నగరంలో సమీకృత ప్రజా రవాణా

Mon,August 26, 2019 02:55 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నగర రవాణా విభాగాలు సంయుక్తంగా ముందడుగు వేశాయి. సమీకృత రవాణా దిశగా అడుగులు పడుతున్నాయి. డిసెంబర్‌లో కారిడార్-2 అందుబాటులోకి వచ్చాక దీనికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. కాగా దీనికి ముందే ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ట్రాఫిక్ రద్దీతో సతమతమయ్యే నగర ప్రజలకు రైలు, రోడ్డు రవాణా సదుపాయాల్లో ఏది అందుబాటులో ఉంటే దానిలో సులువుగా ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర జీవనంలో సమయం సద్వినియోగం చేసుకునేలా ప్రయాణికులకు కామన్ ట్రావెల్ టికెట్ కార్డును ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. మెట్రో మొబిలిటీ కార్డు పేరుతో పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్న ఈ కార్డు ప్రయాణికుడి వద్ద ఉంటే హైదరాబాద్ నగర ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేసిన మెట్రో రైలుతోపాటు జంటనగరాల్లో ప్రయాణికులను చేరవేసే ఎంఎంటీఎస్, సిటీ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీల్లో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు.

అయితే ఈ కార్డులు ప్రారంభం రూ.1,000, 2,000లలో లభించనున్నాయి. ప్రయాణం చేయడం ద్వారా కార్డులో ఉన్న మొత్తం ఖర్చయితే సులభంగా రీచార్జ్ చేసుకునేలా ఈ కార్డు ఉంటుంది. కార్డు ఉంటే చాలు వీటిలో ఏ ప్రయాణ సౌకర్యాన్నైనా వినియోగించుకునే వీలు కల్పించారు. ప్రస్తుతమున్న విధానం ప్రకారం మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ, ట్యాక్సీ, ఆటో ఏది ఎక్కి ప్రయాణించినా సంబంధిత సంస్థ/వ్యక్తికి ప్రయాణ చార్జీలు చెల్లించాల్సిందే. మెట్రో, ఎంఎంటీఎస్ ప్రయాణానికి కౌంటర్ల వద్ద టికెట్ కోసం క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. అయితే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటంతోపాటు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశారు.

మెట్రోరైలులో ప్రస్తుతం అమలు చేస్తున్న సాఫ్ట్‌వేర్‌తోపాటు స్మార్ట్‌కార్డు విధానంలోనే కొత్త కార్డు తయారీ, వినియోగం ఉండనున్నది. కార్డులన్నీ మెట్రోరైలు, నగర రైల్వేస్టేషన్లతోపాటు, బస్‌స్టేషన్లు, ఎస్‌బీఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయి. మెట్రో నడిచే మార్గాల్లో ముందుగా రెండు మెట్రోస్టేషన్లు, 100 ఆర్టీసీ బస్సులు, 50 ఆటోల్లో వీటిని 2019 చివరి నాటికి పైలట్ ప్రాజెక్టుగా మొబిలిటీ కార్డును అందుబాటులోకి తెస్తారు. ఇప్పటికే నగరంలో వాహనాలు అరకోటి దాటడం వాహన కాలుష్యం తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుంది.

88

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles