విద్యుత్ శాఖలో.. ఇంటి దొంగలు

Mon,May 27, 2019 02:59 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యుత్ స్టోర్స్(విద్యుత్ పరికరాల నిల్వ, పంపిణీ కేంద్రం)లో ఇటీవల చోరీకి ప్రయత్నం వ్యవహారం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు అందుకు బాధ్యులుగా భావిస్తున్న ఏఏఈ యాదయ్యను సస్పెన్షన్ చేశారు. అనంతరం స్టోర్స్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు విజిలెన్స్ అధికారులను టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు మొత్తం వ్యవహారంపై రెండు రోజులుగా విచారణ చేస్తుండగా.. ఈ సమగ్ర విచారణ పూర్తయ్యేందుకు మరో రెండుమూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. కానీ దీని వెనుక పెద్ద తలకాయల సంగతేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏండ్ల తరబడిగా జరుగుతున్న ఈ వ్యవహారంలో కేవలం ఏఏఈని సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇదిలావుంటే.. అసలు విద్యుత్ స్టోర్స్‌లో ఏండ్ల తరబడిగా విద్యుత్ అధికారుల అండదండలతోనే అక్రమంగా విద్యుత్ పరికరాలను చోరీ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవంగా ఇటీవల చోరీ వ్యవహారాన్ని స్టోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు చోరీ వ్యవహారం బయటికి తెలిసేలా సమాచారం అందించాడనే నెపంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న వారు బెదిరింపులకు గురి చేయడంతో సదరు ఉద్యోగి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. దీనిపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు. అయితే స్టోర్స్ వ్యహారంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల అధికారుల ప్రోద్భలం అండదండలతోనే ఏండ్ల తరబడిగా పరికరాలను చోరీ చేసి.. దర్జాగా తిరుగుతున్నట్టు కొంతమంది యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.

వచ్చిన లోడు దించకుండానే..
విద్యుత్ స్టోర్స్‌కు సామగ్రిని సరఫరా చేసే కంపెనీలు సైతం స్టోర్స్ అధికారుల తీరుతో విసిగివేసారి పోయారనే చెప్పాలి. ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే.. వారి సామగ్రినే విద్యుత్ స్టోర్స్ కొనుగోలు చేయడం, సరఫరా చేయాల్సిన సామగ్రి కంటే తక్కువ చేసి బిల్లుల్లో మాత్రం అన్ని సక్రమంగానే సరఫరా చేసినట్టు కొంతమంది కంపెనీలు చూపినా.. అమ్యామ్యాలు పుచ్చుకుని చూసీచూడకుండా ఉంటున్నట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారం నెలనెలా రూ.లక్షల్లో ఉంటుందని స్టోర్స్‌లో పనిచేసి వేరే చోటుకు బదిలీ అయిన ఉద్యోగి ఒకరు నమస్తే తెలంగాణకు చెప్పడం గమనార్హం. ఇక్కడ జరిగే అక్రమ వ్యహారంలో ఉన్నతాధికారి దగ్గరి నుంచి సిబ్బంది వరకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. దీంతోపాటు స్టోర్స్ నిర్వహణ, స్టోర్స్‌లోని కీలకమైన పోస్టులు కావాలంటే.. రూ.లక్షల్లో డబ్బులు ఇచ్చుకోవాలని, లేకపోతే వేరేచోటుకి బదిలీ చేస్తుంటారని చెప్పారు.

జాగ్రత్తగా ఉండాలి.. ఓ ఉన్నతాధికారి..
విద్యుత్ స్టోర్స్ చోరీ వ్యవహారంపై ఓ ఉన్నతాధికారి తీరు అనుమానాస్పదం కావడం చర్చనీయాంశం అవుతున్నది. చోరీ జరిగిందనే విషయాన్ని సదరు ఉన్నతాధికారి సంబంధిత స్టోర్స్ నిర్వహణకు సంబంధించిన అధికారి ఒకరు చెప్పారు. దీంతో ఆ ఉన్నతాధికారి అలాంటి చోరీ పనులు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు ఓర్వలేని వ్యక్తులు బయటకు సమాచారం తెలిసేలా చేస్తారు. అంత జాగ్రత్తగా లేకపోతే అక్రమ పనులు చేయోద్దు అంటూ ఉచిత సలహానిచ్చారు. దీంతో అవాక్కు కావడం ఫిర్యాదు చేసిన వ్యక్తి వంతయ్యింది. ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు వ్యక్తి అండదండలతోనే జరుగుతున్నాయనే ఆరోపణలు జోరుగా విన్పిస్తున్నాయి.

415

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles