మెట్రో స్మార్ట్ పార్కింగ్

Sun,May 19, 2019 02:37 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉరుకులు, పరుగుల జీవితంలో వేగంగా గమ్యస్థానాలకు చేరుకుని సమయం ఆదా, ఒత్తిడి లేని ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకున్న వారికి హైదరాబాద్ మెట్రో ఒక వరమైతే, వాహనాన్ని మెట్రో స్టేషన్ల వద్ద ఎక్కడ పార్కు చేయాలో తెలియని దుస్థితి నగరవాసిది. మెట్రో స్టేషన్ల సమీపాన మెట్రో ప్రయాణికుల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేసినా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ వల్ల అసలు తమ వాహనానికి పార్కింగ్ స్థలం దొరుకుతుందా ? లేదా అనే ఆందోళన ఒక వైపు నగర వాసిని ఆందోళనకు గురిచేసే అంశం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, ఆలోచన మేరకు హైదరాబాద్ మెట్రోరైలు వినూత్నమైన ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ పార్కింగ్ విధానానికి రూపకల్పన చేసి అమల్లోకి తెచ్చింది. యాప్ ద్వారా ఇంటి నుంచి లేదా మరే ప్రాంతం నుండైనా కావాల్సిన పార్కింగ్ యార్డులో ఆన్‌లైన్ విధానంనలో పార్కింగ్ స్లాట్‌ను రిజర్వేషన్ చేసే సదుపాయాన్ని హైదరాబాద్ మెట్రోరైలు కల్పిస్తున్నది. అందులో భాగంగా ముందుగా బేగంపేట రైల్వేస్టేషన్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ చేతుల మీదుగా స్మార్ట్ పార్కింగ్ విధానంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లను సోమ వారం ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

యాప్ ద్వారా కలర్ కోడింగ్‌తో రిజర్వేషన్..
అందుబాటులోకి వస్తున్న ఇంటిగ్రేటెడ్ స్మార్ట్‌పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఐఎస్‌పీఎంఎస్) మొత్తం యాప్ ద్వారా ఆపరేట్ చేసే వీలుంటుంది. పార్క్ హైదరాబాద్ పేరుతో పిలువబడే ఈ యాప్ ద్వారా మెట్రో స్టేషన్లలోని పార్కింగ్ స్లాట్‌లను రిజర్వు చేసుకోవచ్చు. ఈ విధానంలో కలర్ కోడింగ్ విధానం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మూడు రంగుల విధానంలో గ్రీన్ కలర్ పార్కింగ్‌లో ఖాళీ స్థలాన్ని చూపిస్తుంది. తక్కువ పార్కింగ్ స్థలం మాత్రమే ఉన్నదని ఆరెంజ్ కలర్ చూపించగా, రెడ్ కలర్ వేకెన్సీ లేదని చూపిస్తుంది. ప్రాథమిక దశలో 4 వేల ద్విచక్ర వాహనాలు, 400 కార్ల కోసం పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశముంది. అయితే పార్కింగ్ రిజర్వేషన్ చేసుకుంటే వాహన నెంబర్ ద్వారా స్లాట్ కున్నా బారికేడ్లు ఓపెన్ అవుతాయి. స్లాట్‌లోకి కారు వెళ్లిపోయాక ఆటోమేటిక్ లాకింగ్ సిస్టం ద్వారా లాక్ చేయబడుతుంది. వాహనదారులు దీనిని ఓపెన్ చేయాలంటే యాప్ ద్వారానే ఓపెన్ చేసుకుని వాహనం తీసుకుని వెళ్లే వెసులుబాటు ఉంటుంది.

గంటకు ద్విచక్ర వాహనానికి రూ.3, కారుకు రూ.8
అమల్లోకి వస్తున్న స్మార్ట్ పార్కింగ్ విధానంలో ద్విచక్ర వాహనానికి గంటకు రూ.3, కారు కోసం రూ.8 గా నిర్ణయించారు. దీని ప్రకారం ఎన్నిగంటలవసరమో ముందే బుక్ చేసుకోవచ్చు. అవసరమైతే నిర్ణీత సమయం ముగియకముందే రిజర్వేషన్ సమయాన్ని పొడిగించుకునే వీలుంటుంది. అయితే మంత్లీ పార్కింగ్ పాస్‌లు, వీక్లీ పాస్‌లు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. మంత్లీ పాస్‌లు తీసుకున్నవారికి పార్కింగ్ చార్జీల్లో 50 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నారు. 24 గంటలకు ఎంతనేది తేలాల్సి ఉంది.

పార్కింగ్ యార్డులో అనేక సౌకర్యాలు
సర్వేలెన్స్ కెమెరాల పర్యవేక్షణలో ప్రతీ అంశాన్ని రికార్డు చేయబడుతాయి. అమెరికా, లండన్ వంటి దేశాలలో మాత్రమే ఇటువంటి సౌకర్యాలున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

333

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles