24 నుంచి బతుకమ్మ చీరలు


Sun,September 22, 2019 01:06 AM

-జీహెచ్‌ఎంసీ పరిధిలో.. 15.40లక్షల మంది లబ్ధిదారులు
-ఎంపిక చేసిన ప్రాంతాల్లో 30 వ తేదీ వరకు పంపిణీ


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:ఈనెల 24న జీహెచ్‌ఎంసీ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి 30వ తేదీ వరకు కొనసాగించాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ప్రారంభ కార్యక్రమం సందర్భంగా కనీసం రెండువేల మందికి చీరలు పంపిణీచేసే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టంచేశారు. పంపిణీ ఏర్పాట్లపై శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రి తలసాని అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు కురిసే అవకాశమున్నందున చీరల పంపిణీకి అసౌకర్యం కలుగకుండా ఫంక్షన్‌హాళ్లు, కమ్యునిటీ తదితర అనువైన ప్రదేశాలను ఎంపికచేయాలని సూచించారు. ఈ ఏడాది ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండి, తెలుపురంగు రేషన్ కార్డు కలిగివున్న 1.02 కోట్లమంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నదని, ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 15.40లక్షల మంది లబ్ధిపొందుతారని తెలిపారు.

పది రంగులు, పది రకాల డిజైన్లతో చీరలు తయారుచేసినట్లు, డివిజన్లు, సర్కిళ్లవారీగా ఎంపికచేసిన ప్రాంతాల్లో చీరల పంపిణీ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చీరల పంపిణీ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ప్రజలకు వివరించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. అవసరమైతే రాష్ట్ర సాంస్కృతికశాఖ సహకారం తీసుకోవాలని, లేనిపక్షంలో స్థానిక కళాకారుల నియమించుకోవాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హోం మంత్రి మహమూద్‌అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద, సుభాష్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మాజీమంత్రి నాయిని నరసింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ప్రారంభించనున్న మంత్రులు
ఈనెల 24న ఉదయం తొమ్మిది గంటలకు సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని మల్టీపర్పస్ ఫంక్షన్‌హాలులో, అలాగే పది గంటలకు అమీర్‌పేట్ డివిజన్‌లోని వివేకానంద కమ్యునిటీహాలులో మంత్రి తలసాని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు అంబర్‌పేట్, 12 గంటలకు గోషామహల్ నియోజకవర్గాల్లో ప్రారంభించే చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. సికింద్రాబాద్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, పాతబస్తీలో హోం మంత్రి మహమూద్‌అలీ, మేడ్చల్‌లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చీరల పంపిణీ కేంద్రాలను ప్రారంభిస్తారు.

సమస్యలపై చర్చ
బతుకమ్మ చీరల పంపిణీపై సమీక్ష పూర్తయిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఇళ్ల క్రమమబద్ధీకరణకు సంబంధించిన జీవో నెం-58, 59తోపాటు జీహెచ్‌ఎంసీలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలు, సీజనల్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై వారు మాట్లాడారు. వచ్చే నెల మొదటివారంలో నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించి దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తలసాని ఎమ్మెల్యేలకు హామీనిచ్చారు. ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలోని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు.

185

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles