బిజీ బిజీ

Wed,July 10, 2019 02:37 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల పనుల్లో అధికారులు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే డివిజన్ల విభజన పూర్తి కాగా.. మంగళవారం అర్ధరాత్రి వరకు ఓటర్ల జాబితా సిద్ధం కావడంతో ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారు. దీనికి సంబంధించి కిందిస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించే పనుల్లో నిమగ్నమయ్యారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో డివిజన్ల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేసే పనులు సాగుతున్నాయి. ఓటరు జాబితా తయారీతో పాటు డివిజన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఏర్పాట్లలోనే ఉన్నారు. బుధవారం ఉదయమే ఈ ఓటరు జాబితా ప్రకటించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, వాటి పరిశీలన అనంతరం 14న తుది జాబితా ప్రకటించనున్నారు.

ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు
కాగా, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటికే నగరంలో 312 పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు వాటిల్లో లైటింగ్, ఇతర పర్నిచర్‌తో పాటు, దివ్యాంగులు వచ్చే విధంగా ర్యాంపులు, ఇతర సదుపాయాలు కల్పించే విషయంలోనూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు బ్యాలెట్ బాక్సులను పెట్టుకునేందుకు స్ట్రాంగ్ రూంలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అవసరమయ్యే వాహనాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే ఎన్నికల నిర్వహణకు వచ్చే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నోడల్, పర్యవేక్షలు ఇలా ఇతర సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేసే విషయంలో అధికారులు దృష్టి సారిస్తున్నారు.

800 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం
ఈసారి మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తుండడంతో ప్రతి 800 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొనగా, దీనికి అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. కొత్తగా ఏర్పాటైన డివిజన్ల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆయా మున్సిపల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. డివిజన్ల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ పాఠశాలలు, ఇతర కార్యాలయాలు, ప్రైవేటు పాఠశాలల భవనాల వివరాలు సేకరిస్తున్నారు. పోలింగ్ బూత్‌కు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించి చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డుల విభజన పూర్తి కాగా, బుధవారం ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల కానుంది. ఈనెల 14న తుది జాబితా ప్రకటించనున్నారు. ఇది పూర్తి కాగానే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన జాబితాలు, ఏర్పాట్లపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఈనెల 15 పోలింగ్ కేంద్రాలను గుర్తించి. జాబితా అందించనున్నారు. అనంతరం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి అభ్యంతరాల పరిశీలన అనంతరం ఈనెల 19న తుది జాబితా విడుదల చేయనున్నారు.

ఆయా తేదీల్లో జరిగే పనులు
14న డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు
15న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల
17న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ
15న 3 గంటలకు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం
18న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను సిద్ధం చేసి రిటర్నింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్‌కు అందించడం
19న తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన.

అన్ని సదుపాయాలూ కల్పించాలి
నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, పారిశుధ్య, అకౌంట్స్ అధికారులతో ఎన్నికల ముంద స్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభాగాల వారీ గా కేటాయించిన ఎన్నికల విధులకు అధికారులు సి ద్ధం కావాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 312 పో లింగ్ సేష్టన్లను గుర్తించామనీ, డివిజన్ల వారీగా పో లింగ్ సేష్టన్లను ఎంపిక చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ సేష్టన్లను, అక్కడ ఉన్న సదుపాయాలను త నిఖీ చేయాలనీ, వీటికి సంబంధించిన రిపోర్టు అం దించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను టౌన్ ప్లానింగ్ అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్, స్ట్రాంగ్ రూంల ఎంపికకు ప్రత్యేకాధికారి అనుమతి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. చెకింగ్ బ్యాలెట్ పేపర్ ముద్రించేందుకు పక్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు నిర్వహించే ఏర్పాట్లు, సౌకర్యాల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. నగరపాలక ఎన్నిలకు సంబంధించి 20 మంది రిటర్నింగ్, 60 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. కలెక్టర్ నుంచి నోడల్ అధికారితో పాటు ఎన్నికల పర్యవేక్షణ అధికారులను కూడా నియమించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles