చికిత్స పొందుతూ గర్భిణి మృతి

Mon,May 27, 2019 02:58 AM

బేగంబజార్ : ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి చివరికి ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ దవాఖానలో చేరడంతో మృత్యవాత పడుతున్నారు. ఇదిలా ఉండగా, బేగంపేటకు చెందిన సుమలత (26), రాజులు భార్యభర్తలు. కాగా వీరికి మొదటి సంతానం కుమారుడు పుట్టగా, రెండో సంతానం నిమిత్తం ఓ ప్రైవేటు దవాఖానలో 8 నెలలపాటు వైద్యం పొందిన సుమలత శనివారం ఉదయం బీపీ పెరిగిపోవడంతో కోఠి ప్రసూతి దవాఖానలో చేరారు. సాధారణంగా గర్భిణులు పౌష్టికాహారం, మందులు సరైన సమయంలో వాడాల్సి ఉండగా, ఆ తరహాలోనే సుమలతకు బీపీ అత్యధికంగా పెరిగిపోయి మరణించిందని వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. కాగా సుమలత శనివారం రాత్రి 9 గంటలకు పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ సమయంలో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ ప్రసవించిన అనంతరం సుమలత ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది.దీంతో వైద్యులు తెల్లవారు జామున 3 గంటల వరకు ఆక్సిజన్ అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సుమలత మరణించింది.

సుమలత మృతిపై ముగ్గురికి మెమోలు జారీ
దవాఖానలో సీరియస్‌గా ఉన్న రోగుల వివరాలను దవాఖాన సూపరింటెండెంట్‌కు తెలియజేయాలి. కానీ దీనికి భిన్నంగా గర్భిణి సుమలత విషయం సూపరింటెండెంట్‌కు తెలియజేయకుండా అసోసియేట్ ప్రొఫెసర్ యూనిట్ హెడ్ డీఎంవో, గర్భిణి విషమంగా ఉన్న విషయాన్ని తెలియజేయకుండా గర్భిణి మృతికి కారణమైనందున ముగ్గురికి మెమోలు జారీ చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తెలిపారు. గత నెలలో 14 మంది గర్భిణులు బీపీకి గురి కావడంతో ఉస్మానియా దవాఖానకు పంపించి అక్కడ వెంటిలేటర్ సహాయంతో సాధారణ స్థితికి తీసుకురాగలిగామని దవాఖాన సూపరింటెండెంట్ పేర్కొన్నారు. గర్భిణులకు బీపీ అధికమైతే ప్రసవించిన అనంతరం మెదడులో నీరు చేరడంతో గుండెకు ఆ నీరు తాకీ మరణించే ప్రమాదం ఉందన్నారు.

245

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles