ఇంకుడు గుంతలతోనే నీటి సంరక్షణ

Sun,May 19, 2019 02:41 AM

-ఒకే రోజు 8 వేల ఇంకుడుగుంతలకు మరమ్మతులు
-ఉద్యమంలా వాటర్ హార్వెస్టింగ్ డే

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :రోజురోజుకు విస్తరిస్తున్న మహానగరంలో..అంతకంతకు పెరుగుతున్న నీటి వినియోగం.. మండు వేసవిలోనూ నీటి కరువు రావద్దంటే.. ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టాలి.. ఇంకుడుగుంతలతో భూగర్భంలోకి మళ్లించాలి.. భవిష్యత్ అవసరాలకు వాడుకోవాలి.. ఇలా నీటి సంరక్షణే ధ్యేయంగా నగరంలో శనివారం చేపట్టిన వాటర్ హార్వెస్టింగ్ డే సందర్భంగా 8 వేలకు పైగా ఇంకుడుగుంతలకు మరమ్మతులు చేపట్టారు. ప్రతి బొట్టు వృథా కావొద్దనే లక్ష్యంతో ముందడుగు వేశారు.

నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా శనివారం ఒక్కరోజే 8 వేలకు పైగా ఇంకుడుగుంతల పునర్నిర్మాణాన్ని చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ, దానకిశోర్ వెల్లడించారు. జోన్ల వారీగా ఎల్బీనగర్‌లో 1326, చార్మినార్-640, శేరిలింగంపల్లి -2184, సికింద్రాబాద్-1050, కూకట్‌పల్లి -1330, ఖైరతాబాద్ జోన్-1500ల ఇంకుడు గుంతలకు మరమ్మతులు చేపట్టారు. మల్కాజిగిరి, కాప్రాలతో పాటు నారాయణగూడలోని మేల్కొటే పార్కులో నిర్వహించిన ఇంకుడుగుంతల పునరుద్ధరణ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని 165 దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, సౌత్‌ఆఫ్రికాలోని కేప్‌టౌన్ నీళ్లు లేని తొలి ప్రపంచ నగరంగా, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నదన్నారు. మన దగ్గర అలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవకుండా ఉండాలంటే, నగరంలో కురిసే ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని దానకిశోర్ గుర్తుచేశారు. నగరంలోని 8 వేలకు పైగా ఇంకుడుగుంతలను రికార్డు సమయంలో ఒకే ఒక్కరోజే పునరుద్ధరించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాలనీవాసులు, సంఘాల ప్రతినిధులు పునర్మాణానికి ముందుకురావడంపై ఆయన అభినందించారు.

నీటిని వృథా కానివ్వం...
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వాటర్ హార్వెస్టింగ్ డే సందర్భంగా శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీస్ కమిషనర్ సజ్జనార్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులతో కలిసి ఇంకుడు గుంతల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని పునరుద్ధరణ చేసుకోవాలన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పీఎస్‌లో ఇంకుడు గుంతలు ఏర్పాటు, పునరుద్ధరణ కార్యక్రమాలను విసృ్తతంగా నిర్వహించాలని సీపీ కోరారు. ఈ సందర్భంగా నీటిని వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణిప్రియదర్శిని, షీ టీమ్స్ డీసీపీ అనసూయ, అదనపు డీసీపీ షీ టీమ్స్ ఇందిర, కార్ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ మాణిక్‌రాజ్ , ఏసీపీలు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రతి కాలనీకి రెండు ఇంకుడుగుంతలు..
నగరంలోని ప్రతి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనీసం రెండు ఇంకుడు గుంతలను నిర్మించాలని ఈ సందర్భంగా దానకిశోర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించినట్లు తెలిపారు. అన్ని కమ్యూనిటీ హాళ్లు, కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో కనీసం రెండు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. జల సంరక్షణ అనేది ప్రజలందరి బాధ్యతని, కాలనీలు, ఇండ్లల్లో ఉన్న ఇంకుడు గుంతలను ఒకసారి పరిశీలించి, వాటిలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడం ద్వారా వర్షపు నీరు ఇంకే విధంగా సిద్ధం చేయాలని దానకిశోర్ సూచించారు. నగరంలోని అన్ని ఇంకుడు గుంతలను జియో టాగింగ్ చేయనునన్నట్లు ప్రకటించారు. ఇంకుడుగుంతల మరమ్మతుల కార్యక్రమం కొనసాగుంతన్నారు. జలమండలి ఈడీ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు ఆజ్మీరా కృష్ణ, పి. రవి, ప్రాజెక్ట్ -2 డైరెక్టర్ డి. శ్రీధర్‌బాబు, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

-మల్కాజిగిరి సర్కిల్‌లోని గౌతంనగర్‌లో దానకిశోర్‌తో పాటు, మిస్ ఆసియా పసిఫిక్ సుధాజైన్, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ మమతా త్రివేది, జాతీయ కథక్ నృత్య కళాకారిణి శిల్పా చక్రవర్తి, మల్కాజిగిరి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, జోనల్ కమిషనర్ రఘుపసాద్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-కాప్రా సర్కిల్ లోని శ్రీనివాస్‌నగర్ లో నిర్వహించిన వాటర్ హార్వెస్టింగ్ డేలో కమిషనర్‌తో పాటు, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ తదితరులు హాజరయ్యారు.
- డాక్టర్ మేల్కొటే పార్క్‌లో దానకిశోర్‌తో పాటు, డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య, మెడికల్ ఆఫీసర్ హేమలతలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

442

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles