ఆహ్లాదం..వినోదం

Sun,August 25, 2019 03:38 AM

-నగరంలో 47 కొత్త పార్కులు
-120 కోట్ల వ్యయంతో ప్రణాళిక
నగరంలో పార్కులనగానే ఇందిరాపార్కు, కృష్ణకాంత్ పార్కు, చాచా నెహ్రూ పార్కు, వెంగళరావు పార్కు తదితర పార్కులు మినహా చెప్పుకోదగ్గ మేజర్‌పార్కులు లేవు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్కులను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సూచనల మేరకు జీహెచ్‌ఎంసీ తమ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఒక ఎకరానికన్నా ఎక్కువ వైశాల్యం గల 47స్థలాలను గుర్తించింది. వాటిని సుందరమైన, ఆహ్లాదకరమైన పార్కులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ. 120 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇవి ఏవో కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అన్ని జోన్లలోనూ ఉండే విధంగా ప్రణాళిక సిద్ధంచేశారు. ఇందులో ముఖ్యంగా స్వచ్ఛత థీమ్ పార్కులను జోన్‌కు రెండు చొప్పున12 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇందులో ప్రధానంగా తడి, పొడి చెత్తను వేరుచేయడం, సేంద్రీయ ఎరువు తయారి, ఇంకుడు గుంతల నిర్మాణం, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నిర్వహణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్, డంప్‌యార్డుల క్యాపింగ్ పనులు, సాఫ్ హైదరాబాద్-షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమాలు తదితరవాటిని తెలుసుకునే విధంగా తగిన నమూనాలతో పార్కులను రూపొందిస్తున్నారు. ఇవి కాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్, వర్షపునీటి సంరక్షణ, పిల్లలు, తెలంగాణ సంస్కృతి, యూనివర్సల్, సైన్స్, వర్షం అడవి, అడ్వేంచర్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, తదితర థీమ్‌లను ఎంపిక చేశారు. ఇటీవలే మేయర్ రామ్మోహన్ థీమ్‌ల రూపకల్పనపై కన్సల్టెంట్లకు దిశనిర్దేశం చేశారు.

పిల్లలకు అందుబాటులో పార్కులు
నగరంలో పిల్లలకంటూ ప్రత్యేకమైన పార్కు లేదనే లోటు ఎంతోకాలంగా ఉంది. ఈ లోటును కూడా పూడ్చేందుకు కొత్తగా అభివృద్ధిచేస్తున్న పార్కుల్లో పిల్లల థీమ్‌కు కూడా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించారు. అలాగే, ఆయా పార్కులను స్కూలు పిల్లలకు అందుబాటులో పెట్టాలని, పిల్లలు సందర్శించేలా తగిన చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు. అంతేకాదు, వర్షపునీరు నిల్వచేసుకునేందుకు పార్కుచుట్టూ కందంకం తవ్వడంతోపాటు నీరు ఇంకేందుకు పార్కులో భారీ ట్యాంక్ కూడా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే, ఎస్‌టీపీల ద్వారా శుద్ధిచేసిన జలాలను ఈ పార్కులకు ఉపయోగించాలని కూడా భావిస్తున్నారు. సమీపంలోని ఎస్‌టీపీ నుంచి విడుదలయ్యే నీటిని వీటికి మలపాలని నిర్ణయించారు. ప్రతి పార్కులో నగర స్వచ్ఛత, చరిత్ర, సంస్కృతి-సాంప్రదాయాలను తెలిపే ఆడియో విజువల్ చిత్రాలను కూడా ప్రదర్శించాలని నిశ్చయించారు. అలాగే, మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్తత్పిచేసే వస్తువులను పార్కుల్లో విక్రయించుకునే వీలు కల్పించాలని కూడా నిర్ణయించారు.

199

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles