పైప్‌లైన్లతో.. రసాయన వ్యర్థాలకు చెక్

Mon,May 27, 2019 03:02 AM

-వ్యర్థజలాలు నేరుగా సీఈటీపీలకు తరలింపు
-ఆదర్శంగా నిలుస్తున్న అహ్మదాబాద్

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పైప్‌లైన్లు ఏర్పాటు చేసి రసాయన వ్యర్థాలతో జలకాలుష్యానికి చెక్ పెట్టడంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆదర్శంగా నిలుస్తున్నది. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థజలాలను నేరుగా కామన్ ఇఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ( సీఈటీపీ)లకు తరలించడంలో విజయవంతమయింది. సీఈటీపీకి పైపులైన్ ఉంటేనే కంపెనీలకు అనుమతులిచ్చేలా గుజరాత్ పీసీబీ కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నది. మన పీసీబీ అధికారులూ ఇలాంటి ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వ్యర ్థజలాల పారబోతలకు పైపులైన్లతో చెక్‌పెట్టి గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆదర్శంగా నిలుస్తున్నది. పరిశ్రమల నుంచి పైపులైన్ల ద్వారా వ్యర్థజలాలను తరలించి, పారబోతలకు, అక్రమ డంపింగ్‌లకు అడ్డుకట్టవేసింది. పరిశ్రమల నుంచి వెలువడిన రసాయన వ్యర్థజలాలను నేరుగా కామన్ ఇఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ( సీఈటీపీ)లకు తరలించడంలో విజయవంతమయ్యింది. ఆ విశేషాలిలా ఉన్నాయి.

అండర్‌గ్రౌండ్ పైపులైన్లు.

అహ్మదాబాద్, గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లోని టైక్స్‌టైల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థజలాలను రవాణాకు కొత్తమార్గాన్ని అనుసరించారు. పరిశ్రమ నుంచి నేరుగా అండర్‌గ్రౌండ్ పైపులైన్ వేసి, వ్యర్థజలాలను కామన్ ఇఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు పంపించేందుకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలుచేస్తున్నారు. దీంట్లో భాగంగా కామన్ ట్రీటెడ్ ఇఫ్లూయంట్ డిస్పోజల్ పైపులైన్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. ఈ ప్రాజెక్టులకు గుజరాత్ పీసీబీ వేగంగా అనుమతిచ్చింది. పరిశ్రమల నుంచి సీఈటీపీకి పైపులైన్ ఉంటేనే పరిశ్రమలకు అనుమతులిచ్చేలా గుజరాత్ పీసీబీలో కఠినంగా నిబంధనలను అమలుచేస్తున్నారు.

ఎలా చేస్తారంటే..

-పరిశ్రమ నుంచి నేరుగా కామన్ ఇఫ్లూయంట్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌కు (సీఈటీపీ) చేర్చేందుకు వీలుగా పైపులైన్లను వేశారు. ఇలా కంపెనీలన్నీ పైపులైన్లను ఏర్పాటు చేసుకున్నాయి.
-ఉత్పత్తి సమయంలో పరిశ్రమలో వెలువడ్డ హై - టీడీఎస్, లో - టీడీఎస్ రసాయన వ్యర్థజలాలను వేర్వేరుగా కంపెనీల్లోని ట్యాంకుల్లోకి చేర్చుతారు.
-ట్యాంకుల్లో ఎంత మేరకు వ్యర్థజలాలు చేరాయో, ఆటోమెటిక్‌గా లింక్‌చేసిన వెబ్‌సైట్‌లో నమోదవుతుంది.
-పరిశ్రమలకు కేటాయించిన టైమ్‌స్లాట్ ప్రకారం వ్యర్థజలాలను సీఈటీపీకి పంపిస్తారు.
-వ్యర్థజలాలు సీఈటీపీకి చేరిన తర్వాత ఎన్ని లీటర్లు చేరాయో, మళ్లీ వెబ్‌సైట్‌లో నమోదువుతుంది.
-ట్యాంకులో చేరిన వ్యర్థజలాలు, సీఈటీపీకి చేరిన వ్యర్థజలాల్లో తేడాలుంటే పీసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఎందుకిలా జరిగిందో విచారణ చేసి, ఉల్లంఘనలకు పాల్పడ్డ కంపెనీలపై చర్యలకు ఉపక్రమిస్తారు.

పారబోతలుండవు..

మన దగ్గర వ్యర్థజలాల పారబోత అన్నది సర్వసాధారణమైన అంశం. కానీ గుజరాత్‌లో ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించిన కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు క్రమంగా పారబోతలకు అడ్డుట్టవేశారు. సీసీ కెమెరాల నిఘా, ట్యాంకర్లకు జీపీఎస్‌ను అమర్చడం ద్వారా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. క్రమంగా ట్యాంకర్లకు స్వస్తిచెప్పి అండర్‌గ్రౌండ్ పైపులైను విదానానికి మార్చారు. పైపులైన్ల ద్వారా పారబోతలు మొత్తంగా అడ్డుకట్టవేయబడ్డాయి.

ట్యాంకర్లే కనపడవు..

మన దగ్గర పరిశ్రమల నుంచి వెలువడ్డ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా కామన్ ఇఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలిస్తాం. కానీ గుజరాత్‌లోని పరిశ్రమల్లో వెలువడే..వ్యర్థజలాలను తరలించే ట్యాంకర్లు ఒక్కటి కూడా అక్కడ కనపడవు. అక్కడ ట్యాంకర్ల ద్వారా రసాయన వ్యర్థజలాను రవాణాను పూర్తిగా అదుపుచేశారు. గుజరాత్‌లో టెక్స్‌టైల్ పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి. వీటి నుంచి రసాయన వ్యర్థజలాలు అధికంగా వెలువడుతుండటం, పారబోతలకు అస్కారముండటంతో ట్యాంకర్ల వ్యవస్థను పూర్తిగా రద్దుచేశారు.

మన దగ్గర పరిస్థితి ఇలా..

గ్రేటర్ సహా శివారు ప్రాంతాల్లో రసాయన వ్యర్థజలాల డంపింగ్ నగరంలో యథేచ్ఛగా సాగతున్నది. వీలయితే నాలాలు.. లేదంటే బావులు బోర్‌బావులు.. ఇలా కాదేది డంపింగ్‌కు అనర్హం అన్నట్లుగా సాగుతున్నది. ఇది వరకు వానవచ్చినప్పుడో.. వరద పొంగినప్పుడో సాగే రసాయన వ్యర్థజలాల డంపింగ్ ఇప్పుడు పైపులైన్లు పెట్టి మరీ నాలాల్లోకి వదిలేసే వరకు వచ్చింది. కుదిరితే కుమ్మరింతలు, లేదంటే డంపింగ్ మాఫియా చేతుల్లోపెట్టేవారిప్పుడు అడ్డదారులు తొక్కుతున్నారు. వీలుచిక్కకుంటే బోర్లు, బావుల్లో డంపింగ్‌చేసి చేతులు దులుపుకున్న పరిశ్రమలు బరితెగించి ఏకంగా పైపులైన్లు పెట్టి మరీ ఓపెన్‌నాలాల్లోకి వదులుతున్నాయి. నగరంలో వెలువడిన వ్యర్థాలు నగర శివారులకు తరలిస్తుంటే, రసాయన వ్యర్థజలాలు మాత్రం నగరశివారు నుంచి నగరంలోపలికి ప్రవేశిస్తున్నాయి.

నగరం నడిబొడ్డున పారుతున్న మూసినది అక్రమ రసాయన వ్యర్థజలాల డంపింగ్‌కు అడ్డాగా మారింది. చౌటుప్పల్ నుంచి ఉప్పల్ వరకు అక్రమ రవాణా కొనసాగుతున్నట్లుగా పీసీబీ అధికారుల పర్యవేక్షణలో తేలింది. ముఖ్యంగా నాగోల్ - ఉప్పల్ నుంచి పిల్లాయిపల్లి వరకు గల మూసి నదిలో అక్రమ పారబోతలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జీడిమెట్ల, పటాన్‌చెరు, మల్లాపూర్, బాలానగర్‌లో సీఈటీపీలు ఉన్నా.. వెలువడుతున్న వ్యర్థజలాలను శుద్ధి చేయడానికి వాటి సామర్థ్యం సరిపోవడం లేదు. పారిశ్రామిక వాడలకు ఆనుకునే ఓపెన్‌నాలాలు, కుంటలు, చెరువులు ఉండటంతో అక్రమ డంపింగ్‌కు అస్కారమేర్పడుతున్నది. మన పీసీబీ అధికారులు సైతం ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

858

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles