాటిని వచ్చిన రెండో రోజే లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు.
అక్రమార్కులపై జిల్లా అధికారుల కొరడా..

నిలువెత్తు ఆవహించిన నిర్లక్ష్యం. ఏదో ఒక తిరకాసు పెట్టడం.. కాళ్లరిగేలా తిప్పుకోవడంలో రెవెన్యూ సిబ్బందిని మించినోళ్లుండరన్నది ఆరోపణ. ఎడతెగని జాప్యానికి తోడు అవినీతి మచ్చ జిల్లా రెవెన్యూశాఖను పీడిస్తున్నది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొంత మంది సిబ్బంది వ్యవహారం ఆ శాఖకు మాయని మచ్చను తెచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వర్తింపులోనూ సిబ్బంది అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో దానికి ఒక్కో రేటు చొప్పున వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందుతున్నాయి. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఆపద్బంధు పథకాల అమలులో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో రూ.5వేల నుంచి రూ.7వేలు లేనిదే ఫైలు ముందుకు కదలడం లేదు. ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, కారుణ్య నియామకాల విచారణలు సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే సిబ్బంది తీరుతో విసుగెత్తిన జనం ఏకంగా రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న సందర్భాలున్నాయి. ఇటీవల అక్రమాల సంఖ్య పెరుగడంతో జిల్లా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫిర్యాదు వస్తే చాలు బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

200

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles