యువ చేతనతో సామాజిక చైతన్యం

Sun,May 26, 2019 12:25 AM

-నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం
-సామాజిక సేవే లక్ష్యంగా యూత్‌క్లబ్‌ల ఏర్పాటుకు చర్యలు
-జూన్ 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచన
మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నేటి ఆధునిక యువతలో సామాజిక చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతోపాటు సేవా కార్యక్రమాలు కూడా జీవితంలో భాగమని యువతకు దిశానిర్దేశం చేసేందుకు గాను తాజాగా యువ చేతన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15-35 సంవత్సరాల్లోపు ఉన్న యువజనులతో(అమ్మాయిలు, అబ్బాయిలు) యువజన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కరు ఆర్గనైజర్‌గా, మరొక్కరు డిప్యూటీ ఆర్గనైజర్లుగా ఉండేలా క్లబ్‌లను ఏర్పాటు చేయాలని జిల్లాల వారీగా కలెక్టర్లకు, యువజన సంక్షేమ శాఖ అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కార్యక్రమాన్ని గతంలోనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ పలు సాంకేతిక కారణాల వలన అమలు చేయలేదు. ఇందులో మహిళల సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల వలనే ఒక్కో యూత్‌క్లబ్‌లో సుమారు 10-15 మంది యువజనులు ఉండేలా మండల సమితి స్థాయిలో యువజన క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ యువచేతన కార్యక్రమంలో కలెక్టర్ నోడల్ అధికారిగా, అడిషనల్ జాయింట్ కలెక్టర్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా, జిల్లా యువజన సర్వీసుల, సంక్షేమశాఖ అధికారి సమన్వయకర్తగా ఉంటారు. నూతనంగా ఏర్పాటైన యూత్ క్లబ్‌లకు ప్రభుత్వం చేయూతనివ్వడంతోపాటు, క్రీడాసామగ్రిని ఉచితంగా బహూకరిస్తుందని, మున్ముందు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు రుణసాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

యూత్‌క్లబ్ కార్యక్రమాలు...
10-15 మంది సభ్యులుగా ఏర్పాటైన యూత్‌క్లబ్‌లోని యువత ముఖ్యంగా వారు నివసిస్తున్న ప్రాంతంలో ఖాళీ సమయాల్లో నూతనంగా మొక్కలు నాటడం, చెట్లను పెంచేలా కాలనీ, బస్తీ ప్రజలను ప్రోత్సహించడం చేయాలి. స్కూల్‌కు వెళ్లని చిన్నారులను వారి తల్లిదండ్రులతో చర్చించి వెంటనే స్కూల్‌లో చేర్పించాలి. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ మేడ్చల్‌లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలి. జాతీయ పండుగ(ఆగస్టు 15, జనవరి 26)లను నిర్వహించి జాతీయ సమైఖ్యతలో పాలుపంచుకోవాలి. క్రీడల నిర్వహణ, సేవా కార్యక్రమాలు చేయాలి. అవయవదానాల వలన కలిగే ప్రయోజనాలను కాలనీ ప్రజలకు వివరించాలి. క్రమం తప్పకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించడం చేయాలి.

కవిత్వ కళాతత్తం గ్రంథావిష్కరణ
ఉస్మానియా యూనివర్సిటీ : ప్రముఖ సుప్రసిద్ధ సాహిత్య కళాతత్త విమర్శకులు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య రచించిన కవిత్వ కళాతత్తం గ్రంథాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ఆవిష్కరించారు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్, మూసీ సాహిత్యధార సంయుక్త ఆధ్వర్యంలో ఓయూ గెస్ట్‌హౌజ్‌లో నిర్వహించిన ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ ఇంగ్లిష్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ అన్నంరాజు సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రంథాన్ని సాహిత్య విద్యార్థులు, అధ్యాపకులు, రచయితలు, పరిశోధకులు తప్పనిసరిగా చదవాలని సూచించారు.

ఈ గ్రంథాన్ని సాహిత్య శాస్ర్తానికి సంబంధించిన మౌలికమైన కవిత్వ స్వ రూపం, రసం, ధ్వని అనే అంశాలను ప్రధానంగా చేసుకుని రచించారన్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర రాసిన సాహిత్యం తరువాత 50 ఏండ్లకు గాను ముదిగొండ వీరభద్రయ్య ప్రశ్న-సమాధానం పద్ధతిలో సంవాద రూపకంగా రాసిన ప్రముఖ గ్రంథమని కొనియాడారు. కవిత్వం విలువలను ఈ గ్రంథం సవివరంగా పేర్కొందని చెప్పారు. గ్రంథ స్వీకర్త తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్, విశ్వనాథ సాహిత్యపీఠం అధ్యక్షుడు డాక్టర్ వెల్చాల కొండలరావు మాట్లాడుతూ విలువలు నశించిన ఈ కాలంలో 50 ఏండ్ల తరువాత విశ్వవిద్యాలయాలకు ఉపయోగపడే శాస్త్ర కావ్యాన్ని అందించడం గర్వకారణమన్నారు. ప్రతీ యూనివర్సిటీలో పాఠ్యభాగంగా ఈ గ్రంథాన్ని ఉంచాలని కోరారు. రచయిత ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య మాట్లాడుతూ ప్రపంచ సాహిత్యంలోనే భారతీయ అలంకార శాస్ర్తానికి గొప్ప పేరుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ సాహిత్య పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రముఖ కవి, సాహిత్య విమర్శకులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.యాదగిరి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ బూదాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

301

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles