పాతబస్తీకి మెట్రో..


Sat,September 21, 2019 02:02 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :ప్రభుత్వం చెప్పినట్లే పాతబస్తీకీ మెట్రోరైలు రానున్నది. సున్నితమైన అంశాలతో కూడిన చారిత్రక, మతపరమైన కట్టడాలకు ఏమాత్రం నష్టం జరుగకుండా ఐదు స్టేషన్లతో 5.5 కిలోమీటర్ల మెట్రోనిర్మాణాన్ని చేపట్టనున్నారు. పాతబస్తీకి మెట్రో నిర్మాణం ఉంటుందనే విషయంపై ఇప్పటికే పదేపదే స్పష్టత ఇస్తున్నారు. అయితే అక్కడి పరిస్థితుల వల్ల నిర్మాణపరమైన ఇబ్బందులను క్లియర్ చేసుకుని కారిడార్ నిర్మించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారు. మెట్రోకారిడార్ 2కు సంబంధించి సీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న మెట్రోమా ర్గంలో స్టేషన్లను ప్రముఖ చారిత్రక కట్టడాల పేర్లతో స్టేషన్లను నిర్మించనున్నారు. కొద్ది నెలల క్రితం పాతబస్తీలో ఎంజీబీఎస్‌లోని దార్ ఉల్ షిఫా జంక్షన్ నుంచి ఫలక్‌నుమా వరకు ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, స్థానిక ఎమ్మెల్యేలు సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, ఆహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాలతో కలిసి హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పర్యటించి అలైన్‌మెంట్ మార్గాన్ని పరిశీలించారు.


రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా పాతబస్తీలో జీహెచ్‌ఎంసీ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మతపరమైన, ఇతర సున్నితమైన అంశాలతో కూడిన కట్టడాలు దెబ్బతినకుండా మెట్రో నిర్మాణం జరుగాలని ఓవైసీ సలహా మేరకు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. జీహెచ్‌ఎంసీ ఆర్‌డీఎఫ్ పనుల్లో భాగంగా చేపట్టనున్న 100 ఫీట్ల రోడ్డు మార్కింగ్‌తో పాటు ఫిల్లర్ మార్కింగ్ చేసేందుకు ఇప్పటికే సర్వేను పూర్తిచేశారు. కారిడార్2కు సంబంధించి జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో జేబీఎస్ నుంచి సీబీఎస్ ఆపరేషన్స్‌కు సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న 5.5 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తిచేసేందుకు కసరత్తు జరుగుతున్నది. ఈ విషయాన్ని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ కూడాఅసెంబ్లీలో ప్రస్తావించారు.

ఖరారైన స్టేషన్ల పేర్లు
ఇప్పటికే 5.5 కిలోమీటర్ల మార్గంలో రానున్న 5 స్టేషన్ల పేర్లు ఖరారున్నాయి. సాలర్జంగ్ మ్యూజియం స్టేషన్, చార్మినార్ స్టేషన్, శాలిబండ స్టేషన్, శంషేర్‌గంజ్ స్టేషన్, ఫలక్‌నుమా స్టేషన్లుగా నిర్మించనున్నారు. మెట్రో అలైన్‌మెంట్ ప్రకారం సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్ కట్టడాలు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికున్న ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం దృష్ట్యా వీటిపేర్లను ఖరారుచేశారు.

326

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles