స్కూల్ బస్సులతో జర భద్రం

Wed,June 12, 2019 03:24 AM

-స్పీడ్ గవర్నెన్స్‌తో సామర్థ్య పరీక్షలకు బ్రేక్!!
-బడులు తెరుస్తున్నా ఇంకా ఫిట్‌నెస్‌కు రాని 3500 బస్సులు
-నేటి నుండి రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రవాణాశాఖ చేసిన జాప్యం కారణంగా విద్యా సంస్థల బస్సులు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ కాలేక పోయాయి. విద్యా సంస్థలు 12న ప్రారంభమవుతాయని ముందుగా రవాణాశాఖ ఉన్నతాధికారులకు సమాచారమున్నప్పటికీ స్పీడ్ గవర్నెన్స్‌కు సంబంధించి ఆదేశాలు ఇవ్వడంలో జరిగిన ఆలస్యం సుమారు 3,500 బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నాయి. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం చేయాలని ప్రభుత్వ ఆదేశాలుండగా స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ బిగించాలని జూన్ 7న సాయంత్రం రవాణాశాఖ ఆదేశాలిచ్చింది. 8న రెండవ శనివారం, 9న ఆదివారం సెలవు దినాలు కావడంతో మిగిలిఉన్న ఒక్క రోజులో స్పీడ్ గవర్నెన్స్ పరికరం బిగించుకోలేకపోయాయి. కొన్ని బస్సులకు పరికరాలు బిగించుకున్నా శని, ఆదివారాలు ఫిట్‌నెస్ టెస్టులకు రాలేకపోయాయి. ఇలా రవాణాశాఖ ఉన్నతాధికారులు చేసిన పొరపాటు బడి బస్సులకు అందులో ప్రయాణించే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన ఉన్నతాధికారులు స్పీడ్ గవర్నెన్స్ పరికరం బిగించుకునే సమయాన్ని మరో 10 రోజులు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

గ్రేటర్‌లో ఫిట్‌నెస్‌లేని బస్సులు 3,500
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 13,082 బస్సులుండగా 9 వేలకు పైగా బస్సులు ఫిట్‌నెస్ కాగా మిగతా 3500 బస్సుల ఫిట్‌నెస్ పెండింగ్‌లో ఉంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 2321 బస్సులుండగా అందులో ఇప్పటివరకు 1200 బస్సుల వరకు ఫిట్‌నెస్ చేయించలేదు. అలాగే రంగారెడ్డి పరిధిలో మొత్తం 5,000 స్కూల్ బస్సులుండగా వాటిలో 3900కి పైగా బస్సులు ఫిట్‌నెస్ పూర్తికాగా మిగతావి ఫిట్‌నెస్ లేకుండా ఉన్నాయి. ఇందులో స్పీడ్ గవర్నెన్స్ వల్ల ఫిట్‌నెస్ కాని బస్సులే అధికంగా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే 4800 బస్సులుండగా ఇందులో కూడా 3700 బస్సుల వరకు ఫిట్‌నెస్ పూర్తయినట్లు తెలిసింది. గత మే 15న బస్సులకు ఫిట్‌నెస్ గడువు ముగిసినప్పటికీ దాదాపు నెల రోజులు కావస్తున్నా పూర్తిస్థాయిలో బస్సులు ఫిట్‌నెస్ కాలేదు. నిబంధనల ప్రకారం ప్రతి ఏడాదికి ఓ సారి స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ చేయించుకోవాలి. అలాగే ట్యాక్స్ చెల్లింపులు పక్కాగా ఉండాలి. ఫిట్‌నెస్ విషయంలో నగరంలోని స్కూల్ బస్సుల యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థుల వద్ద ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్ చేయించుకోవడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పేరుపొందిన పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న కొంతమంది రవాణాశాఖ అధికారుల వల్ల కూడా చాలా పాఠశాలలు తమ బస్సులను ఫిట్‌నెస్ చేపించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అంతేగాకుండా ఒకే నంబరుపై రెండు బస్సులను వేర్వేరు రూట్లలో తిప్పవచ్చనే ఆలోచనతో ఉన్న కొంతమంది యాజమాన్యాలు ఉన్నట్లు తెలుస్తుంది.

నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
విద్యా సంస్థలు బుధవారం నుంచి ప్రారంభం కానుండటంతో ఫిట్‌నెస్‌లేని బస్సులపై రవాణాశాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలను ఏర్పాటు చేసి నిఘా పెడుతున్నారు. అయితే ఎంవీఐల కొరత కూడా కొట్టొచ్చినట్లు కనబడుతుంది. హైదరాబాద్ విషయానికి వస్తే ఒకే ఒక్క రెగ్యులర్ ఎంవీఐ ఉండటం, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అరకొరగా ఉండటంతో ఏఎంవీఐలు, కానిస్టేబుల్స్, హోంగార్డులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది


అందరి సహకారంతో.. సాఫీగా ట్రాఫిక్ : బాబురావు, ట్రాఫిక్ డీసీపీ
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల భద్రత చాలా ముఖ్యమైంది. వాహనాలలో పంపించే సమయంలో తల్లిదండ్రులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాతే పిల్లలను ఆయా వాహనాలలో పంపించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్‌లోడ్, వాహనాల పిట్‌నెస్ అంశాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.

రూల్స్ పాటించాల్సిందే : దివ్యచరణ్‌రావు, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ
పాఠశాలల బాలబాలికల సురక్షిత ప్రయాణానికి తల్లిదండ్రులు పాత్ర కీలకంగా ఉంటుంది. తమ పిల్లలను స్కూల్‌కు పంపించే ఆటోలు, స్కూల్ బస్సుల నిర్వహణ తీరును వారు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఆరుగురికి మించి ఉంటే ఆ ఆటోలో పంపించకూడదు. స్కూల్ బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళితే వాటిపై పోలీసులకు, ఆర్‌టీఏ అధికారులకు, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. బస్సు నిర్వహణకు రూపొందించిన నిబంధనలను స్కూల్ యాజమాన్యాలు పాటించాలి. తమ వంతుగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి స్కూల్ బస్సు నిర్వహణను తనిఖీ చేస్తాం. తనిఖీల్లో లోపాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

321

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles