మహాద్భుతం

Mon,July 15, 2019 01:41 AM

- కాళేశ్వరం ఎత్తిపోతల పథకం దేశానికే గర్వకారణం
- ప్రతి నిర్మాణంలో ఇంజినీర్ల పనితీరు గొప్పది
- ప్రపంచం గర్వించదగ్గ ప్రాజెక్టుల్లో మొదటిది
- మరో రెండు నెలల్లో తెలంగాణ సస్యశ్యామలం
- కొనియాడిన శిక్షణ ఐఏఎస్‌లు, గ్రూప్-1 అధికారులు
- లక్ష్మీపూర్ ఎనిమిదో ప్యాకేజీ సందర్శన


రామడుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతమని శిక్షణ ఐఏఎస్‌లు, గ్రూప్-1 అధికారులు కొనియాడారు. శనివారం మధ్యా హ్నం రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీకి రెండు బస్సుల్లో చేరుకున్న హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న ఎనిమిది మంది ఐఏఎస్‌లు, 59 మంది గ్రూప్-1 అధికారుల బృందానికి ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్ ఘన స్వాగతం పలికారు. క్యాంపు ఆవరణలోని ప్రత్యేక కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రాజెక్టు నిర్మాణంపై నమూనాల ద్వారా వివరించారు. గోదావరి నదిపై ప్రాణహిత, గోదావరి కలిసే చోట మేడిగడ్డ వద్ద మొదటి బ్యారేజీని నిర్మించినట్లు చెప్పారు. అక్కడి నుంచి బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, టన్నెళ్ల ద్వారా లక్ష్మీపూర్‌లోని ఎనిమిదో ప్యాకేజీకి నీరు వస్తుందనీ, ఇక్కడి నుంచి ఎత్తిపోసి ఒకవైపు మధ్య మానేరుకు, మరోవైరు ఎస్సార్‌ఎస్పీ పునర్జీవన పథకంలో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించనున్నట్టు వివరించారు. మరో నెల రోజుల్లో ఎనిమిదో ప్యాకేజీలో వెట్న్ చేపట్టనున్నట్లు తెలిపారు.

అనంతరం రెండు బస్సులతో పాటు పలు వాహనాల్లో సొరంగమార్గం ద్వారా సుమారు 60 మీటర్ల లోతులో ఉన్న సర్వీస్‌బే విభాగానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఐదు మోటార్లకు నీటిని సరఫరా చేసే సర్జిఫూల్ చేరుకొని పరిశీలించారు. అక్కడి నుంచి మరో 60 మీటర్ల లోతులో ఉన్న పంపుహౌస్‌కు చేరుకొని మోటార్‌ఫ్లోర్‌లో బిగించిన బాహుబలి మోటార్ లోపలి విభాగాలను చూపించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బీహెచ్‌ఈఎల్ వారి సహకారంతో తయారు చేసిన ఈ మోటార్లు ప్రపంచ సాగునీటి రంగంలో ఇప్పటి వరకు ఎక్కడా ఉపయోగించలేదన్నారు. ఇందులో భాగంగా రెండు టన్నెల్స్ ఎందుకు నిర్మించారనీ, ఒకటే పెద్ద టన్నెల్ ఏర్పాటు చేస్తే సరిపోతుందని ఓ ట్రైనీ ఐఏఎస్ పేర్కొనగా ఈఈ శ్రీధర్ సమాధానమిస్తూ ఒకే సొరంగంతో క్యావిటీలు ఏర్పడే ప్రమాదం ఉందనీ, అంతపెద్ద సొరంగానికి పైన మట్టి, ర్యాక్ నిలిచి ఉండే అవకాశం ఉండదని విరించారు. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో భూ ఉపరితలంలోని డెలివరీ సిస్టర్న్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా శిక్షణ అధికారులు మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ ప్రాజెక్టుల్లో కాళేశ్వరం మొదటిస్థానంలో నిలుస్తుందన్నారు. ఇంతభారీ ప్రాజెక్టును మన రాష్ట్రంలో నిర్మించడం.. శిక్షణలో భాగంగా తమకు సమగ్రంగా వివరించడం ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ప్రాజెక్టు చివరిదశకు చేరుకుందనీ, మరికొన్ని రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సరఫరా అయ్యే నీటిలో తెలంగాణ సస్యశ్యామలం కానుందన్నారు. సాయంత్రం నాలుగున్నర తరువాత హైదరాబాద్ తిరిగి వెల్లారు. ఇక్కడ శిక్షణ ఐఏఎస్‌లు అభిలాష, ఆదర్శ్, అనుదీప్, హేమంత్, శ్రీహర్ష, కుమార్ దీపక్, మాసంబ మగ్ధలమ్, తేజస్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఫ్యాకల్టీ ఝాన్షీరాణితో పాటు 59 మంది గ్రూప్ 1 అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ వెంకట నారాయణ, మండల తాసిల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ లక్ష్మణ్, ప్రాజెక్టు ఏఈఈలు శ్రీనివాస్, సురేష్, రమేష్, వెంకటేష్ పాల్గొన్నారు.

తెలంగాణ బిడ్డగా గర్విస్తున్నా..
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి యావత్ తెలంగాణ రాష్ర్టానికి తాగు, సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నందుకు ఒక తెలంగాణ బిడ్డగా గర్విస్తున్నా. ఇంతభారీ ప్రాజెక్టును ఇప్పటి వరకు నాకు తెలిసి దేశంలో ఎక్కడా నిర్మించలేదు. వంద మీటర్ల నుంచి సుమారు ఐదు వందల మీటర్ల ఎత్తులో వందల కిలోమీటర్లు నీటిని తీసుకురావడం అనే విషయం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చెప్పవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం తెలంగాణకే కాదు.. భారతదేశానికే గర్వకారణం.
- దుర్శెట్టి అనుదీప్, శిక్షణ ఐఏఎస్ అధికారి (హైదరాబాద్)

ఇంజినీర్ల పనితనం చాలా గొప్పది..
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుత మానవ నిర్మాణం. ఇంతవరకు దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు. శిక్షణలో భాగంగా ఐఏఎస్‌లు, గ్రూప్-1 అధికారులందరం కలిసి చూడడానికి వచ్చాం. పాతాళంలో టన్నెల్స్ నుంచి మొదలు మోటార్ల బిగింపు, సొరంగ మార్గాలు, సర్జిపూల్స్‌తో పాటు ఇంత ఎత్తులో నీటిని పంపుచేయడం సాధారణ విషయం కాదు. ఈ నిర్మాణంలో ఇంజినీర్ల పనితనం గొప్పది. ఎక్కడో గోదావరి నీటిని ఎత్తిపోస్తూ.. ఎత్తిపోస్తూ తెలంగాణ అంతటికీ నీటిని అందించడం ఓ వింత అయితే రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్‌కు తరలించడం మరో విశేషం.
- హర్ష, శిక్షణ ఐఏఎస్ అధికారి (హైదరాబాద్)

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles