ఎన్‌ఓసీలపై స్పష్టతనివ్వండి..

Sun,May 26, 2019 12:24 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇండ్లు కట్టుకోవడానికి రెవెన్యూశాఖ జారీచేసే నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) జారీ ప్రక్రియ జిల్లాలో నిలిచిపోయింది. ఇండ్ల నిర్మాణానికి రెవెన్యూ అనుతమతులు అవసరం లేదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఎన్‌వోసీల జారీకి బ్రేక్‌పడింది. దీంతో జిల్లాలో దరఖాస్తులున్ని పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు స్పష్టతనివ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి లేఖరాశారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్‌వోసీల భవితత్వం తేలనున్నది. పూర్తి వివరాల్లోకి వెలితే.. ఇంటి నిర్మాణం కోసం అనుమతులిచ్చేటప్పుడు సంబంధిత డిపార్ట్‌మెంట్‌ను నిరభ్యంతర ధ్రువపత్రం తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ భూములతో పాటు.. దేవాదాయ.. డిఫెన్స్.. బొనావెకెన్షియా.. సీలింగ్.. ఎవాక్యూ.. వక్ఫ్.. సహా పలు రకాలకు చెంది స్థలాలున్నాయి. వీటిలో అక్రమ నిర్మాణాలు వెలువకుండా..

ఉండేందుకు ఎన్‌ఓసీలను తప్పనిసరి చేశారు. ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్న స్థలం రికార్డుల ప్రకారం ప్రతిపాదిత భూమి ప్రభుత్వానికి చెందినదా.. లేక.. ప్రైవేట్ స్థలమా అన్నది తేలుతుంది. వాస్తవికంగా ప్రైవేట్‌కు చెందిన వాటిలో మాత్రమే నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులిస్తారు. ప్రతిపాదిత స్థలం నిషేదిత జాబితాలో ఉన్నా.. ప్రభుత్వ స్థలమైతే ఎన్‌వోసీని తిరస్కరిస్తారు. అయితే కొంత మంది ఇండ్లు కట్టుకోవడానికి రెవెన్యూశాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కొంత మంది హైకోర్టుకెళ్లారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. నెలరోజుల క్రితం ఇంటి అనుమతులు ఇచ్చేది జీహెచ్‌ఎంసీ కనుక, రెవెన్యూ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. దీంతో అప్పటి నుంచి ఎన్‌వోసీల జారీ నిలిచిపోయింది.

నిరీక్షణ తప్పదా..
జిల్లాలో ఎన్‌ఓసీల జారీ ప్రక్రియ పలు కారణాలతో నిలిచిపోయింది. గత కొంత కాలంగా ఎన్‌వోసీలు జారీకావడం లేదు. వాస్తవికంగా ఎన్‌వోసీ కమిటీ నెలలో రెండుసార్లు సమావేశం కావాలి. కానీ గత కొంత కాలంగా జిల్లాలో ఎన్‌ఓసీల జారీ నిలిచిపోయింది. కొంత మంది అక్రమార్కులు బోగస్ ఎన్‌వోసీలను సృష్టించడం అప్పట్లో జిల్లాలో కలకలం రేపింది. ఏకంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ల సంతకాలను ఫోర్జరీ చేసి బోగస్ ఎన్‌ఓసీలు జారీ కావడం గమనార్హం. అక్రమాల నేపథ్యంలోనూ అప్పట్లో ఎన్‌ఓసీ జారీని కొంత కాలం నిలిపివేశారు. తాజాగా ఎన్‌వోసీల జారీకి బ్రేకులు పడటంతో దరఖాస్తు దారులకు నిరీక్షణ తప్పేలా లేదు.

250

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles