నాసిరకం ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై అధికారుల దాడి

Mon,May 27, 2019 02:58 AM

హయత్‌నగర్, మే 26 : నాసిరకం ఆహారపదార్థాల తయారీ కేంద్రంపై కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డితో కలిసి జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదివారం దాడి చేశారు. హయత్‌నగర్ డివిజన్ పరిధి ఇన్ఫర్మేషన్ కాలనీలోని హెచ్‌పీ గోడౌన్ వెనుకాల కర్నాటి నాగయ్య అనే వ్యక్తి కేహెచ్‌ఎల్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో గత 6 నెలలుగా తిను బండారాలు తయారు చేసే కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇందులో గ్రీన్ బఠానీలు, చెకోడీలు, మిక్చర్, బూంది మరికొన్ని పదార్థాలు తయారు చేస్తున్నాడు. తిను బండారాల తయారీ సందర్భంగా పెద్ద ఎత్తున పొగ, భరించలేని దుర్వాసన వస్తుందని కాలనీవాసులు కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించి ఏఎంహెచ్‌ఓ మంజులవాణి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్న ఏఎంహెచ్‌ఓ మంజులవాణి కార్పొరేటర్‌తో కలిసి తిను బండారాల తయారీ విధానాన్ని పరిశీలించారు. నిర్వాహకులు నాసిరకం వస్తువులను ఉపయోగించి ఎలాంటి నాణ్యతాప్రమాణాలు పాటించకుండా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు ఆమె గుర్తించారు. పరిశ్రమ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు ఎక్కడకూడా స్వచ్ఛత లేకుండా నిర్వహిస్తున్నందున ఏఎంహెచ్‌ఓ నిర్వాహకుడిపై మండిపడ్డారు.

వెంటనే కేహెచ్‌ఎల్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో నిర్వహిస్తున్న నాసిరకం ఆహార తయారీ కేంద్రం అనుమతులను రద్దు చేసి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కాగా నాసిరకం పదార్థాలు ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్తీ ఆహార తయారీ కేంద్రాలపై కఠన చర్యలు తీసుకొని ఉక్కుపాదం మోపాలని కార్పొటర్ అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేస్తూ ధనార్జనే పరమావదిగా వ్యవహరిస్తున్న కల్తీ ఆహార పదార్థాల తయారీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రాహుల్, కాలవాసులు రాజశేఖర్, వెంకటేశ్వర రావు, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.

373

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles