గణపయ్య.. సిద్ధమయ్య.!

Thu,September 12, 2019 05:09 AM

-మరికొన్ని గంటల్లో మహాగణపతి నిమజ్జనం
-ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభం
-క్రేన్ నం. 6 వద్ద 12.30 నుంచి 1గంట మధ్య
-శోభాయాత్రను ప్రారంభించనున్న మేయర్ బొంతు రామ్మోహన్

ఖైరతాబాద్ : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవం నేడు అశేష భక్త జన నీరాజనాల మధ్య జరుగుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఖైరతాబాద్ గణేశుడిని తొలి నిమజ్జనం చేస్తారు. ఆ మేరకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేశాయి. ఉదయం 7 గంటల నుంచి నిమజ్జన శోభయాత్ర ఖైరతాబాద్ గణపతి మండపం నుంచి ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్రను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభిస్తారు. 61 అడుగుల ఎత్తు 45 టన్నులకు పైగా బరువున్న విగ్రహాన్ని తరలించేందుకు అన్ని రకాల సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు బాలానగర్ నుంచి ఉప మండపాల్లో కొలువుదీరిన విగ్రహాలను తరలించేందుకు చిన్న ట్రాలీ తెప్పించారు. రాత్రి 12గంటల నుంచి 1గంట వరకు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాత్రి 1గంట నుంచి 2గంటల మధ్య ఉప మండపాల్లో కొలువుదీరిన విగ్రహాలు ట్రాలీల్లోకి తీసుకువస్తారు. రాత్రి 2గంటల నుంచి 4గంటల మధ్య మహాగణపతిని క్రేన్ సాయంతో భారీ ట్రాలీ మీదకు చేరుస్తారు.

క్రేన్ నం.6 వద్ద నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతిని కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేసేవారు. అయితే ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహం సగం మాత్రం నిమజ్జనం అవుతుండటంతో అగమ శాస్త్ర నియమాల ప్రకారం గణపతి విగ్రహాలు గంగలో పూర్తిగా నిమజ్జనం కావాలి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం విగ్రహాన్ని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ ప్రత్యేక చొరవ తీసుకొని నిమజ్జనం చేసే స్థల మార్పు చేశారు. ఈ మేరకు డ్రోన్‌లతో సాగర్‌లో లోతు ఉన్న ప్రాంతాల డేటాను కూడా తెప్పించుకున్నారు. దీంతో క్రేన్ నం. 6వ వద్ద 20 అడుగులకు పైగా లోతు ఉన్నట్లు నిపుణులు సూచించడంతో అక్కడే నిమజ్జనం చేసేందుకు నిర్ణయించారు.

165

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles