యంత్రం లేకుండానే డయాలసిస్‌పై నూతన పరిశోధనలు


Sat,September 21, 2019 02:00 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోజురోజుకు కొత్త ఒరవడులు తొక్కుతున్న వైద్యవిధానంలో నిరుపేదలకు ఆర్థిక భారంగా మారుతున్న కిడ్నీ వ్యాధుల చికిత్సకు ప్రత్యమ్నాయ పద్ధతుల కోసం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యంత్రం, దవాఖానతో అవసరం లేకుండా కేవలం మనిషితో మనిషికి డయాలసిస్ చేసే అలో-డయాలసిస్‌విధానంపై మరిన్ని పరిశోధనలు చేయడానికి నగరంలోని విరించి దవాఖాన అమెరికాలోని ప్రముఖ రీనల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు దవాఖాన చైర్మన్ కొంపెల్ల విశ్వనాథ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గచ్చిబౌలి హెచ్‌ఐసీసీలోని నోవాటెల్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యూయార్‌లోని ఆర్‌ఆర్‌ఈ డైరెక్టర్ ప్రొఫెసర్ పీటర్ కొటాంకోతో కలిసి ఒప్పంద వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న హీమో డయాలసిస్ పద్ధతి నిరుపేద రోగులకు ఖర్చుతో పాటు సమయం వృథాతో కూడుకున్నదని డయాలసిస్ విధానంలో సరికొత్త సులువైన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమెరికాకు చెందిన రీనల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


యంత్రాలతో సంబంధం లేకుండా ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుంచి రోగికి అలో-హీమోడయాలసిస్ అనే పరికరం ద్వారా ఇంట్లోనే డయాలసిస్ చేయవచ్చని ఆయన వివరించారు. దీనిపై ఇప్పటికే ఆర్‌ఆర్‌ఈ పరిశోధనలు జరుపుతుందని తదుపరి పరిశోధనల్లో పాల్గొనేందుకు విరించి దవాఖాన ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వనాథ్ వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే డయాలసిస్ బాధితులకు ఎంతో మేలుజరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నెఫ్రాలజిస్టు డా.ఎస్. కె.నాయక్ తదితరులు పాల్గొన్నారు.

211

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles